Sunday, November 11, 2012

ఖారవేలుడు - హాతిగుంఫా శాసనం


భువనేశ్వర్ వద్ద ఉదయగిరి కొండల్లో ఉన్న హాతిగుంఫా గుహ
 చేది వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాతిగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు. 24 సం.ల వయస్సులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు. కళింగులు నేటి ఉత్తరాంధ్ర, ఒరిస్సా ప్రాంతాలను పాలించిన రాజులు. కొన్ని చోట్ల ఆంధ్ర, కళింగ శబ్దాలు ఒకదానికొకటి కూడా వాడబడ్డాయి. మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీ.పూ.255లో జరిగింది. అది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము. తరువాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలనా విధానాలుగా చేకొన్నాడు.

అశోకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత క్రీ.శ. 183లో ఖారవేలుడు కళింగ రాజయ్యాడు. మౌర్య సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన మొదటి స్వతంత్ర కళింగ రాజు ఇతడే. పాటలీపుత్రాన్ని పాలిస్తున్న పుష్యమిత్రుని ఓడించి మౌర్య రాజులు అంతకుముందు తీసుకువెళ్ళిన జైన విగ్రహాలను తిరిగి కళింగ రాజ్యానికి తీసుకొచ్చాడు. ఖారవేలుడు జైన మతస్థుడు, వృషభ లాంఛనుడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం.




ఖారవేలుని హాతిగుంఫా శాసనము
 ఖారవేలునికి సమకాలీనుడు ఆంధ్రదేశంలో శాతవాహన రాజు శాతకర్ణి. వారికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పిథుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని హథీగుంఫ శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేము - "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట." ఏమయినా తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుండ నగరం బహుశా "ప్రతిపాలపురం" లేదా భట్టిప్రోలు అయ్యి ఉండవచ్చును. ఖారవేలుడు సర్వ రాష్ట్రిక, భోజక ప్రభువులను ఓడించాడు. అంగ వంగ దేశాలనుండి రత్నాలు తెచ్చాడు. ఖారవేలుడు యుద్ధవీరుడే కాక ఎంతో సమర్ధత గల రాజు. పౌర జానపదులకు అనేక సౌకర్యాలు కలిగించాడు. అంతకు పూర్వం మగధ రాజులు వేయించిన కాలువలు పూడిపోగా ఖారవేలుడు వాటిని తిరిగి మరమ్మతు చేయించాడు. రాజధానికి నీటివసతి కల్పించాడు. జైనానికి ఇతోధికంగా ప్రోత్సాహం కలిగించాడు. 164 జైనమత గ్రంధాలను పునరుద్ధరించాడు. తుఫానులవలన పడిపోయిన గోపుర ప్రాకారాలను బాగుచేయించాడు. 35 లక్షల ప్రజలు అతని రాజ్యంలో ఉండేవారు.

జైనమత వ్యాప్తికి కృషి

క్రీ.పూ. 4వ శతాబ్దంలో జైనం మన రాష్ట్రంలోకి ప్రవేశించింది. కళింగరాజు ఖారవేలుడు ఆదరించడంతో ఈ మతం మొదటగా కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో స్థిరపడింది. అశోకుడి కుమారుడు సంప్రతి ఆంధ్ర, ద్రవిడ, దేశాలలో జైనమత వ్యాప్తికి కృషి చేశాడు. అమరావతికి సమీపంలో వడ్డమాను కొండపై సంప్రతి విహా రం ఏర్పాటు చేశాడు. అక్కడ ఖారవేలుడు మహామేఘ వాహన విహారం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. క్రీస్తు శకారంభంలో కొండకుందా చార్యుడు అనంతపురంజిల్లా కొనకుండ్లలో జైన ఆశ్రమం నిర్మించుకుని మత ప్రచారం చేశాడు. పలు గ్రంథాలు రచించాడు. జైనంలో శ్వేతాం బరులు, దిగంబరులు అని రెండు వర్గాలున్నా ఆ ఇద్దరికీ అనుసరణయమైన సమయసార గ్రంథాన్ని రచించింది ఈ కొండకుందాచార్యుడే! అహింసా మార్గాన్ని జనం ఆదరించినా జైనం దీన్ని మరీ తీవ్రంగా ఆచరణలోకి తీసుకురావడంతో సామాన్యులకు దాన్ని అనుసరించడం కత్తిమీద సామైపోయేది. ఈ ఇబ్బందే జైనమతం ప్రాబల్యం తగ్గిపోడానికి ప్రధాన కారణమైంది. గాలిపీలిస్తే సూక్ఝక్రిములు చనిపోతాయని ముక్కు కు గుడ్డకట్టుకోవడం, మంచినీళ్ళను వడగట్టుకుని తాగడం, కాలికింద పడి క్రిములు చనిపోకుండా ఉండేందుకు నడిచే మార్గాన్నంతా చీపురుతో ఊడ్చుకుంటూ వెళ్ళాలనడం, నేలను దున్ని సేద్యం చేయడం హింసా మార్గమని వ్యవసాయం మానేసి పండి పడిన పళ్ళనే తిని జీవించడం వంటి విధానాలు చూసి సామాన్యులు భయపడి దూరమైపోయారు. ఉల్లి, వెల్లుల్లి తినరు. వడ్డీవ్యాపారం చేస్తారు.

No comments:

Post a Comment