Saturday, December 22, 2012

మహా వాగ్గేయ కవి క్షేత్రయ్య

కర్ణాటక సంగీతంలో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య (1595-1660) ఒకడు. ఈయన అసలు పేరు మెువ్వా వరదయ్యగా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించి వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు క్షేత్రజ్ఞుడనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్యగా మారింది. క్షేత్రయ్య జీవితకాలం 1595 - 1660 మధ్యకాలం కావచ్చును. ఇతని అసలుపేరు వరదయ్య. ఇంటిపేరు మెువ్వ. క్షేత్రయ్య పదాలలోని వరద అనే ముద్ర స్వనామ ముద్రగా భావించి అతని అసలుపేరు ’వరదయ్య’గా నిర్ణయించారు. ఈయన జన్మస్థ్థలం ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌లోని, కృష్ణా జిల్లాలో మెువ్వ గ్రామం. ఆ ఊరిలో వెలసిన వేణుగోపాల స్వామి క్షేత్రయ్యకు ఇష్టదైవం.

క్షేత్రయ్య
జనబాహుళ్యంలో ఉన్న కథ ప్రకారం చిన్నతనంనుండి వరదయ్యకు గాన అభినయాలంటే మక్కువ. కూచిపూడిలో ఒక ఆచార్యుని వద్ద నాట్యం నేర్చుకొన్నారు. సహపాఠి అయిన మోహనాంగి అనే దేవదాసితో సన్నిహితుడైయ్యారు. తరువాత మేనమామ కూతురు రుక్మిణిని పెండ్లాడారు. కానీ మోహనాంగి పట్ల అతని మక్కువ తగ్గలేదు. దేవదాసి అయిన మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట. మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేయసాగాడట. ఆ సాధన కారణంగా ప్రపంచములోని జీవాత్మలన్నీ స్ర్తీలని, పరమాత్ముడయిన మువ్వగోపాలుడొక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకొన్నదట. క్రమంగా ఆ మధురభక్తితో అనేక పాటలు పాడాడు. వాటికి మోహనాంగి నాట్యం చేసిందట. బాల్యంలో విద్యాగంధం లేని వరదయ్య పశువుల కాపరిగా ఉండేవాడు. ఒక యోగి ఇతనికి ’గోపాల మంత్రం’ ఉపదేశించాడు. ఆనాటి నుండి అతనికి గొప్ప కవితా శక్తి అలవడిందని మరో కథనం..


గుర్తింపు:  ఆంధ్ర దేశంలోని తిరుపతి, కడప, శ్రీశైలం మున్నగు క్షేత్రాలలో నెలకొన్న దేవతలపైనే కాక కంచి, శ్రీరంగం, మధుర, తిరువళ్ళూరులలో వెలసిన స్వామి వార్లపై కూడా క్షేత్రయ్య పదాలు రచించారు. కానీ అన్నిటిని మువ్వ గోపాలునికి అంకితం గావించి ఆ స్వామితో ఆయా దేవతలకు అభేదం కల్పించారు. ఈ దేశాటనం కారణంగానే అతనికి క్షేత్రయ్య అనే నామం స్థిరమైనదనిపిస్తున్నది. ముందుగా గుంటూరు జిల్లా బెల్లంకొండలో చలుపు చక్కరపురీశుని దర్శించారు.(చలువ చక్కెకపురి నిలయుడని మదిలో వలవేసి నిను వలపించలేద?). అనంతరం భద్రాచలంలోని సీతారామచంద్రస్వామిని, పిదప శ్రీశైలం మల్లికార్జునుని, ఆపై హంపి హేమాద్రి నిలయుని దర్శించారు. క్షేత్రయ్య దర్శించిన ఇతర క్షేత్రాలు - పాలగిరి చెన్నకేశవుడు, ఇనగలూరు ఇనపురి స్వామి, (దేవుని) కడప వెంకటేశ్వర స్వామిని దర్శించారు.

తిరుపతి చేరి వెంకటేశ్వర స్వామి, ఇతర దేవతామూర్తులపై అనేక పదాలు రచించారు.పిదప దక్షిణాభిముఖంగా సాగి (దక్షిణ ఆర్కాటు జిల్లా) కోవిల్లూరు మువ్వగోపాల స్వామిని దర్శించారు. తిరువళ్ళూరు వీర రాఘవస్వామి, వేద నారాయణపురం వేదపురీశుడు, సత్యవేడు సత్యపురవాసుదేవుడు, కరిగిరి స్వామి దేవుళ్ళ దర్శనం చేసుకుని మార్గంలో పండితుల, పాలకుల సత్కారాలందుకొన్నారు. క్షేత్రయ్యను ఎందరో ప్రభువులు సన్మానించారు. వారిలో మధురనేలిన తిరుమల నాయకుడు, గోల్కొండ నవాబు, తంజావూరు రఘునాధ నాయకుడు, చెంజి కృష్ణ్ణప్ప నాయుడు (తుపాకుల రాయుడు) ప్రముఖులు. రఘునాధ నాయకునిపై క్షేత్రయ్య వేయి పదాలు చెప్పారు.

చిదంబంరం గోవిందస్వామిని తిల్ల గోవిందస్వామి అని క్షేత్రయ్య ప్రస్తుతించారు. చిదంబరం పాలకుడైన కృష్ణప్పనాయకుని సన్మానం అనంతరం క్షేత్రయ్య తంజావూరు వెళ్ళి రఘునాధనాయకుని ఆస్థానంలో కొంతకాలం ఉన్నారు. అక్కడినుండే శ్రీరంగం, కంచి, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించారు. క్షేత్రయ్య దర్శించిన క్షేత్రాలలోని దైవం గురించి కొన్ని క్షేత్రయ్య పదాలు మనకు లభిస్తున్నాయి.1646లో తంజావూరు పతనమై గోల్కొండ నవాబు వశమైంది. గోల్కొండ సైన్యాధిపతి మీర్‌ జుమ్లా సాహిత్యాభిమాని. క్షేత్రయ్యను సగౌరవంగా గోల్కొండ నవాబు సుల్తాన్‌ అబ్దుల్లా కుతుబ్‌ షా వద్దకు తోడ్కొని వెళ్లాడు.ఆ నవాబు ఆస్తానంలో క్షేత్రయ్య పెక్కుకాలం ఉండి 1500 పదాలు వ్రాశారు.తిరుగుప్రయాణంలో భద్రాచలం క్రొత్త తాసిల్దార్‌ కంచెర్ల గోపన్న క్షేత్రయ్యను ఆదరించారు. అనంతరం క్షేత్రయ్య తన స్వగ్రామం మొవ్వకు తిరిగివచ్చారు. తాను వివిధ పాలకులవద్ద కూర్చిన పదాలగురించి క్షేత్రయ్య పదాల ద్వారా మనకు తెలుస్తుంది. క్షేత్రయ్య కథాంశంతో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రం గతంలో విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది.

1 comment: