Monday, October 29, 2012

బోగస్ డిగ్రీల పాపం

437 మంది ఉపాధ్యాయుల రివర్షన్

డిప్యూటీ డీఈఓలకు నోటీసులు

శాఖాపరమైన చర్యలకు ఆదేశం

మూడేళ్ల తర్వాత కదిలిన డొంక

చెల్లని పట్టాలు.. నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉచ్చు బిగుసుకుంది. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో అడ్డదారిలో ప్రమోషన్లు పొందిన 437 మంది స్కూల్ అసిస్టెంట్లపై చర్యలకు ఆదేశాలు వెలువడ్డాయి. వరంగల్ జిల్లాలో 121, కరీంనగర్‌లో 137, ఖమ్మంలో 83, ఆదిలాబాద్‌లో 33, నల్లగొండలో 63 మంది స్కూల్ అసిస్టెంట్లకు రివర్షన్లు ఇవ్వాలని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కార్యాలయం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సీనియారిటీ జాబితాలు సరిగా తయారు చేయకపోవడంతో పాటు.. నకిలీల ఏరివేతలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగాలపై అప్పట్లో ఖమ్మం జిల్లాలో పనిచేసిన ముగ్గురు ఉప విద్యాధికారులకు సైతం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో మూడేళ్ల క్రితం చెల్లని పట్టాలతో ప్రమోషన్లు అందుకున్న ఉపాధ్యాయుల్లో వణుకు పుడుతోంది. ఈ అక్రమాలపై తీగలాగితే డొంకంతా కదిలినట్లయింది. బోగస్ పదోన్నతుల వ్యవహారాన్ని సీబీసీఐడీ విచారణకు అప్పగించాలని ఇటీవలే ఉపలోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ హడావిడిగా చర్యలకు ఉపక్రమిం చడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2009లో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. అన్ని జిల్లాల్లో వందలాది మంది ఎస్‌జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేసింది. అర్హతఉన్న ఉపాధ్యాయులకు మించిన సంఖ్యలోఖాళీల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించింది. ప్రధానంగా ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా మంజూరు చేసింది. ఇదే అదనుగా భావించిన కొందరు ఎస్‌జీటీలు అప్పటికప్పుడు సంబంధిత విద్యార్హతలు సమకూర్చుకునేందుకు అడ్డదారులు తొక్కారు.

పొరుగు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీల్లో సంబంధిత డిగ్రీలు పూర్తి చేసినట్లు కొందరు సర్టిఫికెట్లు కొనుక్కోగా... కొందరు ఏకంగా బోగస్ సర్టిఫికెట్లు సృష్టించారు. దీంతో ఈ పదోన్నతుల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఉదాహరణకు.... కరీంనగర్ జిల్లాలో 290 మం ది ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రమోషన్‌పై భర్తీ చేస్తే... అప్పటికే సిద్ధంగా ఉన్న సీనియారిటీ జాబితా ప్రకారం కేవలం 140 మంది ఉపాధ్యాయులు మాత్రమే అర్హులున్నారు. కానీ అనూహ్యంగా పుట్టుకొచ్చిన సర్టిఫికెట్ల కారణంగా రెండు నెలల వ్యవధిలోనే ఈ జాబితాలో అదనంగా మరో 250 మంది చేరారు. దీంతో అర్హత లేని ఎస్‌జీటీలు ప్రమోషన్లు అందుకున్నారు. నకిలీల కారణంగా కొందరు అర్హులైన ఉపాధ్యాయులు ప్రమోషన్లు అందుకోలేకపోయారు. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలన్నింటా ఈ నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతుల వివాదం గందరగోళానికి తెరలేపింది. ఈ వివాదంపై కరీంనగర్ జిల్లాకు చెందిన బెల్లంకొండ రవీందర్‌రెడ్డి, వసంతరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన కె.వాణి, ఎం.అపర్ణ లోకాయుక్తను ఆశ్రయించారు.

అదే సమయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్న పూనం మాలకొండయ్య నకిలీల ఏరివేతపై ప్రత్యేక దృష్టి సారిం చారు. ప్రధానంగా 14 అంశాలను బేరీజు వేసి పదోన్నతులకు సమర్పించిన సర్టిఫికెట్లు అసలువా.. నకిలీవా తేల్చాలని అన్నిజిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. సంబంధిత డిగ్రీ పరీక్షలు రాసేటప్పుడు ఉపాధ్యాయులు సెలవులో ఉన్నా రా.. లేదా? పొరుగు రాష్ట్రం యూనివర్సిటీల నుంచి దూరవిద్యలో డిగ్రీలు పొందితే ఏ స్టడీ సెంటర్‌లో చదువుకున్నారు? ఆ యూనివర్సిటీలకు మన రాష్ట్రంలో ఉన్న స్టడీ సెంటర్లకు యూజీసీ, డెక్ గుర్తింపు లేనప్పుడు ఎలా పట్టాలిచ్చారు? తదితర వివరాలన్నీ సమగ్రంగా కూపీ లాగారు. దీంతో నకిలీల చిట్టా బట్టబయలైంది. దీంతో ప్రమోషన్లు పొందిన వారిలో అనర్హులున్నారని రూడీ అయింది. కరీంనగర్ జిల్లాలో 2010 జూన్‌లో ఏకంగా 137మంది స్కూల్ అసిస్టెంట్లకు రివర్షన్ ఆర్డర్లు జారీ చేశారు. కానీ వీరందరూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తిరిగి అదే పోస్టుల్లో ఉన్నారు. ఒక దశలో వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయులు సమర్పించిన సర్టిఫికెట్లన్నింటినీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి పరిశీలించింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వీరిపై చర్యలు తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ నడుం బిగించడంతో కలకలం మొదలైంది. తాజా ఆదేశాల ప్రకారం రివర్షన్లతో పాటు అడ్డదారిలో ప్రమోషన్లు పొందిన టీచర్లపై సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. బోగస్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు నిర్ధారణ జరిగితే ఏకంగా కొందరిపై క్రిమినల్ కేసులు తప్పవని కూడా విద్యాశాఖవర్గాలు వెల్లడించాయి.

No comments:

Post a Comment