Saturday, November 24, 2012

డిసెంబర్‌లో సర్కారీ కొలువుల జాతర

వి.ఆర్.ఓ., వి.ఆర్.ఎ పోస్టుల భర్తీకి సన్నాహాలు

కనివినీ ఎరుగని రీతిలో 12 లక్షల మంది అభ్యర్ధులు పోటీపడిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ 2011 భారీ రిక్రూట్‌మెంటు ప్రక్రియను ఇటీవలే ప్రధాన భూ పరిపాలన కార్యాలయం (సిసిఎల్‌ఎ) పూర్తి చేసింది. ఉభయ ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్ధులు వి.ఆర్.ఓ, వి.ఆర్.ఎ ఉద్యోగ బాధ్యతల్లో చేరి ఆరు నెలలు కావస్తోంది. తాజాగా 1300 కొత్త వి.ఆర్.ఓ పోస్టులు, 3600 వి.ఆర్.ఎ పోస్టులకు క్లియరెన్స్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ప్రకటించి రిక్రూట్ మెంటు చేపట్టేందుకు సంస్థాగతంగా మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా? తెలపాలంటూ సిసిఎల్‌ఎ అధికారులను రాష్ర్ట ఆర్థికశాఖ అధికారులు కోరినట్టు తెలిసింది. కేంద్రీకృత పద్ధతిలో సిసిఎల్‌ఎ యంత్రాంగం వి.ఆర్.ఓ, వి.ఆర్.ఎ పోస్టుల భర్తీని ప్రత్యేకంగా రిక్రూట్‌మెంటు విభాగం ఏమి లేకున్నప్పటికీ యుద్ధప్రాతిపదిక పూర్తి చేయకలిగింది.

నెలరోజుల్లో స్పష్టత : కొత్త వి.ఆర్.ఓ, వి.ఆర్.ఎ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు సిసిఎల్‌ఎ అధికారులు ఇచ్చే సమాచారంపై ఆధారపడి ఉంటాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనగానే ఆర్థిక అంశంతో ముడిపెట్టి చూస్తున్న పరిస్థితిని పక్కకు నెట్టిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి సర్కారీ కొలువుల జాతరకు తెరతీసి నట్లుగా అనుమతులు ఇస్తు న్నారు. ఈ నేపథ్యంలో బంగ్లావాచర్ వంటి అతి చిన్న పోస్టు నుంచి గ్రూప్-1 వంటి ఎగ్జిక్యూటివ్ పోస్టు ల వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుపడమే తరువాయి రాష్ర్ట ప్రభు త్వం అనుమతి ఇస్తూపో తోంది. ఇదే సమయంలో రాజీవ్ యువకిరణాలు పేరిట ప్రైవేటు రంగం లోనూ యువతకు ఉద్యోగాలు ఇప్పిం చేందుకు, పెద్ద ప్రయత్నం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, కొత్త వి.ఆర్.ఓ, వి.ఆర్.ఎ పోస్టుల భర్తీపై మరో నెలరోజుల్లో సిసిఎల్‌ఎ సిఫారసు మేరకు రాష్ర్ట ప్రభుత్వం అనుమతివ్వనుందని అధికారుల ద్వారా తెలిసింది.

డిసెంబర్‌లో మరో 6వేల కానిస్టేబుల్స్ తాజా నోటిఫికేషన్

రాష్ర్ట స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి మళ్ళీ కానిస్టేబుల్స్ కొత్త నోటిఫికేషన్ అభ్యర్ధుల ముందుకు రానుంది. రాబోయే కొత్త నోటిఫికేషన్‌లో 6 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి. హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన కానిస్టేబుల్ ఖాళీలు 2500, పలు జిల్లాలలో మహిళా అభ్యర్ధులకు సంబంధించిన ఖాళీలు 2,700, ఇతర జిల్లాలో అభ్యర్ధులు లేక మిగిలిపోయిన కానిస్టేబుల్ పోస్టులు 200 వరకు ఉన్నాయని పి.ఆర్.బి. అధికారుల ద్వారా తెలిసింది.ఇటీవల జరిగిన 17 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో స్థానిక అభ్యర్ధులు దొరకక మిగిలిన పోస్టులు, అటు మహిళా అభ్యర్ధులు లేక మిగిలిన పోస్టులు దాదాపు 6 వేల ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఇప్పటికే సంబంధిత పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఉన్నందున, అలాగే చేతిలోని కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినందున వెంటనే 6వేల కానిస్టేబుల్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ప్రకటించాలని పి.ఆర్.బి. అధికారులు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీపై కొంతమంది హోంగార్డ్ అభ్యర్ధులు ట్రిబ్యునల్‌లో కేసు వేసినందున అది తొలిగిన వెంటనే 6 వేల కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్ వెలువడనున్నది. రాబోయే 6 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తాన్ని 6 నెలల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు పిఆర్‌బి అధికారులు వివరించారు. గతంలో పలు రిక్రూట్‌మెంట్లు ఏక సమయంలో చేపట్టిన దృష్ట్యా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. తాజాగా చేతిలోని ఇతరేతర రిక్రూట్‌మెంట్ ప్రక్రియలు చాలా వరకు పూర్తి అయ్యాయి. ఇంకా ఎస్.ఐ వంటి పోస్టులకు రాత పరీక్ష నిర్వహణ, ఫలితాలు ప్రకటించటం వంటి కీలక బాధ్యతలు పి.ఆర్.బి. పరంగా ఉన్నాయి. ఇక వార్డర్స్ ఇంటర్వ్యూలు పూర్తి అయిన తర్వాత సదరు జాబితా అందుకున్న వారం రోజుల్లో వార్డర్స్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్ధుల జాబితా ప్రకటించనున్నట్లు పి.ఆర్.బి. అధికారులు వివరించారు. అలాగే డిప్యూటీ జైలర్స్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్ధులకు జైళ్ళశాఖ ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంటుంది.

డిసెంబర్‌లో డిప్యూటీ జైలర్స్ రాతపరీక్ష ఫలితాలు ప్రకటిస్తే ఆపై నెలలో సదరు అభ్యర్ధులకు జైళ్ళ శాఖ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మొత్తంమీద డిసెంబర్, జనవరి కల్లా జైళ్ళ శాఖ ఉద్యోగాల భర్తీ పూర్తి కానుందని చెప్పవచ్చు. ఏ ఉద్యోగాల భర్తీలో నయినా తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులు ఎన్ని ఉన్నా అవి క్యారీ ఫార్వార్డ్‌గా కొత్త నోటిఫికేషన్‌లో ప్రకటించాలని రాష్ర్ట సబార్డినేట్ సర్వీసు రూల్సు స్పష్టం చేస్తున్నాయి. ఎంపికయిన అభ్యర్ధులు పోస్టులలో చేరకుంటే, లేదా ఉద్యోగాలు వద్దనుకుంటే సదరు ఖాళీలలో దిగువ స్థానంలోనున్న అభ్యర్ధులను ఎంపిక చేసేలా వెయిటింగ్ ఆపరేట్ చేయకూడదనే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకా కానిస్టేబుల్ పోస్టులు జిల్లా స్థాయి క్యాడర్‌కు సంబంధించినవి. అంటే జిల్లా ప్రాంతాన్ని యూనిట్‌గా చేసుకుని కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు. జిల్లాలో ప్రకటించే మొత్తం ఖాళీలలో 80 శాతం పోస్టులు స్థానిక అభ్యర్ధులకు రిజర్వ్ చేస్తారు. మిగతా 20 శాతం కానిస్టేబుల్ పోస్టులలో స్థానికులు లేదా ఇతర జిల్లాల అభ్యర్ధులు ఎవరైనా రాత పరీక్ష మెరిట్‌తో ఎంపిక కావచ్చు. హైదరాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ పోస్టులకు స్థానిక అభ్యర్ధులు దొరకక 2,500 పోస్టులు మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన రాజీవ్ యువకిరణాలు పథకం సమీక్ష సమావేశంలో హైదరాబాద్ కానిస్టేబుల్ పోస్టులు, మహిళా కానిస్టేబుల్ పోస్టులు భర్తీకాని విషయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఈ పోస్టులపై స్థానికంగా పోటీపడే అభ్యర్ధులు లేదా మహిళా అభ్యర్ధినిలకు ప్రత్యేక శిక్షణ అవకాశాలు రాజీవ్ యువకిరణాలు ద్వారా అందించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ దిశగా రాబోయే కానిస్టేబుల్ పోస్టులు మొత్తం భర్తీ కావడానికి రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందనే చెప్పాలి.

పరుగు పందాలకు రెడీ అవుతున్న ఎక్సయిజ్ కానిస్టేబుల్స్

ఎక్సయిజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా ఎక్కడికక్కడ ఆయాజిల్లా ప్రాంతాలలో డిసెంబర్ 1 నుంచి ఎక్సయిజ్ కానిస్టేబుల్స్ పరుగుపందెం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎక్సయిజ్ కమిషనరేట్ అధికారులు తెలిపారు. ముందుగా మహిళా అభ్యర్ధులకు పరుగుపందెం పోటీలు నిర్వహించాలని ప్రతిపాదనలు ఉండగా, తక్కువ సంఖ్యలో మహిళా అభ్యర్ధినిలు పోటీపడినందున ముందుగా పురుష అభ్యర్ధులకు పరుగు పందెం పోటీలు నిర్వహించాలని ఎక్సయిజ్ కమిషనరేట్ అధికారులు నిర్ణయించారు. రోజుకు 1000 మంది అభ్యర్ధులకు పరుగు పందెం పోటీలు పూర్తి చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. నెలన్నర రోజులపాటు కొనసాగనున్న పరుగుపందెం పోటీలు జనవరి 15 వరకు జరిగేలా షెడ్యూల్స్ రూపొందించారు.

2606 పోస్టులు 4.6 లక్షల అభ్యర్ధులు ః శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్ధులే యూనిఫాం ఉద్యోగాలకు పోటీపడే అవకాశాలుంటాయి. ఈ శారీరక ప్రమాణాలు అనగానే చాలామంది అభ్యర్ధులు వెనుతిరుగుతారు. ఇటువంటి పరిస్థితి ఎక్సయిజ్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడుతున్న అభ్యర్ధుల సంఖ్యను బట్టి చూస్తే లేదనే చెప్పాల్సి వస్తోంది. కేవలం 2606 ఎక్సయిజ్ కానిస్టేబుల్ పోస్టులకు భారీ సంఖ్యలో 4.6 లక్షల మంది అభ్యర్ధులు పోటీపడటం రికార్డ్‌గా చెప్పవచ్చు. అంటే ఒక పోస్టుకు దాదాపు 180 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నట్టే. ఇటీవల పి.ఆర్.బి. నిర్వహించిన 17 వేల ఖాళీలు గల కానిస్టేబుల్ పోస్టులకు 4 క్షల మంది అభ్యర్ధులే పోటీపడగా, ఈ సంఖ్యకు మించి అభ్యర్ధులు 2606 ఎక్సయిజ్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడడం గమనార్హం.

రంగారెడ్డి టాప్ : 192 ఖాళీలు గల రంగారెడ్డి జిల్లాలోని ఎక్సయిజ్ కానిస్టేబుల్ పోస్టులకు రాష్ర్టంలోనే అత్యధిక సంఖ్యలో 32,470 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు. విశేషం ఏమంటే అత్యధికంగా 240 ఎక్సయిజ్ కానిస్టేబుల్ ఖాళీలు గల కృష్ణా జిల్లా 30,841 అభ్యర్ధులతో రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ స్థానంలో ఉన్న మహబూబ్‌నగర్‌లోని 141 ఎక్సయిజ్ కానిస్టేబుల్ ఖాళీలకు 29,331 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు. అత్యంత తక్కువగా 27 ఎక్సయిజ్ కానిస్టేబుల్స్ గల ప్రకాశం జిల్లాలో 5,075 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో 1 పోస్టుగల ఎస్.టి.మహిళా కేటగిరిలో 29 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు.

No comments:

Post a Comment