Saturday, November 17, 2012

డిసెంబర్ తొలి వారంలో గ్రూప్-1 ఫలితాలు

డబుల్ వేల్యూయేషన్ పంథాలో కొనసాగుతున్న గ్రూప్-1 మెయిన్స్ పేపర్ల వేల్యూయేషన్ ప్రక్రియ శరవేగంగా పూర్తి కావస్తోంది. ఇప్పటికే మొదటి దఫా జరిగే సింగిల్ వేల్యూయేషన్ ప్రక్రియలో అన్ని పేపర్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మెయిన్స్ పేపర్ల డబుల్ వేల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. డబుల్ వేల్యూయేషన్ అనంతరం ఏ అభ్యర్ధి పేపర్‌లో అయినా కనీసం 15 శాతం మార్కుల వ్యత్యాసం కనిపిస్తే సదరు పేపరును త్రిబుల్ వేల్యూయేషన్‌కు పంపించి నిర్ధిష్ట మార్కులు ఖరారు చేయనున్నారు. మొత్తం మీద నవంబర్ నెలఖారులోగా గ్రూప్-1 మెయిన్స్ వేల్యూయేషన్ ప్రక్రియ పూర్తి కానుందని కమిషన్ అధికారుల ద్వారా తెలిసింది. ముందుగా 45 రోజుల వ్యవధిలో గ్రూప్-1 మెయిన్స్ పేపర్లు వేల్యూయేషన్ పూర్తి చేయాలని కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసుకుంది. దానికంటే మరో 20 రోజుల ఆలస్యంగా వేల్యూయేషన్ ప్రక్రియ ముగుస్తున్న క్రమంలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు డిసెంబర్ తొలి వారంలో అభ్యర్ధులు ఆశించవచ్చు.


మెయిన్స్ ఫలితాలు వెలువడిన వారం పదిరోజుల్లో గ్రూప్-1 ఇంటర్వ్యూలు ప్రారంభించటం కమిషన్ అనవాయితీ. అయితే ప్రస్తుత ఛైర్మన్ శ్రీమతి రేచల్ ఛటర్జీ వచ్చేనెల డిసెంబర్ ఆఖరుకల్లా కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి పదవి విరమణ చేయనున్నారు. దీనితో కమిషన్‌కు నూతన ఛైర్మన్‌ను రాష్ర్ట ప్రభుత్వం నియమించాల్సి ఉంది. ఛైర్మన్ మారే క్రమంలో గ్రూప్-1 ఇంటర్వ్యూల నిర్వహణ షెడ్యూల్ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. అయితే అంచనాల కంటే ముందుగానే వేల్యూయేషన్ పూర్తయి, ఫలితాలు వెలువడితే ప్రస్తుత ఛైర్మన్ నేతృత్వంలోనే గ్రూప్-1 ఇంటర్వ్యూలు పూర్తికావచ్చు. ఇంటర్వ్యూల నిర్వహణపై నిర్ధిష్ట షెడ్యూల్స్ మెయిన్స్ ఫలితాలు వెంబడే అభ్యర్ధులు తెలుసుకునే వీలవుతోంది. అలాగే గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వెల్లడి కోర్టు కేసులతో ముడిపడి ఉందని కూడా చెప్పాల్సిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ‘కీ’లో తప్పు జవాబులకు సంబంధించిన ట్రిబ్యునల్ కేసు పురోగతిపై మెయిన్స్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

No comments:

Post a Comment