Saturday, December 22, 2012

ముదిరి పాకన పడ్డ ఏపీపీఎస్సీ విభేదాలు

•తారాస్థాయికి చేరిన ఏపీపీఎస్సీ రచ్చ

•మరోసారి లాంగ్‌లీవ్‌పై వెళ్లిన పూనంమాలకొండయ్య

•అంతర్గత విభేదాలే కారణమని అనుమానం

•రెండు నెలల విరామం తర్వాత ఇటీవలే విధుల్లోకి చేరిన పూనం

•సభ్యులు లోకాయుక్తకు వెళ్లడంపై మనస్థాపం...?

•ఆందోళనలో నిరుద్యోగులు

•సభ్యులపై చర్యలకు విద్యార్థి సంఘాల డిమాండ్‌

ఏపీపీఎస్సీలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. కొన్నాళ్లుగా కమిషన్‌ సభ్యులకు, అధికారులకు మధ్య విభేదాలతో రాతపరీక్షల ఫలితాలు నిలిచిపోయాయి. ఇప్పటికే అధికారుల తీరును నిరసిస్తూ కొంతమంది సభ్యులు లోకాయుక్తకు వెళ్లడం తదనంతర పరిణామాలతో కార్యదర్శి పూనం మాలకొండయ్య మరోసారి లాంగ్‌లీవ్‌పై వెళ్లిపోయారు.తాజా పరిస్థితులతో నిరుద్యోగుల్లో కలవరం మొదలైంది.మొత్తానికి ఏపీపీఎస్సీ సభ్యులు అనుకున్నది సాధించారు. తమను పట్టించుకోవడం లేదంటూ కమిషన్‌ కార్యదర్శిపై లోకాయుక్తకు కంప్లైంట్‌ చేసినప్పటికీ అక్కడ వెనుదిరిగారు మెంబర్లు. ఎలాగైనా తమ కోపం తీర్చుకోవాలనుకున్నారు. రాత పరీక్షల ఫలితాల విడుదలను అడ్డుకోవడం, ఇంటర్య్వూలు నిర్వహించాలని పట్టుపట్టడం... ఇలా రకరకాలుగా సెక్రటరీతో విభేదిస్తూ వచ్చారు సభ్యులు. కమిషన్‌లోని ఆరుగురు సభ్యులు ఏపీపీఎస్సీ ప్రతిష్టను రచ్చకీడ్చారు.

లక్షలాది నిరుద్యోగులకు ఆశాదీపంగా చెప్పుకునే ఏపీపీఎస్సీలో జరుగుతున్న పరిణామాలతో నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది.కాలిగాయంతో రెండునెలల విరామం తర్వాత విధుల్లోకి చేరిన కార్యదర్శి పూనం మాలకొండయ్య... జరుగుతున్న పరిణామాలతో విసిగిచెందినట్లు సమాచారం. అందుకే మరోసారి నెలరోజులపాటు సెలవుపై వెళ్లిపోయారు. ఇటీవల కాలంలో వరుసగా రాతపరీక్షల ఫలితాలు విడుదల చేస్తూ నిరుద్యోగుల్లో ఆశలు నింపారు. ఇప్పుడు పూనం సెలవుపై వెళ్లడం, త్వరలోనే ఛైర్‌పర్సన్‌ పదవీకాలం ముగుస్తుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెంబర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి, యువజన సంఘాలు కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే ఫలితాలు విడుదల కోసం లక్షలాదిమంది ఎదురుచూస్తుంటే తాజా పరిణామాలతో అసలు ఎప్పుడు వస్తాయో తెలియని గందరగోళం నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

No comments:

Post a Comment