Friday, October 26, 2012

సిద్ధార్థుడి అతిపెద్ద ఆలయం... బోరోబుడుర్

Borobudur Temple, Central Java, Indonesia
విశ్వవ్యాప్తంగా సిద్ధార్థుడి ఆనవాళ్ళు దాదాపు ప్రతి దేశంలో మనకు దర్శనమిస్తాయి. అయితే ... ప్రపంచంలో కేల్లా అతిపెద్ద బౌద్ధ దేవాలయం ఎక్క డుంది? అంటే మాత్రం... మన ఆలోచన జపాన్‌, చైనా, భారత్‌, భూటాన్‌ ల వైపు మళ్లుతుంది. ఎందుకంటే... ఈ దేశాలే కదా గౌతమ బుద్ధునితో అధికంగా అనుబంధాన్ని కలిగివున్నాయి. కానీ, పై ప్రశ్నకు సమాధానం వీటిలో ఏదీ కాదు. ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ దేవాలయం ఉన్న దేశం ఇండోనేషియా. అధిక సంఖ్యాక ముస్లిం జనాభా కలిగివున్న ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉంది ఆ దేవాలయం. అదే ‘బోరోబుడుర్‌’ ఆలయం...

ఇండోనేషియాలోని మధ్యజావాలో ప్రాంతంలో ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టులాంటి అందమైన లోయ ఒకటి కనిపిస్తుంది. అందులో ఠీవీగా నిలబడిన అగ్నిపర్వతాలు దర్శనమిస్తాయి. వాటి ముంగిట నిర్మించిన ఆలయమే ‘బోరోబుడుర్‌’. ఇదే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బౌద్ధాలయం.


అద్భుత రాతి కట్టడం...

Borobudur Stupas
పర్వత చక్రవర్తులుగా ప్రసిద్ధిచెందిన శైలేంద్ర వంశానికి చెందిన రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. బ్రహ్మాండమైన ఈ కట్టడ నిర్మాణం 750 - 850 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినట్లు చరిత్ర కారుల అంచనా. బోరోబుడుర్‌ ఆలయాన్ని చూసిన వారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దాని ఆకారం అలా వుంటుంది మరి. ఈ ఆలయంలోని స్థూపాన్ని నిర్మించడానికే 60,000 క్యూబిక్‌ మీటర్ల రాయి అవసరమైంది. ఎటువంటి లోపాలు లేని అంత పెద్ద శిలలను ఆ రోజుల్లో ఆ ప్రదేశానికి ఏలా చేర్చారా అనేది ఈ నాటికీ ఊహకందదు.కొన్ని వందల మంది శిల్పులు అహోరాత్రులు శ్రమపడి అద్భుతమైన ఈ స్థూపాన్ని సృష్టించారు. ఆలయ గోపురాన్ని ఆరు అంతస్థులుగా నిర్మించారు. ప్రతి అంతస్థును అపూర్వమైన శిల్పకళాశోభతో మెరిసిపోతూ వుంటుంది. ఘంటాకారంలో వున్న చిన్నచిన్న మందిరాలలో కూర్చునివున్న బుద్ధ విగ్రహాలు ఈ అంతస్థులలో అనేకం వున్నాయి.

ఈ బుద్ధ ప్రతిమలను తాకినవారికి మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.27 వేల చదరపు అడుగుల కైవారంలో నిర్మించిన కింది గ్యాలరీలన్నీ బుద్ధుని జీవితానికి సంబంధించిన శిల్ప దృశ్యాలతో మనోహరంగా శోభిస్తూ వుంటాయి. ఆలయ ప్రాంగణంలోనూ కుడ్యాలపైనా ఇంకా ఇతర చోట్ల మొత్తం 470కి పైగా బుద్ధ ప్రతిమలు బోరోబుడుర్‌లో వున్నాయి. నాగరికత, జన సమ్మర్థం బోరోబుడుర్‌ వైపు విస్తరించకపోవడంతో ఈ ప్రాంతం ఇంకా పచ్చదనంతో పరవళ్లు తొక్కుతోంది. ఆలయ మధ్యభాగంలో ఉన్న మహాస్థూపం ఆకాశాన్ని తాకుతోందా అనిపిస్తుంది.

శతాబ్దాలపాటు బూడిదలోనే..!

ఒకసారి జావాలో ప్రజ్వరిల్లిన అగ్నిపర్వతాల ప్రభావం బోరోబుడుర్‌ ఆలయం మీద కూడా పడింది. అగ్ని పర్వతాలు విరజిమ్మిన భస్మరాశి ఈ ఆలయాన్ని కప్పేసింది. అలా బూడిద కుప్పల కింద కొన్ని శతాబ్దాలపాటు వుండిపోయింది. 1814వ సంవత్సరంలో అప్పటి జావా గవర్నరు సర్‌ స్టాన్‌ ఫోర్డ్‌ రాఫిల్స్‌ ఆలయ ఉద్ధరణకు పూనుకుని తవ్వకాలకు ఆజ్ఞాపించాడు. భస్మరాసులను తవ్విపోసి ఆలయాన్ని వెలికితీశారు. తర్వాత 1907వ సంవత్సరంలో అప్పట్లో జావాను పరిపాలించిన డచ్‌ వారు ఆలయ పునర్నిర్మాణానికి పూనుకుని చాలా మరమత్తులు చేయించారు. కానీ, అదే సమయంలో ఆలయానికి అంతులేని అపకారాన్ని కూడా చేశారు.

అప్పట్లో జావా సందర్శించిన థాయ్‌లాండ్‌ చక్రవర్తి మెహర్భానీ కోసం ఆయనకు బహుమానంగా బోరోబుడుర్‌లోని అమూల్యమైన శిల్పాలను అనేకం సమర్పించుకున్నారు అప్పటి డచ్‌ ప్రభుత్వం వారు. దాదాపు ఎనిమిది బండ్ల నిండుగా ఆలయ శిల్పాలను, అద్భుతమైన బుద్ధ విగ్రహాలను థాయ్‌లాండ్‌కు తరలించారు. అవన్నీ కూడా యథాతథంగానే వుండివుంటే ఆలయ అత్యంతాద్భుత సౌందర్యంతో నిండివుండేది. వీక్షించ డానికి వేయి కనులున్నా చాలవనే చెప్పుకోవచ్చు. అయినా ఇప్పటికీ బ్రహ్మాండమైన తన ఆకారంతో అద్వితీయ శిల్పకళాసౌందర్యంతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే వుంది బుద్ధదేవాలయం.

మెండట్‌, కాండీపవాన్‌...

Mendut Temple, Centra Java, Indonesia
ఈ దేవాలయంలోకి ప్రవేశించేముందే భక్తులకు మరో రెండు ఆలయాలు దర్శనమిస్తాయి. ఆసలు ముందు ఈ ఆలయాలను సందర్శించిన తర్వాతే బోరోబుడుర్‌ ఆలయంలోకి వెళ్లడం ఆచారం. ఈ రెండు ఆలయాలలో మొదటిది మెండట్‌ ఆలయం. ఇది కూడా బుద్ధుని ఆలయమే. ఇందులో కూర్చొనివున్న బ్రహ్మాండమైన బుద్ధదేవుని విగ్రహం వుంది. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఈ బుద్ధుడు మామూలు ఇతర బుద్ధవిగ్రహాలలో మాదిరిగా పద్మాసనం వేసుకుని నిమీలిత నేత్రాలతో కూర్చొని వుండడు. మామూలుగా కూర్చుని వున్నట్లు వుంటాడు. బోరోబుడుర్‌ ఆలయంలోకి వెళ్లేముందు భక్తులు మెండట్‌ బుద్ధుణ్ణి అర్చించిన తర్వాతే ముందుకు వెళతారు. మెండట్‌ తర్వాత కాండీపవాన్‌ అనే గుడి కనిపిస్తుంది. ఇది ధనాధిపతి అయిన కుబేరుని గుడి.

ఈ గుళ్లో కొలువుతీరిన స్వామి కుబేరుడే. బౌద్ధులు కుబేరుణ్ణి అదృష్టదేవతగా భావించి అర్చిస్తూ వుంటారు. ఈ దేవాలయాల వల్ల కూడా బోరోబుడుర్‌ ఆలయం యొక్క అందం ప్రవిత్రతా ద్విగుణీ కృతమై వుంటాయి. ఆ కారణంగానే ఈ ఆలయ సముదాయాన్ని సందర్శించడానికి విదేశాల నుండి కూడా భక్తులు జావా ద్వీపం వస్తుంటారు. జావా చాలా అందమైన ద్వీపం. ఉత్సాహం, డబ్బు వుండాలి కానీ ఇక్కడికి చాలా తేలికగా చేరుకోవచ్చు. జావాలో అడుగుపెట్టిన తర్వాత ఎక్కడికయినా అతి సౌకర్యంగా బస్సులలో ప్రయాణించవచ్చు. రైళ్ల సౌకర్యం కూడా వుంది.

No comments:

Post a Comment