
ఆధునిక యుగంలో తెలుగువారి తూర్పు దిక్కు విజయనగరం సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య పునరుజ్జీవనాలకు చిరునామా. 17వ శతాబ్దంలో పోర్ట్ విలియం నిర్మాణం వల్ల ఎలా కలకత్తా అనేక ఆధునిక నగర నిర్మాణానికి దారులు ఏర్పడ్డ్డాయో, అలానే అదే శతాబ్దంలో గాజుల రేగ అనే గ్రామానికి శివారుగా వుండే విజయనగరానికి సైతం, పూసపాటి రాజులు అక్కడ పెద్దదీ, బలమైనదీ అయిన కోట కట్టాలని నిర్ణయించడంతో కొత్త భవిష్యత్తు ఏర్పడింది. 1712-13 ఏడాదిలో విజయనగరం కోటకు పునాది వేసారు. ఈ 2012 సంవత్సరం విజయనగరం కోటకు ముచ్చటగా మూడు వందలేళ్ల సందర్భం. విజయనగరం కోట నిర్మాణానికి ముందు పూసపాటి రాజులకు కుమిలి (కుంభిళాపురం)లో మట్టికోట ఉండేది. దీనిపై మహమ్మదీయుల దాడులు తరచూ జరుగుతూ వుండడంవలన రాజ్య సుస్థిరతా, భద్రతా కారణాల దృష్ట్యా సైతం, ఈ కోట నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. పూసపాటి రాజులలో అయిదో పాలకుడయిన ఆనంద గజపతి రాజు తన కుమారుడయిన విజయరామ గజపతి రాజు పేరిట అయిదు ‘జయ’ శబ్దాలు సమకూరే శుభముహూర్తాన 1712-13లో కోటకు పునాది వేసారు. ఆ అయిదు జయ శబ్దాలూ ఏమిటంటే విజయనామ సంవత్సరం, విజయదశమి, జయవారం, విజయరామరాజు. అందుకే అది విజయనగరం కోటగా పిలువబడింది. తండ్రి ఆనందగజపతి మొదలుపెట్టినా, ఈ కోట నిర్మాణం కుమారుడు పెద విజయరామరాజు కాలంలోనే పూర్తయ్యింది. ఆ విధంగా విజయనగరం కోట నుంచి పరిపాలించిన తొలి రాజు పెద విజయరామరాజు. పూసపాటి రాజుల పరిపాలనా కేంద్రమయిన మూడు వందల ఏళ్ళ ప్రాభవాల విజయనగరం కోట, అటు శ్రీకాకుళం నుంచి రాజమహేంద్రవరం దాకా విస్తరించిన రాజ్యంగానే కాక కాలక్రమంలో విద్యా, సాంఘిక, సాంస్కృతిక వికాస దోహద శక్తిగా సైతం పాత్ర పోషించింది. పదిహేడో శతాబ్దం నుంచి ఇరవయ్యో శతాబ్దందాకా కోట విభిన్న సంఘటనలకు సాక్షిగా నిలిచింది. తొమ్మిది మంది రాజులు పట్ట్భాషిక్తులయ్యారు. పెదవిజయరామరాజు-1, ఆనందరాజు, చినవిజయ రామరాజు-2, నారాయణ గజపతిరాజు, విజయరామ గజపతిరాజు-3, ఆనందగజపతిరాజు, విజయరామ గజపతి రాజు -4, అలక్‌నారాయణ గజపతిరాజు, విజయరామరాజు-5 (పి.వి.జి.రాజు) ఫ్యూడల్ రాజరిక దశ,వలసవాద పరిపాలనల దశ, జమీందారీలుగా పరిణమించిన దశ, సంస్థానాలు భారతదేశంలో కలసిపోయిన దశలు కదిలిపోయిన చరిత్రకు విజయనగర రాజ్యం, కోట, పాలకులు అందరూ సమష్టి ప్రతీకలు. 1945లో ఆఖరుగా పట్టం కట్టుకున్నది మన కాలంలోని వారు ఎరిగిన పి.వి.జి.రాజు. రాచరిక మర్యాదలకు దూరంగా వుంటూ సోషలిజంవైపు మొగ్గుచూపిన అభ్యుదయవాది పి.వి.జి.రాజు ప్రజలతో అనుబంధం పెంపొందించుకున్నారు.






1949వ సంవత్సరంలో జమీందారీ చట్టం రద్దు కావడంతో విజయనగర సంస్థానం ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయింది. పి.వి.జి.రాజు స్వచ్ఛందంగా తన యావదాస్తీనీ, రెండు వందల ముప్ఫయ్యేళ్ళ విజయనగర రాజ్యలక్ష్మికి స్థానమైన కోటనీ విద్యల కోసం, జాతిపరం చేశారు. అయితే బొబ్బిలియుద్ధంలాగానే, విజయనగరం రాజులు గుర్తుండిపోయే మరో ఘట్టమూ వుంది. అది 1794లో జరిగిన పద్మనాభ యుద్ధం. ఈ యుద్ధంలో రెండో విజయరామరాజు పోరాడి కన్ను మూశారు. ఈ రాజు నిజానికి తాళ్లపాలెం రాజుల ఇంటి బిడ్డ. పెదవిజయరామరాజు భార్య రాణీ చంద్రాయమ్మ, భర్త సూచనల మేరకు దత్తత స్వీకరించి చిన విజయరామరాజుగా నామకరణం చేశారు. బొబ్బిలియుద్ధంలో పెద విజయరామరాజు మరణం తర్వాత, చిన విజయరామరాజుకు పట్ట్భాషేకమైనా, బాలుడు కావడంతో, ఇతని సవతి తల్లి కుమారుడు, అన్న అయిన సీతారామరాజు కొనే్నళ్ళు దివాన్‌గా వ్యవహరించి రాజ్య పరిస్థితులను అధోగతికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితి పెద విజయరామరాజు ఆస్థాన కవి అయిన అడిదం సూరకవి తన రామలింగేశ శతకంలో చిత్రణ చేశారు. అగ్రహారంబులు నామావశిష్టములయ్యె మాన్యంబుల్నియు మంట గలిసె బత్తెంబునకు తొంటి పడికట్టు దప్పెను బుధ జనంబుల రాకపోకలుడిగెవర్నాశనంబులు వరద పాలైపోయె మలవ తలను ప్రజల్ మాని పనిరి నశించిపోయె జుంటరులు దుష్కరుల గజతురంగములు తాకట్టు వడియె ధార్మిక స్థానముగ కిట్టి తళ్ళుపుట్టె గఠిన చిత్తున రాజ్యాధికారి సేసి యింత పీడించితివి సత్కవీంద్ర కోటి రామలింగేశ రామచంద్ర పురవాసు! ఇంకా పూసపాటివారి కైఫీయతు, డిస్ట్రిక్టు మాన్యువల్, డిస్ట్రిక్ట్ గెజెటీర్‌లలోని వివరాలు ఆ నాటి సీతారామరాజు క్రౌర్యాన్ని, వితండ పాలననూ వెల్లడి చేస్తున్నాయి. ఇతని తర్వాత పాలనకొచ్చిన (అంటే పదవిలోనుంచి తప్పించి) చిన విజయరామారాజుకు, ఇంటి శత్రువులవల్ల సహజంగా కష్టాలు ఎక్కువయ్యాయి. సీతారామరాజు కంపెనీ పరిపాలకుల పంచన చేరాడు. విజయనగర రాజ్యం, ఆంగ్ల పాలకులకు ఆరు లక్షల యాభై వేలు కప్పంగా కట్టవలసివుందని తాఖీదులొచ్చాయి. ఆంగ్లేయ వర్తకులు, తమ రాజ్యానికి ఆహీలు (హోసీల్)గా మూడు లక్షలపైగా కట్టాల్సి వుందని, ఆ సొమ్ము మినహాయించుకుని మిగిలిన మూడున్నర లక్షలు, మూడు వాయిదాలలో చెల్లిస్తానన్న చిన విజయరామ గజపతి, ఆంగ్ల పాలకులకు అంగీకారం కాలేదు. అందువల్ల విజయనగరం కోటపై రాజు కోటలో లేని వేళ 1794 వత్సరంలో ఆంగ్ల సైన్యాల ముట్టడి జరిగింది. కోట ఖిలేదారు యుద్ధం జరిగితే కోట దెబ్బతింటుందన్న ఆలోచనతో, కోటను వారి పరం చేశాడు.
ఆంగ్ల పాలకుల ఈ దుష్టచర్యలపై కోపించి విజయనగరం ప్రాంత రైతులు తాము కట్టాల్సిన శిస్తులు కట్టడం ఆపివేశారు. దానితో రాజులకు దేశంలోగల పేరు, ప్రేమ చూసి, కప్పం కట్టలేని రాజు, దేశంలో వుండతగదనీ, తాను వెంటనే మచిలీపట్నం వెళ్లిపోవలసిందనీ, ఆంగ్ల పాలకులు ఆదేశాలు జారీ చేశారు. తన భార్య సీతాయమ్మగార్ని, ఎనిమిదేళ్ల బిడ్డ నారాయణబాబును అన్నమరాజు పేటకు పంపించి, తాను మచిలీపట్నం వెళ్ళేందుకు తొలుత సిద్ధపడిన చిన విజయరామ గజపతి, సింహాచలదేవుని సందర్శించుకుని, మచిలీపట్నం వెళ్ళిపోవలసినవాడు మనసు మార్చుకుని, కొద్ది మైళ్ళ దూరంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం చేరుకుని, తనకు విశ్వాసపాత్రులయిన సైన్యాలకు పిలుపు పంపి, ఆంగ్ల పాలకులతో, అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ పద్మనాభ యుద్ధానికి ముందు అనంత పద్మనాభస్వామి ఆలయంలో తన అనుచర యోధులు, సైన్యాలను ఉద్దేశించి, చిన విజయరామరాజు చేరిన ఆఖరి ప్రసంగం ఎంతో చారిత్రాత్మకమైనది. వలస పరిపాలకుల కూట నీతి ఎలా భారతదేశపు రాజ్యాలను లొంగదీసిందో తెలియచెప్పే ఒక సాధికార వివరణ. అందులో కొన్ని వాక్యాలు యిప్పటికీ పాఠకుల రక్తం మరిగేటట్టు చేస్తాయంటే జరిగిన ఆ అన్యాయం అటువంటిది.10.7.1794న జరిగిన పద్మనాభ యుద్ధం కేవలం నలభై అయిదు నిమిషాల్లోనే ముగిసింది. మరణించిన చిన విజయరామరాజు చుట్టూ రెండు వందల ఎనిమిది మంది ఆంధ్ర క్షత్రియ వీరులు ఆయుధాలు విడవనివారై నేలన పడి వున్నారు. వీరిలో నలభై ఎనిమిది మంది ప్రథమ శ్రేణికి చెందిన రాజపుత్ర వీరులు విజయనగరం సైనికులు మూడు వందలమందిపైగా మరణించగా, కంపెనీ సైనికులలో పదమూడు మంది మరణించగా అరవై ఒక్కరికి గాయాలు తగిలాయని నివేదికలు చెప్తున్నాయి. పద్మనాభ యుద్ధంలో ఉత్తర సర్కార్లలోని క్షత్రియ కుటుంబాల వీరులు రాజు తరపున పోరాడి ప్రాణాలు అర్పించారు. వీరిలో పూసాపాటి, వత్సవాయి, నడిపల్లి, చింతలపాటి, దాట్ల, సాగి, జంపన, దంతులూరి భూపతి, వేజర్ల, గొట్టిముక్కల, పెరుమత్స కుటుంబాల వీరులు వున్నారు. 1794 నాటికి, ఈ యుద్ధం ద్వారా ఆంగ్ల పాలకుల చేతుల్లోకి వెళ్లిన కోట, ఎన్నో కొత్త మార్పులను చూసింది. ఈ యుద్ధ బీభత్సాన్ని ఎరిగిన నారాయణ గజపతి, ఆదిల్ కొంత రాజ్యం కోసం యుద్ధాలు చేసినా, కంపెనీవారు పర్మనెంట్ సెటిల్‌మెంటు బిల్లు ద్వారా రాజులందర్నీ, జమీందరులుగా మార్చివేయడం, రాజ్యంలో వుండే సైన్యాల సంఖ్య తగ్గించి వేయడం, కలెక్టర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి, శాంతి భద్రతలకై పోలీసు యంత్రాంగాన్ని కంపెనీ అధికారాల కిందే నియమించడం వంటివి చూసి, ప్రాభవం తగ్గిన చోట తాను పేరుకు మాత్రమే రాజుగా పరిపాలన చేయలేనని ఎరిగి, కంపెనీ పాలకులతో తన జీవితాంతం ఏడాదికి లక్ష రూపాయల జీవన భృతికి ఒప్పందం చేసుకుని కాశీలో నివాసం వుండేందుకు వెడలిపోవడంతో 1794 నుంచి 1852 వరకూ, యాభ్యెనిమిదేళ్ళపాటు కోట, విజయనగర రాజ్యం లేదా జమీందారీ ఆంగ్ల పాలకుల సంరక్షణలోనే వుండిపోయాయి.
నారాయణ గజపతి కాశీకి వెడలిపోయే ముందరి దశాబ్దాలలో 1794 నవంబరు ఇరవై నుంచి కలెక్టరేటు పద్ధతి అమల్లోకి వచ్చింది. అయిదు లక్షల రూపాయల పేష్కస్ ఏడాదికి చెల్లించే పద్ధతిపై నారాయణ గజపతే తొలి విజయనగరం జమీందారయినా పురాతన జమీందారీలుగా పేరు పడ్డవీ, అంతవరకూ విజయనగరం రాజ్యంలో వున్నవీ అయిన ఆండ్ర, బెలగాం, బొబ్బిలి, చెముడు, గోల్కొండ, జయపురం, కాశీపురం, కురుపాం, మాడుగుల, మేరంగి, పాచిపెంట, పాలకొండ, సాలూరు సంగంవలస, సరిపల్లి, భీమవరం, వీటిని ఎవరివి వారికి యిచ్చివేసి స్వతంత్ర జమీందారులుగా ప్రకటించారు. ఇంతటి పెనుమార్పులకు తట్టుకుని విజయనగరంలో వుండలేని నారాయణ గజపతి కాశీ వెళ్లిపోవడమే కాక విజయనగరం తొలి జమీందరుగా అక్కడే మరణించారు. 23.8.1854న సైనిక మర్యాదలతో వీరి అంత్యక్రియలు కాశీలో బ్రిటీష్ కంపెనీవారు జరిపారు.మూడవ విజయరామరాజు చిన్నప్పట్నుంచీ కాశీలోనే పెరిగి పెద్దయిన కారణంగా వీరి వివాహమూ అక్కడి ఉత్తర హిందుస్థానపు క్షత్రియ కన్యతో జరిగింది. వీరి భార్య అలక్ రాజేశ్వరి దేవి చంద్రావతి రాజ్యపాలకులగు ఫిరూ సింగ్ బహదూర్ వారి కుమార్తె, ఈ సందర్భం మొదలుకుని విజయనగరం రాజులెవరూ ఆంధ్ర క్షత్రియ కన్యలను వివాహం చేసుకోలేదు.పద్ధెనిమిదో శతాబ్దానికి రాజ్యాలు సుస్థిరమైనాయి ముఖ్యంగా ఆంగ్ల వలస పాలకులకు. 1857 సిపాయిల తిరుగుబాటు ఈ ప్రాంతాలలో పెద్దగా ప్రభావం కలిగించలేదు. పైగా ఈ 1857 తిరుగుబాటు కాలంలో యువకుడైన విజయరాజ గజపతి-3 ఆంగ్లేయ పాలకులకు సహకరించారు.విజయనగరంలో మహారాజావారి సంస్కృత కళాశాల వీరి పాలనలోనే మొదలయింది. విజయ రామ ముద్రాక్షర శాల ఏర్పడింది. ఈ అచ్చు పనిశాలలోనే 1897లో ‘కన్యాశుల్కం’ అచ్చయింది. వీరి కుమారుడు అభినవాంధ్రభోజుడు ఆనంద గజపతిరాజు కాలంలో సంగీతమూ, సాహిత్యమూ, విద్యా సంస్థల ఏర్పాటు ఇవన్నీ పంధొమ్మిదో శతాబ్ది ఆరంభంలోనే జరిగిన ప్రప్రథమ ఆంధ్ర నగరం విజయనగ విజయరామ గజపతి కాలంలోనే కావ్యరచనలు చేసిన కవి పండితులున్నారు. వీరిలో ముడుంబై నరసింహాచార్య స్వామి, మందా కామేశ్వర కవి, లక్ష్మీ కామేశ్వర శాస్ర్తీ ప్రభృతులూ, పసకాడ సన్యాసి, కిల్లంపూడి ముత్యాలు అనే మల్లుడు, పోడూరి వెంకటరాజ కవి తదితరులున్నారు.
శ్రీపాద వెంకటాచల కవి రామకృష్ణోపాఖ్యానం అనే ద్వర్థికావ్యాన్ని రాశాడు. ఈ సాహిత్య వికాసం, ఇంతకు రెండింతలై తరువాతి పాలకుడు, ఆనంద గజపతి మహారాజు కాలంలో కొత్త ఎత్తులకు ఎదిగింది. ఆ రకంగా పంధొమ్మిదో శతాబ్దం,రాజుల పేరిట సాహిత్య యుగాలను తీర్చితే, ఆనంద గజపతి యుగంగా చరిత్రలో నిల్చిపోతుంది. గురజాడ యువకుడిగా వున్న కాలానికే 1879కి రాజ్యానికి వచ్చారు ఆనందగజపతి. వీరికి ఇరవై అయిదుభాషల్లో ప్రవేశం, ప్రావీణ్యం వుందని చెప్తారు. ‘ప్రిన్స్ ఛార్మింగ్’, ‘డ్యూక్ ఆఫ్ బకింగ్‌హాం’గా కొనియాడిన వీరిది ప్రత్యక్షంగా చూసిన దేశభక్త కొండ వెంకటప్పయ్య తెలిపినది ఇది.‘‘వారి స్వరూపము అత్యంత నిపుణుడగు శిల్పి చెక్కిన పసుపు పచ్చని బంగారు ప్రతిమవలె ఉండెను. వారి ముఖారవిందము ఎన్నిసార్లు చూచినను ఇంకను చూడవలెనను కోర్కె పుట్టుచుండును. తెల్లని లాగును తెల్లని అంగరఖాను తొడిగి దానిపైన నల్లని పూసలుగల బంగారు తావళము మెడలో వేసుకుని రవ్వలు చెక్కిన తురాయిగల ఎఱ్ఱని టోపీని పెట్టుకుని సభలకు వచ్చుచు ప్రేక్షకులకు ఆనందము గొలుపుచుండెను. ఆనంద గజపతి అను నామము వారి యెడ పూర్ణముగ సార్థకమయ్యెను’’.కవిపోషణ, పండితుల ఆదరణ, అనేక గ్రంథాలను అంకితం పొందడం, సంస్కృత, హిందీకావ్యాల తెలుగు అనువాదాన్నీ చేయించడం, తాను స్వయంగా ‘విజయనగరం ట్రీటీ’ అనే లఘుకృతిని కలిగి వుండాలని ఆశించి కన్యాశుల్కం బిల్లు ప్రవేశపెట్టడం, మాక్స్‌ముల్లర్ రచించిన రుగ్వేద వ్యాఖ్యానం (మూలం శాయనాచార్యుడి ఋగ్వేదం) ప్రతులు చెల్లిపోయిన తరుణాన పునర్ముద్రణకు అవసరమయ్యే లక్ష రూపాయల సొమ్మును అందచేయడం, తాను స్వయంగా వీణవాదనం సాధన చేయడం ఇలా విజయనగర కళా సరస్వతీ వికాసాలు ఈ రాజు కాలంలో ఉచ్ఛదశకు చేరుకున్నాయి.వీణా విద్వాంసులు సూర్యనారాయణ శాస్ర్తీగారు, ఫిడేలు వాయిద్య నేర్పరి కలిగొట్ల కామరాజుగారు, రుద్రవీణావాదన నిపుణులు కవిరాయని రమణయ్యగారు హిందుస్తానీ సంగీతంలో మంచి వైదుష్యంగల మహంతి ఖాన్‌గారు, ప్రముఖ వైణికులు గురాచార్యుల వెంకటరమణదాసుగారు, ఆనందగజపతి కొలువు కూటమిలో సంగీత గంగ పొంగులు వారేది.ముడుంబై వరాహ నరసింహాచార్యులు, గురజాడ శ్రీరామమూర్తి, బహుజనపల్లి సీతారామాచార్యులు, తచ్చూరి సింగరాచార్య, గురజాడ అప్పారావు గార్ల విభిన్నమైన రచనల్ని ఆనందగజపతి అంకితం పొందారు. నన్నయచే సంస్కృత మహాభారత ఆంధ్రీకరణం మొదలుపెట్టించిన రాజరాజ నరేంద్రుని వలె, గురజాడ అప్పారావుగారిచే, కన్యాశుల్కము, వ్యవహారిక భాషా నాటకాన్ని రాయ ప్రేరేపించిన ఆనందగజపతి కూడా ఆధునిక తెలుగు సాహిత్య యుగారంభ దీప్తిమంత మూర్తులలో ఒకరిగా వుండిపోతారు.ఆనందగజపతిరాజు పాండితీ ప్రకర్ష చూసిన తిరుపతి వేంకటవులు ‘ఏము చూచిన రాజులందెల్ల నొక్క విజయనగర మహారాజు వేత్త’’ అని స్తుతించారు. నిండు మనసుతో ఆనందగజపతిని ఉద్దేశించి కవితా ప్రశంస చేశారు.ఆనంద గజపతి మేనబావయిన విజయరామ గజపతిని దత్తత చేసుకోవడం వలన, ఈయన ఉత్తర హిందుస్థానములవాడూ, రాజుగారి తల్లి తరపు బంధువర్గంలోనివాడూ కావడం మూలాన, ఈ దత్తత చెల్లదని దాయాదులయిన ఇతర ఆంధ్ర క్షత్రియ కుటుంబాలవారు, తెలుగువారయిన రాజబంధువులు, కోర్టులో దావాతెచ్చారు. ఇదే పెద్ద దావాగా పేరుపొందిన వ్యాజ్యం. దత్తత కోర్టువారిచే చిరకాల వ్యాజ్యం తరవాత ఆమోదించారు. రాజీ షరతుల ప్రకారం జొన్నవలస, పూసపాటిరేగ, కొఠాం, తాళ్ళవలస రాజబంధువులు కొంత సొమ్ము తమలో తాము పంచుకునేలా అంగీకారానికి వచ్చారు.విజయరామగజపతి-4 కాలంలో సైతం గురజాడ వారి సేవలు సంస్థానానికి అందాయి.
అయోధ్య తాలూకా ఖాట్మండు రాజ్యపాలకులయిన ఠాకూర్ సులాజ్‌బ గారి కుమార్తె లలిత కుమారీదేవిని, విజయరామ గజపతి వివాహమాడిన సందర్భంలో సంప్రదింపులు జరిపిన వారుగా గురజాడ వారిని ఇరుపక్షాలూ ఎంతో గౌరవించి ఆదరించాయి. మహారాజ కుమారికా లలిత కుమారీదేవి విజయనగరం కోటలో వున్న కాలంలోనే, అమె చొరవవల్ల గురజాడవారి ఇంటి స్థలం, ఇల్లువారికి కొంత మూల్యం స్వీకరించి సంస్థానం దఖలుపర్చింది. ఈ కృతజ్ఞతతోనే గురజాడ తన లైబ్రరీలోని పుస్తకాలపై ‘గురజాడ అప్పారావు, లలిత్ బిల్డింగ్’ అని రాసుకునేవారు.విజయరామ గజపతి, తమ తండ్రిగారయిన ఆనందగజపతి మార్గానే్న నడిచి, ఎనమండ్ర నారాయణమూర్తిగారిచే 1918లో కావ్యరచన పోటీలు నిర్వహించగా తదుపరి కాలంలో కవికోకిలగా ప్రసిద్ధుడయిన దువ్వూరి రామిరెడ్డి గారి కృషీవలుడు కావ్యం మొదటి బహుమతిని అందుకున్నది. వీరి పాలనా కాలంలోనే కోరుకొండ పాలస్ నిర్మాణం జరిగింది. అదే ప్రస్తుతం కోరుకొండ సైనిక స్కూల్ భవంతి.వీరి కుమారులు అలక్ నారాయణ గజపతికి ఆదిభట్ల నారాయణదాసుగారు షేక్స్‌పియర్, కాళిదాసు మహా కవుల కవిత్వంలోని నవరస ఘట్టాలను నవరస తరంగిణిగా అనువదించి అంకితమిచ్చారు. ఇంకా భోగరాజు నారాయణమూర్తి, ఆకుండి వెంకట శాస్ర్తీ, ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య తెనిగించిన గ్రంథాలు ఈయనకు అంకితం ఇచ్చారు.ఆధునిక కాలపు మహారాజు, సామాన్యులలో మాన్యుడు, సోషలిస్టు అయిన అయిదవ విజయరామగజపతి (పి.వి.జి.రాజు) విజయనగరం విద్యారంగాన, తన తండ్రిగారి పేరిట ‘మహారాజా’ అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ ఎండ్ సైనె్సస్’ 1958లో ప్రారంభించారు. ఇదే మాన్సాస్ (MANSAS) సొసైటీగా ప్రస్తుతం పలు కార్యక్రమాలకు, విద్యా వ్యాసంగాలకు ఊతగా నిలబడుతోంది. బీహార్ ప్రాంత రైతుల తరఫున ‘పన్నులు చెల్లింపు నిరాకరణ’ ఉద్యమంలో పాల్గొన్నందుకు యువకుడయిన విజయరామ గజపతి, సోషలిస్టు ఉద్యమకారులు రామ్‌మనోహర్ లోహియాతోపాటు, బీహార్‌లోని పుర్నియా చెరసాలలో నలభై అయిదురోజుల జైలుశిక్ష అనుభవించారు.ఒక్కొక్క రంగంలో తమ తమ కాలంలో తిరుగులేని పండితులు, కవులు, కళాకారులు ఎందరో. వీరిని కన్న నేల విజయనగర సరస్వతి ధన్య. వీరిది పోషించిన రాజులు తల్చుకోదగ్గవారు. ఈ పునరుజ్జీవన ప్రాభవాలను మానవ జీవితానికి సంప్రాప్తింపచేసిన మూడు వందలేళ్ళ కోట, తెలుగువారి తెలుగు తనాల నిధి. మన చారిత్రక సంపద. కవిత్వంలో కొంత అతిశయోక్తి లేకపోతే అది ఒక ఉత్సవ హేతువు కాలేదు. కత్తిపట్టినా, కవిత్వం చెప్పినా అడిదంవారికే చెల్లిందనేది ఉత్తమ సర్కార్లలో జగమెరిగిన సత్యం. పెద్దాపురం జమీందారు సభలో అడిదం సూరకవి చెప్పిన చాటువు ఇది.‘‘రాజు కళంక మూర్తి రతిరాజు శరీర విహీనుడంబికారాజు దిగంబరుండ, మృగరాజు గుహాంత సీమవర్తి విభ్రాజిత పూసపాడ్వి జమరామ నృపాలుడు రాజుగాక రుూరాజుల్ రాజులే పెను తరాజులు గాక ధరాతలంబునన్’’పదిహేడో శతాబ్ది పూర్వార్థంలో చెప్పిన ఈ చాటువు, పెద విజయరామరాజు కాలానికి చెందింది. ఇందులో ‘తరాజు’ అనే అన్యదేశీయ పదాన్ని సూరకవి ఉపయోగించాడు. తరాజు అనే ఉర్దూ మాటకు ‘తూకం వేసే త్రాసు’ అని అర్థం.ఇలా మానవ జీవితానికిగల ఎన్నో వైవిధ్యవంతమయిన కోణాలను తనలో ఇముడ్చుకున్న కాలపు కలకండ, రాతి పూలదండ మూడు వందలేళ్ళ విజయనగరం కోట.
రాళ్ళలో వికసించిన పూలు పరిమళాలు వెదజల్లితే, అది విజయనగరం సాక్షిగా తెలుగు నేల నలుచెరగులకూ వ్యాపించాయి. లలితకళామతల్లికి నాగరమై, వారి కధాపితామహుల కలనూపురమై గురజాడ విశ్వమానవతల గోపురమై, ఫిడేలు నాయుడి రాగాలలో పరశిస్తున్న విజయనగరం నక్షత్రాలు తాపడం చేసిన నేల అందులో భాగమే ఈ విజయనగరం కోట త్రిశతాబ్ది ఉత్సవ హేల.