Sunday, October 21, 2012

ఎపిపిఎస్‌సి ఇంటర్వ్యూలపై త్వరలో నిర్ణయం: సిఎం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా కొన్ని కేటగిరీ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ఇంటర్వ్యూలు అవసరం లేని పరీక్షల ఫలితాలను ప్రకటించాలనే అంశంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశంపై సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభ్యర్థులకు హామీ ఇచ్చారు. ఏపిపిఎస్‌సి నిర్వహించిన అనేక పరీక్షలు రాసిన విద్యార్థులు శుక్రవారం సిఎంను క్యాంపు ఆఫీసులో కలుసుకుని ఏపిపిఎస్‌సి పరీక్షలు నిర్వహించి నెలలు గడచినా ఫలితాలు విడుదల చేయలేదని, ఈ అంశంపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు అభ్యర్థించారు.

అటవీ రేంజి అధికారులు, ఔషధ శాఖ ఇన్‌స్పెక్టర్లు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లు, సీనియర్ ఎంటమాలజిస్టులు తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ఆరు నెలలు గడచింది. ఈ ఉద్యోగాలకు ఇంటర్య్వూలు నిర్వహించాలని ఏపిపిఎస్‌సి సభ్యులు పట్టుబడుతున్నారు. కాని జీవో 420 ప్రకారం ఈ కేటగిరీ ఉద్యోగాలకు ఇంటర్వూలు అక్కర్లేదు. ఇదే అంశంపై పెద్ద సంఖ్యలో ఏపిపిఎస్‌సి పరీక్షలు రాసిన విద్యార్థులు ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. గత ఏడాది నుంచి ఏపిపిఎస్‌సి 40 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2 లాంటి ప్రజలతో ప్రతక్ష్య సంబంధం ఉన్న ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. మిగతా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అక్కర్లేదు. ఇంటర్వ్యూలు అక్కర్లేని ఉద్యోగాలు నాలుగు వేల వరకు ఉన్నాయి. వీటికి ఇప్పటికే పరీక్షలు నిర్వహించారు. ఇంటర్వ్యూలు అక్కర్లేదని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అభ్యర్థులు పేర్కొన్నారు. ఇంకా ఐదారు నోటిఫికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగార్థులు వీటిపై ఓ స్పష్టమైన ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని, ఈ సందర్భంగా అభ్యర్థులు ముఖ్యమంత్రికి విన్నవించారు.

1 comment:

  1. did CM say any time by when he will take a decision...he has been telling the same for past 2 months...anybody here who directly met CM ???

    ReplyDelete