Monday, October 29, 2012

మళ్ళీ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు ఎప్పుడు?

 సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్లపై నాలుగైదు నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన త్వరలో తొలగిపోనున్నది. గూప్-1, లెక్చరర్స్ వంటి పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూలు పరిమితం చేయకుండా, ఎగ్జిక్యూటివ్ కేటగిరి పోస్టులన్నింటికీ ఇంటర్వ్యూలు కొనసాగించాలని కమిషన్ సభ్యులు చేసిన ప్రతిపాదనలపై అధ్యయనం చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై గత రెండు నెలలుగా పరిశీలిస్తున్న సాధారణ పాలనాశాఖ (జి.ఎ.డి) న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరింది. కాగా అక్టోబర్ రెండో వారంలో ఇంటర్వ్యూలు గ్రూప్-1 లెక్చరర్ వంటి పోస్టులకు మాత్రమే పరిమితం చేయాలంటూ, మిగతా కేటగిరి పోస్టులకు ఇంటర్వ్యూలు అవసరంలేదని, వాటిని కేవలం రాతపరీక్షతో భర్తీ చేసుకోవచ్చని న్యాయశాఖ అభిప్రాయ పడింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలు ఉండని పోస్టులకు సంబంధించిన 420 జి.ఓను న్యాయశాఖ సమర్ధించింది.

ఆపై సాధారణ పాలనా శాఖ అధికారుల నుంచి ఇంటర్వ్యూలు లేని పోస్టుల భర్తీ ఫైలు ఆవెూదానికి రాష్ర్ట ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళిరావాల్సి ఉంటుంది. మరో వారం పదిరోజుల్లో వేటికి ఇంటర్వ్యూలు నిర్వహించాలనే దానిపై రాష్ర్ట ప్రభుత్వం నుంచి కమిషన్‌కు ఆదేశాలు వెళ్ళనున్నాయని సచివాలయ అధికార వర్గాలు భావిస్తున్నాయి. తాజా ఆదేశాలు పొందిన తర్వాత వరుసక్రమంలో ఇప్పటివరకు రాతపరీక్షలు జరిగి ఫలితాలు కోసం వేచి చూస్తున్న పలు పోస్టుల ఫైనల్ రిజల్ట్స్ కమిషన్ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో నవంబర్ మొదటి వారం నుంచి పెండింగ్ పోస్టుల పరీక్ష ఫలితాలు అభ్యర్ధులు ఆశించవచ్చు. ఇదిలా ఉండగా, ఇంటర్వ్యూలు కొనసాగించాలా లేదానేది తేలకపోవటంతో కొన్ని రకాల పోస్టులకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయని సంకట స్థితిలో కమిషన్ ఉంది.

తాజా ఆదేశాలు కమిషన్‌కు చేరిన క్రమంలో పెండింగ్ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. వాస్తవానికి ఈ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు జారీ దశకు చేరుకొని చివరి క్షణంలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కాబట్టి తాజా ఆదేశాలు అందుకున్న వెంటనే పెండింగ్‌లో ఉన్న కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు మొత్తం జారీ చేయనున్నట్లు కమిషన్ అధికారులు వివరించారు. అంటే నవంబర్ మాసంలో కమిషన్ నుంచి ఆరేడు రకాల కొత్త పోస్టుల నోటిఫికేషన్లు పోటీపరీక్షార్థుల ముందుకు రానున్నాయి. ఇంటర్వ్యూల అంశం తేలే అవకాశం ఉండటంతో పరీక్ష ఫలితాల వెల్లడి, ఇటు కొత్త పోస్టుల సందడి కమిషన్ నుంచి అభ్యర్ధులు ఆశించవచ్చు.

No comments:

Post a Comment