Sunday, October 21, 2012

టాపర్‌గా నిలిచినా దక్కని కొలువు!

-ఏపీపీఎస్సీ నిర్వాకంతో పాలమూరువాసికి అన్యాయం

-తక్కువ మార్కులు వచ్చినవారికి ఉద్యోగాలు

-టాపర్‌కు మొండిచేయి చూపిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్లక్ష్యం నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తామని చెబుతున్న అధికారుల మాటలు ఆచరణలో బుట్టదాఖలవుతున్నాయి. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇంటర్వ్యూలు పూర్తయ్యేవరకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రిపేర్ అవుతున్నప్పటికీ నిరుద్యోగులకు ఉద్యోగం అందని ద్రాక్షలా తయారవుతోంది. అధికారుల చేతివాటం, నిర్లక్ష్య వైఖరి కారణంగా ఫలితాలు తారుమారవుతున్నాయనే ఆరోపణలు వెల్లు ఇందుకు మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన మల్లేష్ ఉదంతం ఓ ఉదాహరణ.

జరిగిందేమిటీ..?: గ్రూప్-2కు సంబంధించి 256 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్  ఉద్యోగాలతో 2010 ఆగస్టులో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు రాత పరీక్షను 2011 డిసెంబర్ 18న నిర్వహించింది. రాత పరీక్ష ఫలితాలను 2012 ఆగస్టు 8న విడుదల చేసిన ఏపీపీఎస్సీ... అదే నెల 23న ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఫలితాలను సెప్టెంబర్ 12న వెల్లడించింది. ఈ ఫలితాలలో జోన్-6 టాపర్‌గా 159/300 మార్కులతో మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఆర్ మహేష్ నిలిచారు. ఈ జోన్‌లో మొత్తం 12 పోస్టులకు గాను 5 పోస్టులు జనరల్, 2 పోస్టులు ఎస్సీ, 1 బీసీ-డీలకు కేటాయించారు. మరో నాలుగు పెండింగ్‌లో పెట్టారు. జనరల్‌కు సంబంధించి 3పోస్టులు, ఎస్సీకి సంబంధించిన 2 పోస్టులు, బీసీ-డీకి చెందిన ఒక్క పోస్టును అధికారులు భర్తీ చేశారు. ఐదు జనరల్ పోస్టులు ఉండగా అందులో టాపర్‌గా నిలిచిన మహేష్‌కు మాత్రం ఉద్యోగం దక్కలేదు. తనకంటే తక్కువగా అంటే.. 153, 145.5, 142 మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఆ కేటగిరిలో అధికారులు ఉద్యోగాలు కల్పించారు. జనరల్ కేటగిరీలోని ఐదు పోస్టుల్లో మూడే పోస్టులను భర్తీ చేయడం, ఆ మూడింటిలో కూడా తనకంటే తక్కువ మార్కులు వచ్చినవారికే అవకాశం ఇవ్వడం ఏమిటని మల్లేష్ ప్రశ్నిస్తున్నారు.

ఇంకా రెండు పోస్టులను భర్తీ చేయకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీస్తున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఏపీపీఎస్సీ చైర్మన్ రేచల్ చటర్జీకి సెప్టెంబర్ 17న, అక్టోబర్ 11న ఫిర్యాదు చేశానని, సరైన సమాధానం రాలేదని బాధితుడు మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న ఫిర్యాదు చేసిన తర్వాత ఎలాంటి సమాధానం రాకపోవడంతో తిరిగి అక్టోబర్‌లో ఏపీపీఎస్సీ చైర్మన్‌ను గట్టిగా ప్రశ్నించడంతో పొరపాటు జరిగిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలిపారు. కానీ, ఉద్యోగం కల్పించే విషయంపై స్పందించలేదని పేర్కొన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి, గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

No comments:

Post a Comment