Thursday, December 27, 2012

పచ్చనోట్లే ఇంధనం

 పచ్చనోట్లే ఇంధనంప్రభుత్వ ఉద్యోగుల నియామకం కోసం రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వివిధ రాష్ట్రాల్లోని ప్రజాసేవా సంఘాలు (పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్స్‌) దోపిడీ కేంద్రాలుగా మారాయి. నిష్పక్షపాతంగా, నిజాయితీతో వ్యవహరించాల్సిన ఈ సంఘాల సభ్యులు.. ఉద్యోగాలను ఎరగాచూపి నిరుద్యోగుల నుంచి రూ.కోట్లలో దండుకొని తమ ఆదాయాన్ని కొండల్లా పెంచుకొంటున్నారు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన సమస్య కాదు. పొరుగునున్న తమిళనాడులోనూ అక్కడి ప్రజా సేవా సంఘం (ప్రసేసం) సభ్యులు భారీ అక్రమాలకు తెరలేపారు. నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున దండుకున్నారన్న ఆరోపణలపై తమిళనాడు ప్రసేసం ఛైర్మన్‌సహా 13 మంది సభ్యుల గృహాలపై అక్టోబర్‌లో ఆ రాష్ట్ర నిఘా(విజిలెన్స్‌), అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మన రాష్ట్రంలోనూ ప్రసేసం సభ్యుడు రిపుంజయ రెడ్డి ఇంటిపై బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ప్రజా సేవా సంఘాలకు సభ్యులను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే నియమిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, లాలూచీ వ్యవహారాలతో అధికారంలో ఉన్న వారూ తమకు అనుకూలమైన వారినే సభ్యులుగా నియమించుకొంటున్నారు. క్రమంగా ఇది సభ్యుల విశృంఖల ప్రవర్తనకు దారితీస్తోంది. డబ్బుకు, సిఫార్సులకు ప్రాధాన్యం పెరగటంతో నిజాయితీగా కష్టపడి చదువుతున్న నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

మన రాష్ట్రంలో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలోనూ ఆ తర్వాతా కొంత మంది కాంగ్రెస్‌ నేతలనే ప్రసేసం సభ్యులుగా నియమించిన విషయం తెలిసిందే. ఇలా నియమితులైన సభ్యుల్లో కొందరు అక్రమ వసూళ్లకు తెగించి కోట్ల రూపాయలు పోగేసుకొన్నారన్న ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రసేసం సభ్యుడు రిపుంజయ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సంగతి బుధవారం నాటి అవినీతి నిరోధక శాఖ దాడుల్లో తేలింది. వై.ఎస్‌. సహాయకుడిగా ఉన్న సూరీడుతో కలిసి రిపుంజయరెడ్డి భూములు కొనుగోలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. 'నాకు అన్ని ఆస్తులు లేవ'ని రిపుంజయ రెడ్డి ప్రకటించిన రెండు రోజుల్లోనే ఏసీబీ దాడుల్లో వాస్తవమేమిటో తెలియవచ్చింది. మిగిలిన సభ్యుల్లో ఒకరిద్దరు కూడా ఇలానే అక్రమాస్తులు కూడబెట్టారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌లాంటి కొన్ని ఉద్యోగాలకు ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేశారని వారు చెబుతున్నారు. ఇలాంటి సభ్యుల ఇళ్లపై కూడా దాడులు చేస్తే వారి బండారమూ బయటపడుతుందని అంటున్నారు.రాష్ట్ర ప్రసేసం సభ్యులపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల్లోని ప్రజా సేవా సంఘాల తీరును 'ఈనాడు' పరిశీలించింది. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రసేసం ఛైర్మన్‌, 13 మంది సభ్యుల తీరు తెలియవచ్చింది. అక్టోబర్‌ నెలలో ఛైర్మన్‌, సభ్యులందరి ఇళ్లపైనా తమిళనాడు నిఘా-అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు ఒక సభ్యుడి ఇంటిలో ఏకంగా రూ.26.3 లక్షల నగదు పట్టుబడింది. మరో సభ్యుడి సోదరుడి పక్క ఇంటి నుంచి రూ.17 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.కోట్ల విలువైన ఆస్తుల్నీ గుర్తించారు. సభ్యులపై అవినీతి నిరోధక చట్టంలోని వివిధ నిబంధనల కింద కేసులు నమోదు చేశారు. సమగ్ర విచారణ జరుగుతోంది.


No comments:

Post a Comment