Friday, November 23, 2012

త్వరలో జూనియర్ లెక్చరర్స్ బంపర్ నోటిఫికేషన్

సమాజంలోని అత్యంత బాధ్యతాయుత వృత్తుల్లో అధ్యాపక వృత్తి ఒకటి. పదో తరగతి పూర్తి చేసి కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులకు కెరీర్ పరంగానే కాకుండా సమాజానికి అవసరమైన విధంగా సరైన దిశలో నడిచేందుకు మార్గ నిర్దేశం చేసే జూనియర్ లెక్చరర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో వాటి వివరాలు...

- సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ : సాంకేతిక నైపుణ్యంతో ఒక చోట ఉండి ఖండాంతరాల పనిని చక్కబెట్టే ఆధునిక ఉద్యోగం

- చార్టెడ్ అకౌంటెంట్ : కంపెనీల వ్యాపార లావాదేవీలకు గణాంకాలు రూపొందించి చట్టబద్ధత అందించే అరుదైన పోస్టు.

- న్యాయవాది : పేదవాడి నుంచి కుబేరుడి వరకు కేసులు వాదించి గెలుపే లక్ష్యంగా న్యాయ పోరాటం చేసే ప్రత్యేక ఉద్యోగం.

- పోలీసు ఆఫీసర్ : ప్రజలకు అవసరమైన భద్రతకు తొలి వారధిగా తన రక్షణను సైతం మరచి ఎదురొడ్డి నిలిచే ఉద్యోగి.

ఇలాంటి ప్రత్యేక ఉద్యోగాలు అయినా లేదా ఇతర వృత్తులు అయినా వాటికి ఇంటర్మీడియటే పునాది. ఇంటర్మీడియట్‌లో చేరి తమ లక్ష్యం కోసం కృషి చేసే వేలాది మంది యువత చేయి పట్టి నడిపించి పాఠాలు బోధించే కీలక వ్యక్తి జూనియర్ లెక్చరర్. పట్టణ ప్రాంతాలకు చెందిన చదువుకున్న తల్లిదండ్రుల పిల్లలకు ఇంటర్ ఎందుకు చదువుతు న్నామో తెలుసు. కానీ పల్లెటూరు నిరక్షరాస్యుల కుటుంబం నుండి వచ్చి ఇంటర్‌లో చేరిన విద్యార్థులకు ఆ చదువులు ఎలా పనికి వస్తాయో తెలియని పరిస్థితి. ఇటువంటి ఎంతోమందికి ‘‘బతుకు బాట’’ వేసి వారిని ఉత్తేజపరిచి ఉత్తమ కెరీర్‌లో స్థిరపడేలా అవకాశం కల్పించే అరుదైన ఉద్యోగం జూనియర్ లెక్చరర్. కనీవినీ ఎరుగని రీతిలో భారీ సంఖ్యలో జూనియర్ లెక్చరర్ ఖాళీలకు ప్రభుత్వం త్వరలో కొత్త నోటిఫికేషన్ ప్రకటించనున్నది.

వృత్తి స్వభావం

జూనియర్ లెక్చరర్‌గా ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్దేశిత సబ్జెక్టు పాఠాలు బోధించాలి. ఏడాదిలో 365 రోజులలో 224 రోజులు కాలేజీలో పాఠాలు బోధించి సిలబస్ పూర్తి చేయాలి. సాధారణంగా జూన్ 1న పునః ప్రారంభమయ్యే జూనియర్ కాలేజీ తదుపరి ఏడాది ఏప్రిల్ 28 కల్లా పూర్తయ్యేలా అకడమిక్ ఇయర్ వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆర్ట్స్ లేదా కామర్స్ లేదా సైన్స్ సబ్జెక్టుల జూనియర్ లెక్చరర్ ఎవరైనా రోజుకు రెండు పీరియడ్లు బోధించాలి. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం పాఠం ఒకటి ఉండగా, మరోటి రెండో ఏడాది విద్యార్థులకు బోధించాలి. తరగతి గదిలో 40 మంది విద్యార్థులు ఉన్నా లేక 160 మంది విద్యార్థులు ఉన్నా అందుకు తగ్గట్టు ప్రణాళిక రూపొందించుకుని పాఠం చెప్పాల్సి ఉంటుంది.సైన్స్ గ్రూప్‌కానీ, ఇతర గ్రూపులు కానీ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు రెండు సెక్షన్లుగా విభజించి నాలుగు తరగతులు బోధించాల్సి ఉంటుంది. సైన్స్ విద్యార్థులకు ల్యాబోరేటరీలో ప్రాక్టికల్స్ శిక్షణకు సంబంధిత జూనియర్ లెక్చరర్లు అదనపు బోధన చేపట్టాల్సి ఉంటుంది. అవసరమైన చోట తెలుగుమీడియంతో పాటు ఇంగ్లిష్ మీడియంలోనూ ఇంటర్ పాఠాలు బోధించడానికి జూనియర్ లెక్చరర్లు సిద్ధంగా ఉండాలి.

రూ.30 వేల వేతనం

జూనియర్ లెక్చరర్‌గా ఎంపికైన అభ్యర్థులు ప్రారంభ వేతనం రూ.30 వేలు అందుకుంటారు. ఎపిపిఎస్‌సి నుంచి ఎంపికయ్యే గ్రూప్-I కేటగిరీలలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఎం.పి.డి.ఓ, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వంటి ఉద్యోగుల ప్రారంభ వేతనం కంటే (వేతన స్కేలు రూ.16150-42590) అదనంగా మరో రూ.4 వేలు అధికంగా జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు పొందుతారు. ప్రశాంతమైన విద్యావాతావరణంలో చక్కగా పాఠాలు బోధిస్తూ ఎటువంటి ఉరుకులు పరుగులు లేకుండా భారీ వేతనాలు పొందే అవకాశం జె.ఎల్. అభ్యర్థులకు ఉంటుంది.ఏడాదికి రెండుసార్లు డి.ఎ. పెరుగుదల, ఒక ఇంక్రిమెంటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జూనియర్ లెక్చరర్లు పొందుతారు. బేసిక్ వేతనం ఎక్కువగా ఉన్న జె.ఎల్ ఉద్యోగులకు అత్యధికంగా వేతనాలు పెరుగుతూ ఏటారూ.2 వేల వరకు అదనంగా బేసిక్‌లో కలిసే అవకాశం ఉంటుంది. జూనియర్ లెక్చరర్‌గా ప్రారంభ వేతనం రూ.30 వేలు పొందుతున్న ఏ అభ్యర్థి అయినా మరో ఐదు ఏళ్లకు రూ.50 నుండి 60 వేల వేతన స్థాయికి చేరుకునేలా కెరీర్ గ్రాఫ్ ఉంటుందని చెప్పవచ్చు.

పదోన్నతులు ఎలా ఉంటాయి?

జూనియర్ లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించిన అభ్యర్థులు రెండు రకాలుగా పదోన్నతులు పొందవచ్చు. ఒకటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అసోసియేట్ లెక్చరర్. రెండవది, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టులోకి పదోన్నతి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ఏర్పడుతున్న అసోసియేట్ లెక్చరర్ ఖాళీలలో 100 పోస్టులుంటే, అందులో 75 పోస్టులకు జూనియర్ కాలేజీ లెక్చరర్లను పదోన్నతులతో ఎంపిక చేస్తారు. అయితే సదరు జె.ఎల్. అభ్యర్థులు స్లెట్ లేదా నెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా 8 ఏళ్లలో తొలి పదోన్నతి జెఎల్ అభ్యర్థులు పొందవచ్చు.మిగతా 25 శాతం డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. ఇక రెండవది అయిన జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా తొలి పదోన్నతి పొందాలంటే జూనియర్ లెక్చరర్లు 14 ఏళ్ల వరకు వేచి ఉండాల్సిందే. గతంలో 1998లో జూనియర్ లెక్చరర్ల భర్తీ చేపట్టిన కాలేజీ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసిన వారందరూ ప్రిన్సిపాల్స్ అయ్యారు. ఎపిపిఎస్‌సి 2001 జూనియర్ లెక్చరర్స్ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికయిన బ్యాచ్ అభ్యర్థులలో కొంతమందికీ ప్రిన్సిపాల్‌గా పదోన్నతులు లభిస్తున్నాయి. ప్రిన్సిపాల్‌గా పదోన్నతులు పొందిన 15 ఏళ్ల తర్వాత ఖాళీలను బట్టి రీజనల్ ఇన్‌స్పెక్టర్ ఆఫీసర్ (ఆర్.ఐ.డీ) పదోన్నతి పొందవచ్చు. లేదంటే ప్రిన్సిపాల్‌గా రిటైర్ కావచ్చు. ఇదిలా ఉండగా, డిగ్రీ కాలేజీలో అసోసియేట్ లెక్చరర్‌గా పదోన్నతి పొందిన వారు 15 నుంచి 20 ఏళ్లలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా మరో పదోన్నతి పొందవచ్చు. లేదంటే డిగ్రీ కాలేజీ సీనియర్ లెక్చరర్‌గా రిటైర్ కావచ్చు.

బదిలీలు ఎలా ఉంటాయి?

జూనియర్ లెక్చరర్ ఉద్యోగం జోనల్ స్థాయి పోస్టు. రిక్రూట్‌మెంట్ నుండి పోస్టింగ్ వరకు జోనల్ ప్రాంతాలలో గల ఆయా జిల్లాలను కేంద్రాలుగా చేసుకుని, జె.ఎల్. ఉద్యోగాల భర్తీ కొనసాగుతుంది. రాష్ట్రంలో 23 జిల్లాలను కలుపుతూ ఆరు జోన్లు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఉదా॥ ఆరవ జోన్ తీసుకుంటే, అందులో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్ ఉంటాయి. అభ్యర్థులకు సొంత జిల్లాల నుంచి మొదలుకుంటే ఏ ఇతర జిల్లాలోనైనా జె.ఎల్. పోస్టింగ్ ఇవ్వవచ్చు. నిర్ధేశిత జూనియర్ కాలేజీలో జె.ఎల్‌గా చేరిన అభ్యర్థులు గరిష్టంగా 5 ఏళ్లు అక్కడే ఉద్యోగ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ధేశిత జోన్ పరిధిలో ఏదేనీ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి బదిలీ చేయవచ్చు. అలాగే, ప్రిన్సిపాల్‌గా పదోన్నతి లభించిన తర్వాత సైతం పోస్టింగులు జోనల్ స్థాయిలోనే అభ్యర్థులకు అందిస్తుంటారు.

ఇంటర్మీడియట్ విద్య స్వరూపం

రాష్ట్ర స్థాయిలో 824 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కొసాగుతున్నాయి. ఇందులో మొదటి ఏడాదిలో 2 లక్షలు, రెండో ఏడాదిలో 2 లక్షల మంది అభ్యర్థులు ఇంటర్ కోర్సులు చదువు తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇంటర్‌లో పలు రకాల వృత్తి విద్యాకోర్సులను 12 ప్రభ్వుత్వ కాలేజీలు అందిస్తున్నాయి. ఇంటర్‌లో ప్రధానంగా ఆఫర్ చేస్తున్న సాంప్రదాయక కోర్సులు ఎంపిసి, బైపిసి, సిఇసి, హెచ్‌ఇసి, ఎం.ఇ.సి. ఇంటర్ ప్రభుత్వ కాలేజీలలో 12 వేల జూనియర్ లెక్చరర్ సాంక్షన్డ్ పోస్టులున్నాయి. ఇందులో 4500 మంది లెక్చరర్లు మ్రాతమే పర్మినెంట్‌గా పాఠాలు చెబుతుండగా, మిగతా అందరూ కాంట్రాక్టు పద్ధతిలో పాఠాలు బోధిస్తున్నారు. ఇంటర్ విద్యాశాఖ ప్రధాన కార్యాలయం హైదరాబాద్, నాంపల్లి స్థానికంగా నెలకొంది.

అరుదైన నోటిఫికేషన్

రాబోయే జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ కనీవినీ ఎరుగని స్థాయిలో 5 వేల పైచిలుకు పోస్టులతో అభ్యర్థుల ముందుకు రానుంది. ఇందులో సంప్రదాయ జె.ఎల్ పోస్టులు 4200 వరకు ఉండగా, మిగతా పోస్టులు వృత్తివిద్యా జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు. ఇటీవల 15 ఏళ్ల కాలంలో నాలుగు సార్లు జె.ఎల్ రిక్రూట్‌మెంట్ జరిగింది. ఇందులో 1998లో 200 పైచిలుకు జె.ఎల్ పోస్టులు కాలేజీ సర్వీసు కమిషన్ భర్తీ చేసింది. ఆ తర్వాత ఎపిపిఎస్‌సి నుండి 2001లో 660 జూనియర్ లెక్చరర్లు పోస్టులు, 2004లో 330 జె.ఎల్ పోస్టులు పోస్టులు, 2008లో 1100 జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీకి వచ్చాయి. ఉదా॥ గత నోటిఫికేషన్‌లో 100 పోస్టులు కామర్స్‌లో భర్తీకి రాగా, రాబోయే కొత్త జె.ఎల్ రిక్రూట్‌మెంట్‌లో 400 వరకు కామర్స్ జె.ఎల్ ఖాళీలు ఉండనున్నాయి. ఇదే తరహాలో ఇతరేతర జె.ఎల్ సబ్జెక్టులలోనూ భారీ పోస్టులు రానున్నాయి.

నోటిఫికేషన్ దిశగా పరిణామాలు

I. ముఖ్యమంత్రి కార్యాలయం : కాంట్రాక్టు లెక్చరర్లకు వెయిటేజీ కల్పించాలనే అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని కొత్త జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి నేడో రేపో క్లియరెన్స్ ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి తుది ఆదేశాలను బట్టి మాద్యమిక శాఖ, ఆర్థిక శాఖ నుండి ఎపిపిఎస్‌సికి కొత్త జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఖాళీల సంఖ్య (ఇండెంట్లు) పంపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు పంపించనుంది. మొత్తంమీద ఈ నెలాఖరులోగా జె.ఎల్. పోస్టుల భర్తీపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

II. ఇంటర్ విద్యాశాఖ : రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ క్షణం ఆదేశాలు వచ్చినా వెంటనే జె.ఎల్ సబ్జెక్టు వారీ ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, ఇతరేతర వివరాలన్నింటినీ ఎపిపిఎస్‌సికి పంపించేలా ముమ్మర ఏర్పాట్ల పనిలో ఇంటర్ విద్యాశాఖ యంత్రాంగం నిమగ్నమై ఉంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జూనియర్ లెక్చరర్ల ఖాళీల జాబితా తెప్పించుకున్న ఇంటర్ విద్యాశాఖ, వాటిపై మరింత స్పష్టమైన సమాచారం కోసం సంబంధిత రీజినల్ స్థాయి అధికారులను కోరుతూ ఫాలోఅప్ చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఇంటర్ విద్యాశాఖ కసరత్తు పూర్తి కానుంది.

III. ఎపిపిఎస్‌సి : ఇండెంట్లు అందిన వారం రోజుల్లోగా జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ ప్రకటించే దిశగా ఎపిపిఎస్‌సి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక జె.ఎల్. పోస్టులకు అవసరమైన సిలబస్‌ను ఇప్పటికే సిద్ధం చేసిన ఎపిపిఎస్‌సి, ఇండెంట్లు వచ్చిన వెంటనే జెఎల్ నోటిఫికేషన్, రిక్రూట్‌మెంట్లు షెడ్యుల్ ఖరారు చేసి పత్రికా ప్రకటన ఇవ్వనుంది.

No comments:

Post a Comment