Monday, December 31, 2012

ఏపీపీఎస్సీలో 'చారిత్రక' అక్రమాలు!

డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీలో అవకతవకలు
 
ఉర్దూ పోస్టులు తెలుగుకు మళ్లింపు
 
జనరల్ పోస్టు ఎస్సీ రిజర్వేషన్‌కు మళ్లింపు
 
అభ్యర్థికి సహకరించిన ఏపీపీఎస్సీ
 
దరఖాస్తు నుంచి ఎంపిక వరకూ అభ్యర్థి ఎత్తులు
 
పరీక్షల్లో ముందు, వెనక అస్మదీయులు
 
అర్హత లేకపోయినా కమిషన్ అనుమతి
 
ఒక్కడి కోసం చక్రం తిప్పిందెవరు!?

ఒకే ఒక్కడి కోసం.. నోటిఫికేషన్ తర్వాత ఏపీపీఎస్సీ నిబంధనలనే మార్చేసింది! ఉర్దూ పోస్టులను తెలుగులోకి మళ్లించేసింది! జనరల్ పోస్టులను రిజర్వేషన్లో కలిపేసింది! పోస్టు సాధించేందుకు దరఖాస్తు దాఖలు చేసినప్పటి నుంచి సదరు అభ్యర్థి పన్నిన వ్యూహమూ నభూతో! ఇటీవల ఏపీపీఎస్సీ నిర్వహించిన డిగ్రీ లెక్చరర్ (హిస్టరీ) పోస్టుల భర్తీలో చోటుచేసుకున్న అక్రమాలివి.

వివరాల్లోకి వెళితే.. గత ఏడాది ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో డిగ్రీ (హిస్టరీ) లెక్చరర్ పోస్టుకు గుండు నాగేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నాడు. అతని దరఖాస్తు సంఖ్య జీడీసీఎల్-502952. హాల్ టికెట్ నెంబర్ - 43010807. శుక్రవారమే ఫలితాలు ప్రకటించారు. ఈ పోస్టుకు ఆయన ఎంపికయ్యారు. శనివారం నాడే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. రేపో మాపో ఉద్యోగంలో చేరిపోతాడు. కానీ, ప్రతిభ ఆధారంగా ఉద్యోగం లభిస్తే వింతేముంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది మొదలు.. ఎంపికయ్యే వరకు జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.

నల్లగొండ జిల్లా మునగాలకు చెందిన నాగేశ్వరరావు హిస్టరీ డిగ్రీ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇతను బీసీ (బి) కేటగిరీకి చెందిన వ్యక్తి. ఆ కేటగిరీలో పురుషులకు పోస్టులు లేవు. అంటే ఆయన ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించాలి. ఓపెన్ కేటగిరీలో ఉన్నవి నాలుగు పోస్టులు. వాటిలో మొదటి రెండు తెలుగు మీడియం. మూడు, నాలుగు ఉర్దూ మీడియంకు సంబంధించినవి. అంటే మొదటి రెండు స్థానాల్లో ఉంటేనే ఇతనికి పోస్టు లభిస్తుంది. కానీ, నాగేశ్వరరావు సాధించింది ఐదో ర్యాంకు. అయినా నేడో, రేపో ఉద్యోగంలో చేరబోతున్నాడు. అదెలాగంటే..

ఏపీపీఎస్సీ వరుస తప్పులు

నాగేశ్వరరావుకు పోస్టు వచ్చేలా ఏపీపీఎస్సీ అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కింది. ఐదో ర్యాంకు అభ్యర్థికి పోస్టు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ చేసిన మొదటి తప్పు ఉర్దూ పోస్టులను తెలుగు మీడియం అభ్యర్థులకు ఇవ్వడం. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా కాకుండా మధ్యంతరంగా ఉర్దూ పోస్టులను తెలుగు మీడియం అభ్యర్థులకు మళ్లించారు. అయినా, ఐదో ర్యాంకు వచ్చిన నాగేశ్వరరావు ఈ పోస్టు పొందేందుకు అర్హుడు కాదు.

అందుకే ఏపీపీఎస్సీ మరో తప్పిదానికి పాల్పడింది. ఈ పరీక్షల్లో ఎస్సీ అభ్యర్థి ఒకరు మూడో ర్యాంకు సాధించారు. సహజంగా జనరల్ కేటగిరీలోనే సదరు అభ్యర్థికి పోస్టింగ్ ఇవ్వాలి. కానీ, నాగేశ్వరరావు కోసమే జనరల్ కేటగిరీలో పోస్టింగ్ ఇవ్వాల్సిన మూడో ర్యాంకర్ (ఎస్సీ)ను ఎస్సీ కోటాలోకి మార్చారు. తద్వారా, ఐదో ర్యాంకు సాధించిన నాగేశ్వరరావు ఉద్యోగానికి అర్హత సాధించేలా పావులు కదిపారు.

దరఖాస్తు నుంచే వ్యూహాత్మకం

హిస్టరీ డిగ్రీ లెక్చరర్ల పరీక్షల్లో ఐదో ర్యాంకు సాధించిన నాగేశ్వరరావు ప్రతిభ చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మక మానవు. ఆయన ఇంటి పేరు గుండు. ఆంగ్లంలో ఇంటి పేరులో మొదటి అక్షరం 'జి'. ఆయన తండ్రి పేరు చంద్రయ్య. ఆయన పేరులోని మొదటి అక్షరం 'సి'. సాధారణంగా, ఏపీపీఎస్సీలో పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు అక్షర క్రమంలోనే హాల్ టికెట్లకు నెంబర్లను కేటాయిస్తారు. అందుకే, తనకు ముందు వెనక కూడా తనవారే వచ్చేలా చూసుకున్నాడు. మరో నలుగురితో దరఖాస్తు చేయించడమే కాదు. వారి ఇంటి పేర్లు 'జి' వచ్చేలా చూసుకున్నాడు.

ఆ నలుగురి పుట్టిన తేదీలూ ఒక్క రోజు తేడాతోనే ఉండడం మరో విశేషం. వారిలో ఒక అభ్యర్థి పేరు గుంజ నాగేంద్ర. ఆయన తండ్రి పేరు చంద్రమౌళి. పుట్టిన తేదీ 2.1.1973. మరో అభ్యర్థి పేరు గుండెపురి నాగేశ్వరవర్మ. ఆయన తండ్రి చంద్రకాంత్ వర్మ. పుట్టిన తేదీ 3.1.1973. ఇంకో అభ్యర్థి గుండా నాగేశ్వర్. తండ్రి పేరు చక్రం. పుట్టిన తేదీ 8.1.1973. మరికొందరు అభ్యర్థుల వివరాలూ ఇదే విధంగా ఉన్నాయి. ఈ అభ్యర్థులు అందరి ఇంటి పేరూ 'జీ'నే. తండ్రి పేరులోని మొదటి అక్షరం 'సి'నే. వారి పుట్టిన తేదీలూ ఒకరోజు అటూ ఇటు అంతే. ఈ అభ్యర్థుల వివరాలు, వారి ఫొటోలు అనుమానాస్పదమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని నాగేశ్వరరావు తెలివిగా ఉపయోగించుకున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతనికి సహకరించిన దరఖాస్తుదారుల్లో ఒక్కరూ అభ్యర్థులు కారని, సదరు సబ్జక్టులో నిపుణులో, మరొకరో అయి ఉంటారని, నాగేశ్వరరావు కోసమే అభ్యర్థులుగా హాజరయ్యారని భావిస్తున్నారు. అంతేనా.. పరీక్షకు అనుమతించేందుకు వారి వారి అర్హతలు, నెట్, స్లెట్‌లలో ఉత్తీర్ణులయ్యారా అన్న విషయాన్నీ ఏపీపీఎస్సీ పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టం చేస్తున్నారు.

నాగేశ్వరరావుపై గతంలో కొందరు ఫిర్యాదు చేసినా ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో, ఏపీపీఎస్సీలోని బడా బాబు ఎవరో ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కడి కోసం చక్రం తిప్పిన తెర వెనుక ప్రముఖుడి పేరు బయటకు రావాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపితేనే అక్రమార్కులు బయటకు వచ్చే వీలుంది.

No comments:

Post a Comment