Saturday, December 29, 2012

ఏపీపీఎస్సీపై గౌరవం పెంచుతాం



ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా చిత్తరంజన్ బిస్వాల్ శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లూ చైర్మన్‌గా పనిచేసిన రేచల్ ఛటర్జీ పదవీ కాలం శుక్రవారంతో ముగియడంతో ఆ స్థానంలో బిస్వాల్‌ను ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం బిస్వాల్ విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగుల్లో ఏపీపీఎస్సీపై ఎలాంటి అపనమ్మకం కలుగకుండా, గౌరవం పెరిగేలా తనవంతు కృషి చేస్తానన్నారు. అందరి సహకారంతో నిరుద్యోగులకు మేలు చేకూర్చేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడతానన్నారు. పరీక్షలు, ఇంటర్వ్యూల విషయంలో ఎలాంటి అపోహలకూ తావులేకుండా, పారదర్శకతకు పెద్దపీట వేస్తామన్నారు. మెరిట్ సాధించే అభ్యర్థులకు మేలు చేకూర్చేందుకు చర్యలు చేపడతామన్నారు.

అయితే ఇటీవల నిర్వహించిన వివిధ ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్షల్లో తప్పులు దొర్లాయని, అనువాద దోషాలు వచ్చాయని ఈ సందర్భంగా విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. తప్పులు దొర్లకుండా, నిరుద్యోగులు ఎవరికీ అన్యాయం జరక్కుండా పక్కా చర్యలు చేపడతామన్నారు. బిస్వాల్ బాధ్యత లు స్వీకరించిన సందర్భంగా ఏపీపీఎస్సీ సభ్యులు నౌమాన్, మాలిక్, ప్రొఫెసర్ జి.పద్దయ్య, పి.రవీందర్‌రావు, గుబ్బా చంద్రశేఖర్, డాక్టర్ బీవీ సోమశేఖర్, జీఎస్ సీతారామరాజు తదితరులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అభినందనలు తెలియజేశారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయన్ను కలిసి అభినందనలు తెలియజేశారు.

ఐదు నోటిఫికేషన్ల జారీకి చర్యలు: వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఐదు నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టినట్లు ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులకు వయోపరిమితి సమస్య రావద్దనే ఉద్దేశంతో జీఓ 623 ప్రకారం నిర్ణీత వ్యవధిలో పరీక్షలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నోటిఫికేషన్లు జారీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ ఇంజనీర్, ఫిజికల్ డెరైక్టర్, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్, అబ్జర్వర్లు, రీసెర్చ్ అసిస్టెంట్లు(ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్) పోస్టులు ఉన్నాయని వివరించారు. గ్రూపు-1, గ్రూపు-2లకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని తెలిపారు.

No comments:

Post a Comment