Thursday, December 27, 2012

రిపుంజయరెడ్డి అరెస్టు


రిపుంజయరెడ్డి అరెస్టుపాపం పండింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయరెడ్డి అవినీతి బండారం బట్టబయలైంది. కమిషన్‌లో సభ్యత్వ పదవిని ఆడ్డుపెట్టుకొని రూ.నాలుగు కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం జరిపిన దాడుల్లో వెల్లడైంది. ఇదంతా ఆయన ఏపీపీఎస్సీ సభ్యుడిగా ఎంపికైన తర్వాత సంపాదించిన ఆస్తిగానే భావిస్తున్నామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు రింపుజయరెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఏసీబీ కార్యాలయానికి తరలించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ అవినీతి బాగోతంపై గవర్నర్‌కు పూర్తి స్థాయి నివేదిక పంపింది. రిపుంజయరెడ్డిని పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. గురు లేదా శుక్రవారం నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్ర చరిత్రలో ఏపీపీఎస్సీ సభ్యుడు అరెస్టు కావడం ఇదే ప్రథమం.

ఏపీపీఎస్సీ సభ్యులైన కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం లక్షలాది మంది యువత ఆశలను దెబ్బ తీస్తున్నారని ఆధారాలతో సహా 'ఈనాడు' ప్రచురించిన కథనాలు తాజా పరిణామాలతో అక్షర సత్యాలే అయ్యాయి.'ఈనాడు' కథనాల నేపథ్యంలో అసలు ఏపీపీఎస్‌సీలో జరిగింది ఏమిటో నివేదికను పంపమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన రెండు రోజుల్లోనే ఏసీబీ దాడులు జరగడం సంచలనం సృష్టించింది. ఏపీపీఎస్‌సీలో పదవిలో ఉంటూ భారీఎత్తున అక్రమాలకు, అక్రమార్జనకు పాల్పడ్డ రిపుంజయరెడ్డికి ఈ పదవిని ఇచ్చింది వై.ఎస్‌.రాజశేఖరెడ్డి కావడం గమనార్హం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత సహాయకుడు సూరీడు సిఫార్సుతో ఈ పదవిని ఆయనకు కట్టబెట్టారు. రిపుంజయరెడ్డితో వ్యాపార సంబంధాలున్న సూరీడు ఇంటిమీదా ( హైదరాబాద్‌లో) దాడులు జరిగాయి. అక్కడ రిపుంజయరెడ్డికి సంబంధించిన కొన్ని పత్రాలు లభించాయి. వాటిని అధ్యయనం చేస్తున్నారు. హైదరాబాద్‌లో, రిపుంజయరెడ్డి స్వస్థలమైన కడపలో దాడులు నిర్వహించారు. సోమవారం ఉదయం మొదలైన దాడులు రాత్రి ఎనిమిది గంటల వరకూ కొనసాగాయి. మొత్తం 8 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. యూసఫ్‌గూడలోని వెంకటగిరిలో ఉన్న ఆయన ఇల్లు, సమీపంలోని ఆయన ఇద్దరు సోదరుల ఇళ్ళు, జుబ్లీహిల్స్‌ గాయత్రీనగర్‌లోని సూరీడు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీల ఆధ్వర్యంలో హైదారాబాద్‌లో దాడులు జరిగాయి. దాడుల్లో రూ.నాలుగు కోట్లకుపైగా ముఖ విలువైన ఆస్తులు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్‌లో కొన్ని రెట్ల విలువ ఉంటుందని చెబుతున్నారు. ఈ ఆస్తులన్నీ రిపుంజయరెడ్డి ఏపీపీఎస్సీ సభ్యుడు అయ్యాక సమకూర్చుకున్నవని భావిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్‌ వెల్లడించారు. రిపుంజయరెడ్డి తొలుత జీవిత బీమా ఏజెంట్‌. 1998 నుంచి 2003 వరకూ జీవిత బీమా సంస్థలో వ్యాపారాభివృద్ధి అధికారిగా పని చేశారు. 2008లో ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు.

ఏసీబీ దాడుల్లో తిరుపతి, కొండాపూర్‌, రాజేంద్రనగర్‌లలో ఐదు అపార్లుమెంట్లలో అయిదు ఫ్లాట్లు ఉన్నట్లు వెల్లడయింది. వెంకటగిరిలో మూడు, మణికొండ, గాంధీనగర్‌లలో ఒకటి చొప్పున మొత్తం ఐదు ఇళ్ళ స్థలాలు ఉన్నట్లు తేలింది. కడపలో రెండు, మాదాపూర్‌, కొండాపూర్‌లలో ఒక్కోటి చొప్పున నాలుగు ఇళ్ళు, రిపుంజయరెడ్డి నివసిస్తున్న వెంకటగిరిలోని అపార్టుమెంట్లో మూడు ప్లాట్లు ఉన్నట్లు బయటపడింది. కడప, రేణిగుంటలలో 36 ఎకరాల పొలం ఉంది. పత్రాల రూపంలో ఉన్న స్థిరాస్తి విలువే రూ.3.5 కోట్లు ఉంటుందని ఏసీబీ తెలిపింది. నిందితుడు, అతని కుటుంబ సభ్యుల పేర్లమీద రూ.30.5 లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. 63 తులాల బంగారం, 3.5 కిలోల వెండి, రూ.12.50 లక్షల విలువైన రెండు కార్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్‌ కెనరా బ్యాంకులో లాకర్‌ ఉన్నట్లు గుర్తించామని, దాన్ని కూడా పరిశీలించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన మొత్తం ఆస్తుల ముఖ విలువ రూ.4 కోట్లు పైన ఉంటుందని ఆ ప్రకటనలో వివరించారు.



'నాపై కుట్ర జరుగుతోంది. ఏపీపీఎస్‌సీ సభ్యుడయ్యాక నేను ఆస్తులు సంపాదించలేదు' అంటూ రెండు రోజుల కిందట ఈనాడుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రిపుంజయరెడ్డి అసలు భాగోతాన్ని ఏసీబీ బయటపెట్టింది. 2008లో కమిషన్‌ సభ్యుడైన తరువాతే రూ.4 కోట్ల విలువైన ఆస్తులను సంపాదించారని వెలుగులోకి తెచ్చింది. ఇంకా పెద్దఎత్తున బినామీ పేర్లతో ఆస్తులు ఉన్నాయని అనేక మంది ఈనాడుకు ఫోన్‌ చేసి మరీ చెబుతున్నారు. వై.ఎస్‌. హయాంలో అయిదుగురు సభ్యులు నియమితులు అయ్యారు. అందులో కొందరిపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సూరీడు సిఫార్సుతో రిపుంజయరెడ్డి కమిషన్‌ సభ్యుడిగా నియమితుడయ్యాక ఇద్దరి మధ్యా వ్యాపార బంధాలు బలపడ్డాయని చెబుతున్నారు. వీరిద్దరు కల్సి రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో రియల్‌ ఎస్టేస్‌ వ్యాపారం చేశారని అంటున్నారు. బినామీ పేర్లతో ఆస్తులు కొన్నారని సమాచారం అందుతోంది. బినామీ పేర్లతో ఉండటంతో ఏసీబీ విచారణలో వెలుగులోనికి రావడం లేదు. సూరీడుతోనే కాకుండా కొంతమంది కాంగ్రెస్‌ నేతలతో కలిసి రిపుంజయరెడ్డి వ్యాపారం చేశారని అంటున్నారు. ఈ వ్యాపారమంతా కమిషన్‌ సభ్యుడిగా నియమితుడయ్యాక చేసిందే. దీన్నిబట్టి చూస్తే కమిషన్‌లో ఎంతపెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయోననే అనుమానం బలపడుతోంది. కొన్ని పోస్టులకు రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారని నిరుద్యోగులు చెబుతున్నారు. 

దీనివల్లే కొందరు సభ్యులు కొద్దికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తారని అంటున్నారు.కమిషన్‌ సభ్యుల్లో అక్రమాలను ఈనాడు వెలుగులోనికి తేవడంతో ప్రభుత్వం, గవర్నర్‌ స్పందించారు. రిపుంజయరెడ్డి అక్రమాలపై 'నాడు అప్పుల్లో, నేడు కోట్లలో' శీర్షికతో కథనం ఇవ్వడంతో ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఏసీబీ రంగంలోకి దిగింది. దాడులతో కమిషన్‌ సభ్యుల అక్రమాలు వెలుగులోనికి వచ్చాయి. రిపుంజయరెడ్డికి మరికొందరితో ఉన్న అనుబంధాన్ని గురించి ఏసీబీ అధికారులు ఆరాతీస్తున్నారు. బినామీ ఆస్తులు వెలుగులోకి వస్తే మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.రిపుంజయరెడ్డిని ఏపీపీఎస్సీ పదవి నుంచి తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ అభియోగాలు వచ్చిన వారిని తొలగించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. బుధవారం రిపుంజయరెడ్డి అరెస్టు అనంతరం ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్‌కు బుధవారం రాత్రి నివేదిక పంపింది. అరెస్టు నేపథ్యంలో పదవి నుంచి తొలగించాలని కోరినట్లు సమాచారం. గవర్నర్‌ ఆదేశాలకు అనుగుణంగా సభ్యుడి పదవీచ్యుతి ఉత్తర్వులు జారీ అవుతాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది. రిపుంజయరెడ్డిని గురువారం కోర్టులో హాజరు పరుస్తారు.

No comments:

Post a Comment