Monday, December 24, 2012

నాడు అప్పుల్లో.. నేడు కోట్లల్లో

LIC AGENT &
APPSC MEMBER
నాడు అప్పుల్లో.. నేడు కోట్లల్లోఒక్క పైరవీ అతని జీవితాన్నే మార్చేసింది. నాలుగేళ్లలోనే కోటీశ్వరుడిని చేసింది. మొన్నటి వరకు అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ను సొంత నిధులతో కొనుగోలు చేసే స్థోమత లేక బ్యాంకు రుణం తీసుకొన్న ఆ అధికారి ఇప్పుడు రాయలసీమలోనూ, రాజధానిలోనూ సుమారు రూ.100కోట్ల విలువైన పొలాలు, స్థలాలు, ఫ్లాట్లు సొంతం చేసుకొన్నారు. ఇంతకీ ఎవరీ ఘనాపాఠి అని ఆలోచిస్తున్నారా! ఆయనే..ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడు. సొంత కుటుంబీకుల పేరుతోనూ బినామీ పేర్లతోనూ ఉన్న అతని ఆస్తులను పరిశీలిస్తే అతని సంపాదనా తీరు ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతోంది. ఏపీపీఎస్సీ పరీక్షల్లో మౌఖికం ఉండాల్సిందేనని పట్టుపడుతున్న ఈ సభ్యుడి తీరుపై 'ఈనాడు' ప్రతినిధులు దృష్టి సారించినపుడు స్వల్పకాలంలోనే అతను సంపాదించిన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.

ఉద్యోగార్థులకు పైసల పరీక్ష

ఏపీపీఎస్సీలో కొందరు సభ్యుల వ్యవహార శైలిని ఈనాడు వెలుగులోనికి తెచ్చిన విషయం తెలిసిందే. కమిషన్‌లోని ఆరుగురు సభ్యులు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి దాదాపు 5 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ఉద్దేశించిన రాత పరీక్షల ఫలితాలు వెల్లడించకుండా అడ్డుపడిన విషయమూ విదితమే. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగాలిచ్చే అవకాశం ఉన్నా అభ్యర్థులకు మౌఖిక పరీక్షను కూడా నిర్వహించాల్సిందేనని కమిషన్‌ సభ్యులు ఆరుగురు పట్టుబడుతున్నారు. వీరి మొండిపట్టుదలకు కారణం మౌఖికం పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో లంచాలు దండుకోవటానికేనని పెద్దఎత్తున ఆరోపణలువస్తున్నాయి. గతంలో ఇలాగే కొంతమంది సభ్యులు అక్రమ వసూళ్లకు పాల్పడి రూ.కోట్లు పోగేశారని, ఏపీపీఎస్సీ వ్యవస్థనే అపహాస్యం పాల్జేచేశారు. తాము కోరినంత డబ్బు ముట్టజెప్పిన వారికి మౌఖిక పరీక్షలో అధికమార్కులు వేయటం, ప్రతిభ కలిగి డబ్బులివ్వలేని వారికి చాలా తక్కువ మార్కులు వేయడం వంటి అక్రమాలకు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు జరిగాయి. వీటన్నిటి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కొన్నింటికి మినహా మిగిలిన పోటీ పరీక్షలకు మౌఖిక పరీక్షలను రద్దు చేసింది. దీంతో అక్రమ సంపాదనకు కొంతవరకు అడ్డుకట్టపడే అవకాశం కలిగింది. ఇది ఏమాత్రం ఇష్టంలేని కమిషన్‌లోని ఆరుగురు సభ్యులు అన్ని పోటీ పరీక్షలకు మౌఖికం ఉండాల్సిందేనని కోరుతున్నారు. దీని కోసమే రాత పరీక్షల ఫలితాలను సైతం వెల్లడించకుండా అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఈనాడు ప్రతినిధులు' గత కొన్నేళ్లుగా ఏపీపీఎస్సీలో సభ్యుడిగా పని చేస్తున్న ఒక అధికారి ఆర్థిక స్థితిపై ఆరా తీసింది. దీంతో నివ్వెరపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆయన అనుంగు అనుచరుడి పైరవీతో ఏపీపీఎస్సీ సభ్యునిగా నియమితుడైన ఈ అధికారి జీవిత విధానం ఒక్కసారిగా మారిపోయింది. తొలుత ఒక ప్రభుత్వ రంగ సంస్థలో అధికారిగా పనిచేసిన ఆయన 2000లో హైదరాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లోని అయిదో అంతస్తులో ఒక ఫ్లాట్‌ను బ్యాంకు రుణంతో కొనుగోలు చేసి అందులోనే నివాసం ఉండేవారు. అలాంటి ఆర్థికస్థితి ఉన్న వ్యక్తి ఏపీపీఎస్సీ సభ్యుడైన తర్వాత కొన్ని ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మౌఖిక పరీక్షల్లో అక్రమ వసూళ్లకు తెరలేపారన్న ఆరోపణలు వచ్చాయి. కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఒకొక్క అభ్యర్థి నుంచి రూ.లక్షకు తగ్గకుండా వసూలు చేసినట్లు తెలిసింది. ఇప్పటికీ ఆయనకు డబ్బులిచ్చి ఉద్యోగాలు రాని బాధితులున్నారని సమాచారం.

ఇవీ ఆస్తులు :

  • కడప జిల్లా సంబేపల్లి, చిత్తూరు జిల్లా కలగడ మండలాల్లోని ఈ రెండు జిల్లాల సరిహద్దులో 50 ఎకరాల పట్టాభూమిని ఈ ఏడాది జులైలో కొనుగోలు చేశారు. 
  • కలగడ మెయిన్‌రోడ్డులో నాలుగు ఎకరాలు, పీలేరు వద్ద కేవీపురం ఒంటిళ్లు వద్ద 6 ఎకరాలు కొనుగోలు చేశారు. 
  • బెంగళూరు-హోసూరు రోడ్డులోని బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోని 'గెస్ట్‌లైన్‌ డేస్‌' హోటల్‌ వద్ద 15 ఎకరాలు... 
  • హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ ఇండోర్‌ స్టేడియం వెనుక వెంకటగిరి ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఆరు ప్లాట్లు కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు.. 
  • షాద్‌నగర్‌ సమీపంలో ఓ ద్రాక్ష తోట. 
  • హైటెక్‌ సిటీ వద్ద గురుకుల ట్రస్ట్‌ భూముల్లో ఒక్కోటి వేయి గజాల విస్తీర్ణమున్న మూడు ప్లాట్లు కొనుగోలు చేసి అందులో నాలుగంతస్తుల దుకాణ సముదాయాన్ని నిర్మించారు. 
  • ఆయా ఆస్తులన్నీ భార్య, తండ్రి, సోదరులు, సోదరిలు, మరికొందరు బినామీల పేరిట ఉన్నాయి. 
  • తనను ఏపీపీఎస్సీలో సభ్యునిగా నియమించడంలో సహాయపడిన వై.ఎస్‌. అనుంగు అనుచరుడినే ప్రస్తుతం ఆమడ దూరం పెట్టడం కొసమెరుపు.

No comments:

Post a Comment