త్వరలోనే గ్రూపు-2 ఫైనల్ కీ, ఫలితాలు వెల్లడిస్తాం
28న పదవీ విరమణ చేయనున్న రేచల్ చటర్జీ
గ్రూపు-1 మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలను ఈనెలాఖరుకు వెల్లడించే అవకాశం ఉంది. గ్రూపు-1 కీలో తప్పులు దొర్లాయంటూ పలువురు అభ్యర్థులు ట్రిబ్యునల్‌లో వేసిన కేసుపై తీర్పు వెలువడిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ రేచల్ ఛటర్జీ పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కీలో తప్పులపై ట్రిబ్యునల్‌లో తీర్పు రిజర్వు అయింది. మరో వారం పది రోజుల్లో తీర్పు వెలువడిన వెంటనే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు గ్రూపు-2 రాత పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల ప్రకటించి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించామని రేచల్ ఛటర్జీ చెప్పారు. ఆ అభ్యంతరాలను ప్రొఫెసర్ల పరిశీలనకు పంపించామని, రెండు మూడు రోజుల్లో వాటిపై వివరణ అందే అవకాశం ఉందన్నారు. ఆ తరువాత ఫైనల్ కీ ప్రకటించి ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. మరోవైపు గ్రూపు-2 పోస్టుల విలీనంపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెప్పారు. విలీనంపై అభ్యర్థులకు కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు.
ఆ 9 మంది జవాబు పత్రాల్ని అప్పుడే తిరస్కరించాం
జూలైలో జరిగిన గ్రూపు-2 రాత పరీక్షల సందర్భంగా గుంటూరులో పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన 9 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను ఆ తరువాత రోజే తిరస్కరించామని రేచల్ పేర్కొన్నారు. ఇప్పుడది విష యమే కాదని, ఎప్పుడో పక్కన పడేశామని చెప్పారు. ఒక పత్రికలో (సాక్షి కాదు) వచ్చిన కథనంపై ఆమె స్పందిస్తూ.. కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పద్దయ్యతో తాను మాట్లాడానని, మరోసారి అలా అనుమతించవద్దని చెప్పానని అన్నారు.
28న పదవీ విరమణ: రెండేళ్లుగా ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్న రేచల్ చటర్జీ ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
నెల రోజుల సెలవులో కార్యదర్శి..: ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య నెల రోజులు సెలవుపై వె ళ్లారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఆమె కాలుకి తీవ్ర గాయం కావడంతో దాదాపు 50 రోజులపాటు సెలవు పెట్టారు. ఇటీవలే విధుల్లో చేరిన ఆమె మరో నెల రోజులు వ్యక్తిగత సెలవుపై వెళ్లినట్లు ఏపీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.
No comments:
Post a Comment