Saturday, December 22, 2012

తప్పుల కుప్ప! వివాదాల కేంద్రంగా ఏపీపీఎస్సీ నియామకాలన్నీ కేరాఫ్ కోర్టులే అనువాద దోషాలు.. తప్పుడు 'కీ'లు, పరిధి దాటే ప్రశ్నలు ప్రహసనంగా మారిన ఇంటర్వ్యూల ప్రక్రియ నిరుద్యోగులతో కమిషన్, సర్కారు ఆటలు

ఆర్థిక మాంద్యం సమయంలో ప్రైవేటు కొలువులు గాలిలో దీపాలుగా మారాయి. అప్పటిదాకా వేలు, లక్షల్లో జీతాలందుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు దిక్కుతోచక రోడ్డున పడ్డారు. అప్పుడు అందరికీ తెలిసొచ్చింది... ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న విలువెంతో! ఆ తర్వాత సర్కారీ కొలువులకు క్రేజ్ మరింత పెరిగింది. ఒక్కొక్కరు పుస్తకాల పురుగులయ్యారు. వేల రూపాయలు ఖర్చుపెట్టి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. పోస్టుల సంఖ్య వందల్లో, పోటీపడే అభ్యర్థుల సంఖ్య లక్షల్లో! కానీ... ఘనత వహించిన మన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రతిసారీ నిరుద్యోగులను ముప్పతిప్పలు పెట్టి ముప్పై చెరువుల నీళ్లు తాగిస్తోంది. కమిషన్ అసమర్థ నిర్వాకంవల్ల కోర్టుల్లో కుప్పలు తెప్పలుగా పిటిషన్లు దాఖలవుతున్నాయి.

అతని పేరు శ్రీనాథ్. 2008 డిసెంబర్‌లో ఏపీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్-2, గ్రూప్-1 నోటిఫికేషన్లకు శ్రీనాథ్ దరఖాస్తు చేసుకున్నాడు. రెండింటిలో నెగ్గాడు. కానీ... ఇప్పటిదాకా ఏ ఉద్యోగమూ రాలేదు. సుమారు మూడేళ్ల సర్వీసు, జీతం, జీవితం కోల్పోయి... కుటుంబ సభ్యులు, మిత్రులకు సమాధానం చెప్పుకోలేక పీకల్లోతు అప్పుల్లో మునిగి శ్రీనాథ్‌లాంటి వారు ఎంతోమంది దిక్కులు చూస్తున్నారు. దీనికి కారణం... సర్వీస్ కమిషన్ నిర్వాకమే. గ్రూప్-2 విషయానికి వస్తే... రాత పరీక్షలో తెల్లఇంకు (వైట్‌నర్) వాడటం నిషిద్ధమని కమిషన్ స్పష్టంగా చెప్పలేదు. దీంతో కొందరు వైట్‌నర్‌ను వాడారు. ఇలా.. తెల్ల ఇంకు వాడిన అభ్యర్థులను తొలగించాలని కొందరు ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. ఈ వివాదం హైకోర్టుకు, ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీం తీర్పురానిదే ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందవు. ఇది పూర్తవడానికి ఎన్ని నెలలైనా పట్టొచ్చు. ఇక.. గ్రూప్-1 పోస్టుల భర్తీకి కమిషన్ 2008 డిసెంబర్ 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011కు గానీ మెయిన్స్ పరీక్ష నిర్వహించలేకపోయారు. మెయిన్స్ పరీక్షల్లో తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాల్లో దర్శనమిచ్చిన అనువాద దోషాలు ఏపీపీఎస్సీ పరువుతీశాయి. పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇవ్వకపోవడంతో కమిషన్ ఊపిరి పీల్చుకుంది. అయితే... కోర్టు తీర్పు ప్రకారం మార్కుల్లో మార్పులు చేయాల్సి ఉండటంతో నియామక ప్రక్రియ పెండింగ్‌లో పడింది.

ఇక 2011లో జారీ అయిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ది మరో కథ! ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ముగిసి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రిలిమ్స్‌లో ఆరు ప్రశ్నలకు తప్పుడు జవాబులున్నట్టు గ్రహించి కమిషన్ వాటికి అందరికీ మార్కులిచ్చింది. మరో ఏడు ప్రశ్నలకు ఏపీపీఎస్సీ తన 'కీ'లోనే తప్పుడు జవాబులు ఇచ్చింది. దీనివల్ల తాము మెయిన్స్‌కు అర్హత కోల్పోయామంటూ కొందరు రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ కేసు కొనసాగుతోంది. డిగ్రీ అధ్యాపక పోస్టుల భర్తీదీ అదే కథ! రాత పరీక్ష 'కీ' విడుదల చేయకుండా ఇంటర్వ్యూలు జరపడం సరికాదంటూ అభ్యర్థులు కొందరు కోర్టుకెక్కారు. ఇంటర్వ్యూలు ముగియగానే 'కీ' విడుదల చేయాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిరుడు నిర్వహించిన జనరల్ స్టడీస్ రాత పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలకు 30 ప్రశ్నలు పూర్తిగా ఆంగ్లంలో, మరో 33 ప్రశ్నలు సగం ఆంగ్లం- సగం తెలుగులో ఉండటం చూసి తెలుగు మాధ్యమం అభ్యర్థులు కంగుతిన్నారు.

ఇక 2008 గ్రూప్-2, 2011 గ్రూప్-2 నోటిఫికేషన్ల రాత పరీక్షల 'కీ' ని కమిషన్ ఇంకా ప్రకటించలేదు. సమాచారం లేదు... రాదు! ఏపీపీఎస్సీ పారదర్శకతకు ఆమడ దూరంలో ఉంటుంది. 'అసలు ఏమిటీ గందరగోళం? ఏది నిజం?' అని ఎవరైనా సమాచార హక్కు చట్టం కింద ఏపీపీఎస్సీకి దరఖాస్తు చేసుకుంటే... అది వారి అమాయకత్వమే అవుతుంది. కమిషన్ నుంచి వారికి 'ఫీల్ గుడ్' తరహా సమాధానమొస్తుంది! "నియామకాల ప్రక్రియ బ్రహ్మాండంగా సాగుతోంది. ఎంపిక ప్రక్రియ పూర్తికాగానే మీరు కోరిన సమాచారం పువ్వులో పెట్టి ఇస్తాం'' అంటూ రొటీన్ సమాధానం ఇస్తుంది. ఆర్టీఐ చట్టాన్ని పదేపదే తుంగలో తొక్కుతుండటంతో ఏపీపీఎస్సీకి రాష్ట్ర సమాచార కమిషన్ జరిమానాల రూపంలో మొట్టికాయలు వేసింది. మాయదారి ఇంటర్వ్యూలు రాత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అభ్యర్థులు సైతం ఏపీపీఎస్సీ చిత్ర విచిత్ర ఇంటర్వ్యూల దెబ్బకు బొక్కబోర్లాపడుతుంటారు. ఇంటర్వ్యూల నిర్వహణకు ఏపీపీఎస్సీ సభ్యుల నాయకత్వంలో నాలుగైదు బోర్డులు ఏర్పాటవుతుంటాయి. పీజీలు, ఎంఫిల్‌లు చేసి ఏళ్లతరబడి పోటీపరీక్షలకు సన్నద్ధమై ఇంటర్వ్యూ దశకొచ్చిన తమను కమిషన్‌లో సాధారణ విద్యార్హతలు గల సభ్యులు కొందరు మిడిమిడి జ్ఞానంతో నేలబారు ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారనేది అభ్యర్థుల విమర్శ.

కమిషన్ ఛైర్మన్‌గా వెంకట్రామిరెడ్డి ఉన్నప్పుడు మౌఖిక పరీక్షల తీరుతెన్నులపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం ఏపీపీఎస్సీలో అక్రమాలు, అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సత్యనారాయణ కమిటీ.. గ్రూప్-1, జేఎల్-డీఎల్ మినహా ఇతర పోస్టులకు మౌఖిక పరీక్షలు అక్కర్లేదని అది తేల్చి చెప్పింది. ఆ ప్రకారం గ్రూప్-2 సహా ఇతర పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 420 జారీ చేసింది. తమ పెత్తనానికి ఈ జీవో గండికొడుతుందని భావించిన ఏపీపీఎస్సీ సభ్యులు అది అమలు కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లు, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇన్ ఏపీ లైఫ్ ఇన్స్యూరెన్స్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ ప్లానింగ్ పోస్టులకు కొద్ది నెలల క్రితం రాత పరీక్షలు నిర్వహించారు. వాటికి ఇంటర్వ్యూలు ఉండవని నోటిఫికేషన్లలో ఏపీపీఎస్సీ స్పష్టీకరించింది. అయినా, మౌఖిక పరీక్షలు జరపాల్సిందేనని మొండికేసిన కమిషన్ సభ్యులు రాత పరీక్షల ఫలితాలు విడుదలవకుండా ఆపేయించారు. జీవో 420ను అమలు చేయాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మ్యాథ్యూ ఆదేశాలివ్వడంతో త్వరలో ఆ పరీక్షల ఫలితాలు విడుదలకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలు నిరుద్యోగుల జీవితాలు బుగ్గిపాలవడానికి ఆయా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, వాటి ఓటు బ్యాంకు రాజకీయాలూ కారణమే. ఖాళీల సంఖ్య ఎక్కువా , తక్కువా అనే దానితో నిమిత్తం లేకుండా యూపీఎస్సీ ప్రతి ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం నియామక ప్రక్రియ ముగించేస్తుంది. మన రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు విరుద్ధం. ఐదేళ్లకోసారి ఎన్నికలొచ్చినప్పుడే అధికార పార్టీలకు నియామకాల సంగతి గుర్తొస్తుంది.

 2009 అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని 2008 డిసెంబరులో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు జారీ చేసింది. అభ్యర్థుల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 39 ఏళ్ల వరకు పెంచి ఐదేళ్ల మినహాయింపు ఇచ్చింది. 2011లో గ్రూప్స్ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు మాత్రం కిరణ్ సర్కారు పూర్వసంప్రదాయానికి నీళ్లొదిలి ఓపెన్ అభ్యర్థుల్ని 36 ఏళ్ల వరకే అనుమతించింది. ఫలితంగా వేల మంది పరీక్ష రాసే అర్హత కోల్పోయారు. 2014 ఎన్నికల సంవత్సరం కావడంతో... ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ల జాతర మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రూప్-1లో 300, గ్రూప్-2లో 600 ఎగ్జిక్యూటివ్, వెయ్యి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండొచ్చని నిరుద్యోగుల అంచనా. రాబోయేది 'ఎన్నికల నోటిఫికేషన్' కనుక ఈసారి గరిష్ఠ వయో పరిమితి 39 ఏళ్లుగా నిర్ణయించవచ్చుననే అంచనాతో... సీనియర్ అభ్యర్థులు కూడా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కాగా.. ఎన్నికల్లో ఓడిన వారు, ఏ పదవులూ దక్కక అసమ్మతితో రగిలే చోటా నేతల్ని సంతృప్తిపర్చడానికి ఏపీపీఎస్సీని ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నాయి.

గల్లీ నాయకులూ కమిషన్ సభ్యులుగా నియమితులై నెలకు రూ.79 వేల గౌరవ వేతనం పొందుతూ దర్జా వెలగబెడుతున్నారు.

No comments:

Post a Comment