Sunday, October 21, 2012

బువ్వపెట్టని బిఇడి విద్య!

విద్యను అనేకమంది విద్యావేత్తలు వారి వారి ఆలోచనలను బట్టి, ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో మానవ జీవన విధానానికి అనుగుణంగా విద్యకు అనేక అర్థాలను ఆపాదించడం జరిగింది. కొందరు విద్యావేత్తలు విద్య అంటే ప్రశ్నించడం అన్నారు. విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్‌ అంటారని తెలుసు. ఇది ఎడ్యుకేర్‌, ఎడ్యుసీర్‌ అనే లాటిన్‌ పదాలనుంచి ఆవిర్భవించింది. ఎడ్యుకేర్‌ అంటే శిశువును అభివృద్ధి చేయడం అనీ, ఎడ్యుసీర్‌ అంటే దారి చూపించడం అనే అర్థాలు ఉన్నాయి. అంటే చీకటి నుండి వెలుగుకు దారి చూపించడం విద్య అని అర్థం.

ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య -అరిస్టాటిల్‌.

 మానవుడి అంతర్గత శక్తుల సహజమైన, సామరస్యమైన ప్రగతిపూర్వకమైన అభివృద్ధి విద్య -పెస్టాలజీ.

 విద్య అంటే వ్యక్తిలోని -శారీరక, మానసిక ఆధ్యాత్మిక పరమైన అత్యున్నత అంశాలను సమీకృతంగా వెలికితీయడం -గాంధీజీ.

 వేదకాలంలో మానవజీవితమునకు పరమార్థములు ధర్మ, అర్థ, కామ మోక్షములు అన్నారు. వీటిని సాధన చేయడం ఆనాటి విద్యావిధానంలో విధులు. వీటిని సాధించుటకే మనిషి జీవించాలి. బోధించే విద్య విధిగా అందుకు సహాయపడాలి. విద్య మానవుడిని సుఖమైన జీవనం గడపడానికి కాక అతడిని సమాజాభివృద్ధికి తోడ్పడే వ్యక్తిగా కూడా తయారు చేయాలి. విద్య సమాజంలో పేరుకొనిపోయిన చెడును మార్పు చేసి అందరు రుజుమార్గంలో నడిచే విధంగా చేస్తుంది. విద్య లేకపోతే సమాజం ఉంటుందా? ఎలా ఉంటుంది? ఇంతటి మహా అద్భుత శక్తి ఉన్న విద్యను అందించువారు ఉపాధ్యాయుడు. విద్యార్థికి, తల్లి, తండ్రి తర్వాత గురువు (ఉపాధ్యాయుడు) ముఖ్యమైన వ్యక్తి, కానీ వీరికి నేటి సమాజంలో లభిస్తున్న ఆదరణ ఎటువంటిదో మనందరికీ తెలుసు.

 ముఖ్యంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును పరిశీలిస్తే బి.ఇడి (బ్యాచ్‌లప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) ప్రొఫెషనల్‌ కోర్స్‌ పరిస్థితి ఘోరం. చైనా దేశంలోని వ్యక్తులు ఉపాధ్యాయులను ఎక్కువగా గౌరవిస్తారు. కానీ, మన రాష్ట్ర పరిస్థితిని గమనిస్తే వీరికి ఇచ్చే ఆదరణ గౌరవం శూన్యం అనే చెప్పాలి. రాజకీయ నాయకులు వాగ్దానాలకే పరిమితం అవుతున్నారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్ధానాలను ఎన్నికల తర్వాత పూర్తిగా మరిచిపోతారు. ''ఓటు వేసేదాకా ఓడమల్లన్న, ఓటు వేసిన తర్వాత బోడి మల్లన్న'' అంటారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వీరు నిర్వీర్యం చెందుతున్నారు. బి.ఇడి ఉపాధ్యాయ అభ్యర్థులు ముందుగా ప్రవేశ పరీక్ష (ఎడ్‌ సెట్‌)కు సన్నద్ధమై దానిలో కష్టపడి ర్యాంకు సాధించుకొని, బి.ఇడి (ప్రొఫెషనల్‌) కోర్స్‌లో చేరుతారు. ఈ ఒక సంవత్సర కాలంలో ప్రాజెక్టు వర్క్స్‌, రికార్డ్‌లు, మైక్రో, మాక్రో, కో-కరిక్యులమ్‌, కంప్యూటర్‌ ప్రాజెక్ట్‌లు నిర్వహిస్తారు. వీటిలో నైపుణ్యం చదివిన తర్వాత కోర్స్‌ చివరలో మరోసారి పరీక్షలకు సిద్ధమై పరీక్షల్లో ఉత్తీర్ణులై బి.ఇడి (సర్టిఫికెట్‌)ను సాధిస్తారు. ఈ కోర్స్‌ ఒక్క ఉపాధ్యాయ పరీక్షకు తప్ప వేరే ఇతర పనులకు ఉపయోగపడదు. ఇతర ప్రొఫెషనల్‌ కోర్స్‌ల్లాగా వేరే ఉద్యోగాలకు ఎలాంటి డిమాండ్‌ లేకపోవడంతో ఈ కోర్స్‌ పట్ల ఆదరణ తగ్గుతుంది. వీటిలో ఎక్కువగా బీద, మధ్యతరగతి, సామాన్య కుటుంబ విద్యార్థులే చేరతారు. రాజకీయ నాయకుల పిల్లలు, ధనవంతుల పిల్లలు ఇతర ప్రొఫెషనల్‌ కోర్స్‌లైన ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, ఎంబిఎ, ఎంసిఎ, సాఫ్ట్‌వేర్‌ కోర్సులను మరియు ఇతర దేశాల్లో అమెరికా, బ్రిటన్‌, లండన్‌లో విద్యను అభ్యసిస్తారు. కావున రాజకీయ నాయకులకు ఇక్కడి పరిస్థితులు అర్థం కావు. వారి పిల్లలు ఉన్నారుగా, వేరే వారి పిల్లల పరిస్థితి గురించి మాకేంటి అనే రీతిలో ప్రవర్తిస్తారు. బి.ఇడి అభ్యర్థులకు ఉపాధి దొరకక రోడ్డునపడే పరిస్థితి దాపురించింది. డి.ఎస్‌సిలు (డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ)లు రెండు లేదా నాలుగు సంవత్సరాలకొకసారి నిర్వహిస్తారు. వాటిలో ఖాళీలు తక్కువ, పోటీ ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో సుమారు 80,000 మంది బి.ఇడి అభ్యర్థులు తయారు అవుతున్నారు. అనేక ఇబ్బందులతో సంపాదించిన పట్టాతో ఉద్యోగానికి అప్లై చేస్తే అనేక పరీక్షలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడు కొత్తగా టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)ను మరియు దానిలో క్వాలిఫై అయిన తర్వాత డి.ఎస్‌సి (డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ) ద్వారా మరో పరీక్షకు సన్నద్ధమై పరీక్షలు రాసి దానిలో మంచి మార్కులు సాధించాలి. ఇలా అనేక పరీక్షలను ఎదుర్కోవలసి వస్తోంది. ఇన్ని పరీక్షలు సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్‌ 1, 2 లకు లేవు ఉపాధ్యాయ పరీక్షకే ఎందుకు? ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల బి.ఇడి అభ్యర్థులు తగ్గిపోతున్నారు.

ఈ ఏడాది సుమారు 11,800 సీట్లు మిగిలిపోయాయి. బి.ఇడి చేయాలనే తపన విద్యార్థుల్లో సన్నగిల్లుతోంది. ఎలాంటి ఇతర ఉపాధి అవకాశాలు లేకపోవడం అభ్యర్థులు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. అభ్యర్థులు లేక ప్రైవేట్‌ కళాశాలలు వెలవెలబోతున్నాయి. దేశం ఎంత అభివృద్ధి జరుగుచున్న కంప్యూటర్‌, సాఫ్ట్‌వేర్‌ రంగంలో దూసుకుపోతున్నా, బోధించే ఉపాధ్యాయులు లేనిదే సమాజం అభివృద్ధి సాగదు, కుంటుబడుతుంది. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడానికి ఇష్టపడరు. కారణం ఉపాధి అవకాశాలు లేకపోవడం. ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ ఉద్యోగాలు కల్పిస్తామంటూనే, మరోవైపు నిరుద్యోగులకు అన్యాయం చేస్తోంది. దీనికి ఉదాహరణ: సర్వశిక్షా అభియాన్‌ పథకం ద్వారా మంజూరయిన ఉపాధ్యాయ పోస్టులకు ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు 70 శాతం ప్రమోషన్లు ఇచ్చి, నిరుద్యోగులకు మాత్రం 30 శాతం పోస్టులను కేటాయించడం అన్యాయం కాదా? ఉన్నవారికే ఉపాధా? మరియు బి.ఇడి వారికి ఎస్‌జిటి పోస్టులకు అనర్హులుగా పేర్కొన్నది. ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు మాత్రమే అవకాశం ఇచ్చింది. ఎస్‌ఎ పోస్ట్‌లో 1-5 వరకు మాత్రమే అన్ని సామాజిక వర్గాలకు పోస్టులు వస్తున్నాయి. అంటే ఒక్కో పోస్ట్‌కు 1 : 150 కంటే ఎక్కువగా పోటీ ఉంటుంది. ఎస్‌జిటి పోస్టులను 100 శాతం డి.ఇడి అభ్యర్థులకు కేటాయించింది. ఇలా అన్నిరకాలుగా బి.ఇడి అభ్యర్థులకు నష్టం జరుగుతోంది. రానున్న కాలంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే బి.ఇడి అభ్యర్థులు, కరవై, మొత్తం బి.ఇడి కళాశాలలు మూతపడే ప్రమాదం ఉంది. కావున, బి.ఇడి చేసిన అభ్యర్థులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలి. ప్రతి సంవత్సరం డిఎస్‌సిని నిర్వహించాలి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఎక్కువగా ఖాళీలను భర్తీ చేయాలి. సుమారుగా 20,000 మంది స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలను ఇవ్వాలి. ఒక ఉపాధ్యాయ వృత్తికే కాకుండా ఎపిపిఎస్‌సి నిర్వహించే జూనియర్‌ లెక్చరర్‌ పోస్ట్‌లు కూడా పిజితో బాటు బి.ఇడి విద్యార్హత తప్పనిసరి చేయాలి. టెట్‌ని రద్దు చేయాలి. డిఎస్‌సి ఒకే పరీక్షను నిర్వహించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం తప్పనిసరి అయితే టెట్‌ ్శ డిఎస్‌సిని ఒకే పరీక్షను నిర్వహించాలి. ప్రైవేట్‌ పాఠశాలల్లో బి.ఇడి అభ్యర్థులను మాత్రమే తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. డిగ్రీతో నిర్వహించే ఇతర పోస్టులకు కూడా బి.ఇడి తప్పనిసరి చేయాలి. కొత్త ఉపాధి మార్గాలు చూపాలి. త్వరలో వెలువడే గ్రామ కార్యదర్శి, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు బి.ఇడి తప్పనిసరి చేయాలి. ఇలా కొత్త ఉపాధి చూపిస్తే తప్ప లేనిచో బి.ఇడి అనే మాటను అభ్యర్థులు మరిచిపోయే ప్రమాదం ఉంది. కావున ప్రభుత్వం పునరాలోచించి అన్ని రకాలుగా బి.ఇడి అభ్యర్థులను ఆదుకొని ఉపాధి మార్గాలను చూపించాలని ప్రభుత్వానికి హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను.


2 comments:

  1. Plz post ur toppics in english.we r unable to read in android phones

    ReplyDelete
  2. Dats brilliant analasys,
    showng d exact scenario of d B.Ed candidates,
    damn education dept. Is worsening d lives of B.Eds,
    gud work mr srikanth,
    dis is Ramchandra..

    ReplyDelete