Tuesday, October 30, 2012

హలం పట్టి పొలం దున్ని నేడు డిప్యూటీ తహసిల్దార్

* నిన్న ఇంటింటికీ తిరిగి మిఠాయిలమ్మిన వ్యక్తి.. నేడు కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్‌గల స్వీట్ల వ్యాపారానికి అధిపతి.

* మొన్న వీధి చివర పాలప్యాకెట్లు అమ్ముకున్న వ్యక్తి.. నేడు కోటిమందికి ప్రతిరోజూ ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమానికి అధిపతి.

* అటు మొన్న పదవ తరగతి మూడుసార్లు ఫెయిలైన వ్యక్తి.. నేడు అంతర్జాతీయ బిజినెస్ స్కూల్‌లో ఆతిథ్య ఉపన్యాసకుడు.

ఇవన్నీ అదృష్టాలు కావు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా ఎదుర్కొంటూ నిరంతరకృషి, పట్టుదలతో అనుకున్నది సాధించిన విజయగాథలు.

ఇటీవలి గ్రూప్-2 లో బెస్ట్ ర్యాంకర్‌గా నిలిచిన బేగంపేట శ్రీకాంత్‌రెడ్డి విజయగాథ కూడా పైన ప్రస్తావించిన స్ఫూర్తిదాయక ప్రస్థానాలకు తాజా నిదర్శనంగా నిలుస్తుంది.

రెండు మూడు ఎకరాల పేద రైతు కుటుంబానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి ఇల్లు గడవడానికి సరిపడా ఆదాయం వచ్చే ఓ చిన్నపాటి ఉద్యోగం రావడమే గొప్పగా భావించే ఆర్థిక పరిస్థితుల నేపథ్యాన్ని చీల్చుకొని రాష్ట్రప్రభుత్వంలో ఉన్నత హోదాలో డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇంటర్ నుంచే ఇంటికి సాయం

పాఠశాల దశనుంచే మంచి మార్కులతో పాసయిన శ్రీకాంత్‌రెడ్డికి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన ఉన్నత చదువు కలగానే మిగిలిపోయింది. ఇల్లు గడవడానికి ఉన్న రెండు మూడు ఎకరాల పొలంలో పండే మొక్కజొన్న పంటే ఆధారం. ఆర్థికస్థితితో పాటు బాగా చదివించాలనే చైతన్యం కూడాలేని సామాజిక వాతావరణం. తండ్రితోపాటు తాను కూడా వ్యవసాయ పనులకు వెళ్ళేవాడు. అలా వ్యవసాయ పనులు చేస్తూనే ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ కోర్సులు అభ్యసించాడు. మధ్యాహ్నం వరకూ కాలేజీలో తరగతులకు హాజరై, మధ్యాహ్నం నుంచి పార్ట్‌టైం కలెక్షన్‌బాయ్‌గా ఉద్యోగం చేసేవాడు. పొలంలో పనిచేస్తున్నప్పుడే శ్రీకాంత్‌రెడ్డి దృష్టి స్థానికంగా ప్రభుత్వ హోదాతో తిరిగే తహశీల్దార్‌పై పడింది. అప్పుడే మనసులో ఆ లక్ష్యంపట్ల బలమైన పునాది పడింది. పార్ట్‌టైం కలెక్షన్ బాయ్‌గా చేస్తూనే డిగ్రీ కూడా పూర్తి చేసిన శ్రీకాంత్ కొంతకాలంపాటు పౌల్ట్రీఫామ్‌లో పనిచేశాడు. ఆ తరువాత తానే స్వయంగా ఒక పౌల్ట్రీఫామ్‌ను ప్రారంభించాడు. బ్యాంక్ నుంచి రుణం తీసుకొని ప్రారంభించడం వలన ఆ అప్పును తొందరగా తీర్చాలనే బాధ్యతతో పౌల్ట్రీ యూనిట్ మొత్తాన్ని తానే దగ్గరుండి చూసుకునేవాడు శ్రీకాంత్‌రెడ్డి.

లక్ష్యం దిశగా తొలి అడుగు

తనకు, తన కుటుంబానికి ఆర్థికపరంగా వున్న సమస్యలను ఒక్కొక్కదాన్నీ పరిష్కరించుకుంటూ అనుకున్నది సాధించడానికి ఒక దీర్ఘకాలిక వ్యూహాన్నే వేసుకున్నాడు శ్రీకాంత్. కానీ తాను ఉన్న పరిస్థితులలో అనుకున్నది సాధించడం అంత తేలిక కాదు. ఒక్కోసారి అసలు తాను ఆ పోస్టును పొందగలడా? అనే అనుమానం కూడా శ్రీకాంత్‌కి కలిగేదట. కానీ కేవలం అలా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదని ఒక వైపు పౌల్ట్రీఫాంను నిర్వహిస్తూనే, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని నిర్ణయించుకున్నాడు శ్రీకాంత్.

గ్రూప్ సర్వీసు గురి తప్పలేదు

గ్రూప్ సర్వీసులలో ఆర్‌డీఓ, డిప్యూటీ తహశీల్దార్ పోస్టులను లక్ష్యంగా పెట్టుకొని 2004లో ప్రిపరేషన్ ప్రారంభించాడు శ్రీకాంత్. ఆర్.సి.డ్డి, ఐ.ఎ.ఎస్ స్టడీ సర్కిల్‌లో 2004 గ్రూప్-1 కోసం కోచింగ్ తీసుకున్నాడు. మొదటి ప్రయత్నంలోనే 7 మార్కుల వ్యత్యాసంతో గ్రూప్-1 ఇంటర్వ్యూ మిస్ అయింది. ఆ తర్వాత 2007లో గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యాడు. అందులో కూడా 15 మార్కుల తేడాతో నాన్ ఎగి్జ్యూటివ్ పోస్ట్ చేజారిపోయింది. ఈ వైఫల్యాలేవీ శ్రీకాంత్ మనోధైర్యాన్ని దెబ్బతీయలేదు. పైగా మరింత కసిగా చదవడం మొదలెట్టాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా గ్రూప్-1 పరీక్షలతోపాటు, గ్రూప్-2 పరీక్షలకు కూడా హాజరు కావాలని నిర్ణయించు కున్నాడు.

గ్రూప్-1 మెయిన్స్ జరిగిన నెలరోజుల్లోనే గ్రూప్-2 పరీక్షలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. శ్రీకాంత్‌రెడ్డి అనుకున్నది సాధించాడు. గ్రూప్-2 ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకర్‌గా, ఆరవ జోన్ స్థాయిలో ఆరో ర్యాంకర్‌గా నిలిచాడు.

రంగారెడ్డి జిల్లాలోని షామీర్‌పేట మండలంలోని కొల్తూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి దీర్ఘకాలిక ప్రణాళికతో, ఆశావాదంతో, గట్టి పట్టుదలతో తాను కోరుకున్న డిప్యూటీ తహశీల్దార్ పోస్టును సాధించి చూపెట్టాడు. అదే పేద కుటుంబ నేపథ్యం కలిగి తాము సాధించలేమేవెూ అనుకునే ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచాడు శ్రీకాంత్‌రెడ్డి.

No comments:

Post a Comment