Sunday, December 23, 2012

రంగంలోకి నరసింహన్‌

రంగంలోకి నరసింహన్‌ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (ఏపీపీఎస్సీ)లో భారీ కదలిక.. సభ్యుల వ్యవహారంపై ఒకవైపు ప్రభుత్వం చర్యలకు రంగం సిద్ధం చేస్తుంటే, మరోవైపు గవర్నర్‌ కమిషన్‌ తీరుపై ఆగ్రహోదగ్రుడయ్యారు. సమగ్ర నివేదికను పంపాలని ఆదేశించారు. ఇదే సమయంలో ఏడాదికాలంగా నిలిచిపోయిన వేలాది ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నియామక పక్రియను ఏపీపీఎస్సీ శనివారం నుంచి మొదలుపెట్టింది. నిన్నటి వరకు అన్ని నోటిఫికేషన్ల ఆధారంగా నియామకాలకు మౌఖిక పరీక్ష జరగాల్సిందేనని పట్టుబట్టిన సభ్యులు రెండు రోజులు వచ్చిన ఒత్తిడితో శనివారం నాటికి మరో మెలిక పెడుతూ ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. ఈ సంఘటనలన్నీ శనివారం ఒక్కొక్కటిగా జరిగాయి.దీంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఏపీపీఎస్సీ సభ్యుల తీరును 'ఈనాడు' వెలుగులోకి తేవడం వల్లే తమకు న్యాయం జరుగుతోందని అనేకమంది నిరుద్యోగులు 'ఈనాడు' కార్యాలయానికి ఫోన్‌ చేసి మరీ కృతజ్ఞలు చెప్పడం గమనార్హం.

ఏపీపీఎస్సీపై వచ్చిన వరస కథనాల నేపథ్యంలో పెండింగులో నియామకాలపై కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేచల్‌ ఛటర్జీ దృష్టిపెట్టారు. ఫలితాలపై పూర్తిస్థాయిలో సమీక్షించారు. ఇప్పటికే వెల్లడించిన రాత పరీక్ష ఫలితాల ఆధారంగా అభ్యర్థుల నియామక ప్రక్రియను మొదలుపెట్టారు. డ్రగ్‌ఇన్‌స్పెక్టర్లు (56), వైద్యవిధాన పరిషత్‌ టైపిస్టు పోస్టులు (70), భూగర్భ జలశాఖ టెక్నికల్‌ అసిస్టెంట్‌(1), అసిస్టెంట్‌ హైడ్రాలజిస్టు (1), ఏపీజీఎల్‌ఐ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (6) ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక ఫలితాలను వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ఫైలును మొదట మౌఖిక పరీక్షకోసం పట్టుబడుతున్న కమిషన్‌ సభ్యులకు పంపించారు. ఇప్పటికే తమ వైఖరి వివాదాస్పదంగా మారడంతో ఫలితాల ప్రకట నకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. అయితే.. మరో కొర్రీ వేశారు. కమిషన్‌ ఛైర్మన్‌, కార్యదర్శిపై పలువురు సభ్యులు హైకోర్టులో ఫిర్యాదు చేసినందున ఈ నియామక ప్రకియ కోర్టు తుది తీర్పునకు లోబడే ఉండాలంటూ రాసినట్లు తెలిసింది. విచిత్రమేమిటంటే... సభ్యులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఇంకా విచారణకు స్వీకరించనేలేదు.. అయినా కేసు కోర్టులో ఉందన్నట్లుగా పేర్కొనడం విశేషం.

మరోవైపు.. ఏపీపీఎస్పీ సభ్యుల తీరుపై గవర్నర్‌ నరసింహన్‌ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. మొదటి నుంచి ఆయన ఏపీపీఎస్‌సీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలు సక్రమంగా పని చేయాలని ఆయన పదేపదే కోరుతూనే ఉన్నారు. అటువంటి రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఒకటైన ఏపీపీఎస్సీలో కొందరి సభ్యుల వైఖరి వల్ల లక్షలమంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందంటూ 'ఈనాడు'లో వచ్చిన కథనాలు గవర్నర్‌ను కదలించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 420పై వివాదాస్పదంగా అసమ్మతి నోట్‌ ఇచ్చిన వ్యవహారంపై కూడా ఆయన ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కమిషన్‌పై వచ్చిన కథనాలపై తనకు సమగ్ర నివేదికను పంపించాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాశారు. కమిషన్‌లోని వాస్తవ పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.

No comments:

Post a Comment