Wednesday, December 26, 2012

ఏపిపిఎస్సి కొత్త ఛైర్మన్ గా చిత్తరంజన్ బిస్వాల్

C.R. BISWAL
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బిస్వాల్‌ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రజాసేవా సంఘం(ఏపీపీఎస్సీ) నూతన ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చిత్తరంజన్‌ బిస్వాల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకం ఈ నెల 29 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కమిషన్‌ ప్రస్తుత ఛైర్మన్‌ రేచల్‌ ఛటర్జీ ఈ నెల 28న పదవీ విరమణ పొందనున్నారు. ఏపీపీఎస్సీ సభ్యులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొత్త ఛైర్మన్‌ ఎంపిక ఉత్కంఠ కలిగించింది. రేచల్‌ ఛటర్జీ స్థానంలో ఛైర్మన్‌ ఎంపిక కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూ సహా పలువురు అధికారుల పేర్లను పరిశీలించారు. మిన్నీ మాథ్యూను సీఎస్‌గా కొనసాగించే అవకాశం ఉండడంతో ఏపీపీఎస్సీకి మరొకరిని నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. మిన్నీ మాథ్యూ సైతం ఈ పోస్టుపై అంతగా ఆసక్తి చూపలేదు. ఆమె మినహా ఇతర అభ్యర్థుల పేర్లను పరిశీలించాక చివరికి బిస్వాల్‌ వైపు మొగ్గుచూపారు. ఒడిశాకు చెందిన బిస్వాల్‌ 1981 బ్యాచ్‌ అధికారి. గత నెలాఖరులో పదవీ విరమణ పొందారు. రాష్ట్రంలో పలు శాఖల్లో పనిచేశారు. సాధారణ పరిపాలన శాఖ, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎక్కువ కాలం విధులు నిర్వర్తించారు. పరిపాలన అనుభవాన్ని, రాష్ట్రంలో నెలకొన్న ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని.. రాష్ట్రేతర అధికారి నియామకమే మేలన్న ఉద్దేశంతో బిస్వాల్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment