Monday, November 19, 2012

తెలుగు లెంక - తుమ్మల సీతారామమూర్తి

తెలుగు లెంక - తుమ్మల సీతారామమూర్తి
తెలుగులెంకగా సుప్రసిధ్ధుడైన తుమ్మల సీతారామమూర్తి 1901 డిసెంబరు 25న గుంటూరు జిల్లా కావూరులో రైతు కుటుంబంలో జన్మించాడు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వెంకటరమణశాస్త్రి వంటి ప్రముఖుల వద్ద విద్యనభ్యసించిన తుమ్మల, కవిగా, పండితుడిగా, తనకు తానే తీర్చిదిద్దుకొన్నాడు. తుమ్మల అచ్చమైన గాంధేయవాది. తెలుగుదనం మూర్తీభవించిన జాతీయోద్యమ కవి. "మహాత్ముని ఆస్థానకవి" అని కట్టమంచి రామలింగారెడ్డితో పలికించుకున్న తుమ్మల, ఆత్మకథ,మహాత్మకథ వంటి ఆదర్శ ప్రౌఢకావ్యాలు, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ఉదయగానము, పఱిగపంట, పైర పంట, శబల, సమదర్శి, నా కథలు వంటి సామాజిక కవిత్వాన్ని అందించారు. అచ్చ తెలుగు మాటలతో అందమైన పద్యాలు అల్లగలిగిన ఆధునిక కవుల్లో తుమ్మలను మించిన వారు లేరంటె అతిశయోక్తి కాదు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడైన తుమ్మల గాంధీ భక్తి, తెలుగు భాషానురక్తి కలిగిన జాతీయోద్యమ కవి.

స్వాభిమానం మెండు. రాష్ట్రగానం, ఉదయగానం ఆనాడు ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూపిన కావ్యాలు. రైతు కుటుంబంలో పుట్టి, ఒక పూట పొలానికి, ఒక పూట బడికి పోయిన తుమ్మల కవిత్వంలో 'రైతు' తొంగి చూస్తుంటాడు. పరిగపంట, పెద్దకాపు, శబల, పైరపంట, సమదర్శి, కదంబకైత, దివ్యజ్యోతి తుమ్మలవారి ఖండ కావ్యాలు. ఆత్మార్పణము, ధర్మజ్యోతి వీరి కథా కావ్యాలు. ఇంకా పెక్కు సామాజిక కావ్యాలు, శతకాలు, నాటకాలు, హరికథలు, చరిత్రములను తుమ్మల రచించారు.


విశ్వనాథ సత్యనారాయణ ఇలా అంటాడు-'ఓయి నాగరకులారా! కృషీవల జీవన విముఖులారా! ఈ మహాకవిని వినుడు! నాగరికతా భ్రాంతిని వదిలించుకొనుడు!' ఇదే తుమ్మలవారి సందేశం అని కూడా మనం భావించవచ్చు. ఆయన్ని చూస్తే అచ్చం తెలుగు రైతులాగా వుండేవాడు కాని 'కవి వేషం' కనబడేది కాదు. ఆరడుగుల నల్లని విగ్రహం. పల్లెటూరి పెద్దరికం తొణికసలాడే నుదురు.

పొడుగైన ముక్కు. గుబురైన మీసాలు. ఖద్దరు దుస్తులు. ఆచితూచి మాటలు. సద్గుణాల ప్రోగు. ఆయన ఒక విషయంలో మాత్రం గర్విష్ఠి! తాను తెలుగు వాడైనందుకు ఆయన గర్విస్తాడు. తెలుగుజోదుల తుటారి కటారి చెలరేగి పగర చీల్చిన దినాన్ని జ్ఞప్తి చేసుకొని, పారతంత్య్రానికి, కులతత్వాలకు, ఈర్ష్యకులోనై, కుక్కలు చింపిన విస్తరిగా దేశాన్ని చేసిన ఆంధ్రజాతిని ఈసడించుకున్నాడు. రాష్ట్ర సిద్ధి కోసం 'రాష్ట్ర గానం' రచించి, రాష్ట్ర వృద్ధికోసం 'ఉదయగానం' ఆవిష్కరించాడు తుమ్మల.

పదవుల కోసం కుమ్ములాటను గాంచి కవి మనసు కలత చెందింది. ఇలా అంటాడు.'దొడ్డ తలపులున్న రెడ్డికైనను మాల/బిడ్డకైన నిమ్ము పెత్తనమ్ము కులము లింక నిల్వగలవటోయీ! వేరు/ పరువు పడియె, వాని పరువు సెడియె' 'బిచ్చగాడు లేని, మ్రుచ్చులేని, కటారిలేని, దొర తనమ్ములేని కుట్రలేని' దేశపరిస్థితుల కోసం కవి ఎదురుచూశాడు. నిజంగా అటువంటి రోజువస్తే అదే 'క్రొత్త సంక్రాంతి' కవికి. నేటి రచయితలకు 'పునాది తక్కువ' అని వారి నిశ్చితాభిప్రాయం.

ఒక ఇంటర్వ్యూలో తుమ్మల ఇలా అన్నారు.'నా రచన పద్యము. దీనికి వ్యవహారిక భాష సాయపడదు. గణము కోసమో యతి ప్రాసల కోసమో సలక్షణ భాషనాశ్రయింపక తప్పదు. వచనము గేయము ఆధారముగా చేసుకొని యువ కవులు వ్యవహారిక భాషలో కవిత్వము వ్రాయుచున్నారు. వీరిలో శ్రీశ్రీ వంటి సిద్ధహస్తులు కొందరున్నారు. భాషా మార్గము ఏదైనను రచయిత లోతుగా సాహిత్య కృషి చేసినపుడే పది కాలాల పాటు అది చరిత్రలో నిలుచును. మా తరం వారు చదివినంత గట్టిగా నేటి యువతరం కావ్య పఠనం చేయడం లేదు. పత్రికల నిండా ఏదో రాస్తున్నారు.

చాలా మంది పలుకులలో ప్రాణం లేదు. పునాది తక్కువ. తనదంతా విప్లవ కవిత్వం అని ఆయన భావన. తమతరం కవుల్లో శృంగారం జోలికి వెళ్లని వారిలో తుమ్మల మొదట నిలుస్తాడు. ఆయన రచన చేయడం ప్రారంభించాక భావ కవిత్వం వచ్చింది. తుమ్మల మనసు దాని మీదకు పోలేదు. తరువాత అభ్యుదయ, విప్లవ కవిత్వాలు వచ్చాయి. వాటి పద్ధతి తుమ్మల చూశాడు. అప్పటికి తుమ్మల రాసిందంతా విప్లవ కవిత్వమే! కాకపోతే ఒక తేడా ఉంది. తుమ్మల విప్లవం అంతా అహింసాయుతం. తుమ్మల సీతారామమూర్తి స్వగృహంలోనే 1990 మార్చి 21న పరమపదించారు.

సిఆర్‌ రెడ్డి ఆయనకు ‘అభినవ తిక్కన’ అనే బిరుదాన్ని ఇచ్చారు. కాని తుమ్మల తెలుగు భాషకు సేవ చేసేవాడిననే అర్ధంలో తనను తాను ‘తెనుగు లెంక’గా పిలుచుకున్నారు. తుమ్మల ‘మహాత్మ కథ’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ నగదు బహుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యఅకాడమీ శాశ్వత సభ్యుడుగా నియమితులయ్యారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్‌ డిగ్రీని తుమ్మలకు అందజేసింది.

No comments:

Post a Comment