Monday, December 31, 2012

ఎపిపిఎస్సీ సభ్యుల అధికారాలకు కత్తెర !

•పద్దయ్యపైనా తప్పని విచారణ

• కొత్త ఛైర్మన్‌ రాకతో ఆరు నోటిఫికేషన్ల జారీ

• సభ్యుల పిటిషన్‌ నేడు హైకోర్టులో నిలిచేనా..

ప్రభుత్వోద్యోగాల పోస్టుల భర్తీలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎపిపిఎస్సీ సభ్యుల అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేయనుంది. ఈ మేరకు రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికిప్పుడు తొలగించే అధికారం లేకపోవడంతో ప్రకటనల జారీలో సభ్యుల సంతకాలతో సంబంధం లేకుండా చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సభ్యుల ఆమోదం ఉన్నా లేకున్నా కొత్త ఛైర్మన్‌ సిఆర్‌ బిశ్వాల్‌ ఆరు ఉద్యోగాల ప్రకటన జారీ చేశారు. అదే విధంగా పరీక్షలు పూర్తయి ఫలితాలకు నోచుకోని నోటిఫికేషన్లను వెనువెంటనే విడుదల చేయడానికి ఎపిపిఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్య కారణాలతో సెలవుల్లో ఉన్న కార్యదర్శి పూనం మాలకొండయ్య తిరిగి విధుల్లోకి చేరిన తర్వాత ఛైర్మన్‌ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమిషన్‌ వ్యవహారాలపై అందరితో చర్చించాల్సిన అవసరం ఉందని, అందరినీ కలుపుకుని ముందుకుపోతానని బిశ్వాల్‌ తెలిపారు.

ఛైర్మన్‌, సెక్రటరీ, సభ్యుల మధ్య ఇంట ర్వ్యూల అంశం వివాదాస్పదం కావడంతో ఎపిపిఎస్సీలో అవినీతి బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండకూడదని ప్రభుత్వం 420 జీవో విడుదల చేస్తే, ఇంటర్వ్యూలు ఉండాలని ఆరుగురు సభ్యులు పట్టుబట్టారు. ఈ పంచాయితీ లోకాయుక్త నుండి హైకోర్టు వరకు చేరింది. వాటిపై రోజుకోరకంగా కథనాలు వస్తుండడంతో ప్రభుత్వం, గవర్నర్‌ దృష్టి సారించారు. నివేదికలు తెప్పించుకున్నారు. సభ్యులపై మండిపడ్డారు. ఈ లోపు ఇంటర్వ్యూల్లో సభ్యులు ఒక్కో పోస్టుకు కొంత మంది సభ్యులు 20 లక్షల నుండి 50 లక్షల వరకు బేరమాడినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో రిపుంజయరెడ్డి ఇంటిపై ఎసిబి అధికారులు దాడిచేయడం, అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించడం చకాచకా జరిగిపో యాయి. దాంతోపాటు మరో సభ్యులు పద్దయ్యపైనా అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను విచారిస్తారని తెలిసింది. ఇలా నౌమాన్‌, పోచయ్య, రవీందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ ఒక్కొక్కరిపై విచారణ జరుపుతారని సమాచారం. ఈ సమయంలో వారిని కమిషన్‌లో ఉంచాలా, పక్కన పెట్టాలా అన్న దానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది.

కమిషన్‌ వ్యవహారాలపై అప్పటి ఛైర్‌పర్సన్‌ రేచల్‌ ఛటర్జీ ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన గవర్నర్‌ నరసింహన్‌ వారిని పక్కన పెడితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారని రాజ్‌భవన్‌ వర్గాల కథనం. పక్కన పెట్టడానికి రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. ఈ విషయంలో రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతోనూ గవర్నర్‌ చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రపతి నుండి ఆమోదం పొందాలంటే చాలా సమయం తీసుకుంటుంది. అప్పటివరకు సభ్యులకున్న అధికారాలకు కత్తెర వేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి గవర్నర్‌ సూచించినట్లు తెలిసింది. దాని ప్రకారమే సభ్యుల అధికారాలు లేకుండా చేయడానికే మొగ్గు చూపిందని సమాచారం. కొత్తగా నియమితులైన మిగతా ముగ్గురు సభ్యుల అధికారాలపై అధికారులు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛైర్మన్‌, సెక్రటరీలపై సభ్యులు హైకోర్టులో వేసిన పిటీషిన్‌ ఈనెల 31న విచారణకు రానుంది. వారిపై ఆరోపణలు రావడంతో ఆ పిటీషన్‌ నిలుస్తుందా లేదా అన్నది అనుమానమే.

No comments:

Post a Comment