![]() |
షోయబుల్లా ఖాన్ |
షోయబుల్లా ఖాన్.. ధిక్కారస్వరం,‘ఇమ్రోజ్’ నిప్పు కణిక.
నిజామ్‌కు వ్యతిరేకంగా నిరసన, ప్రతిఘటన.. ఓ దీర్ఘకాలిక యుద్ధం.
1920, అక్టోబరు 17న ఖమ్మంజిల్లా బూర్గుంపాడు ప్రాంతంలో సబ్రవేడ్ గ్రామంలో ఆయన జన్మించారు. తండ్రి హబీబుల్లాఖాన్. నిజాం ప్రభుత్వంలో పోలీసు అధికారి. తల్లి లాయకున్నిసా బేగం. వారికి ఆయన ఏకైక సంతానం. షోయబ్ భార్య అజ్మలున్నిసాబేగం. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఫరీదాఖాన్. వీరి కుటుంబం ఉద్యోగార్ధం ఉత్తరప్రదేశ్ నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ కాలంలో గ్రాడ్యుయేషన్ చేస్తే పెద్ద పెద్ద ఉద్యోగాలు కాళ్ల దగ్గరికి వచ్చేవి. కానీ షోయబుల్లాఖాన్ ఆ ఉద్యోగాల జోలికి పోలేదు. అది తెలంగాణ అగ్నిగోళంగా ఉన్న సమయం. ఆ సమయంలో షోయబుల్లా ఖాన్ కి అక్షరమే ఆయుధంగా కనిపించింది. అక్షరాన్ని మించిన ఆయుధం మరొక్కటి కనిపించలేదు. ఇది అక్షరాలా నిజం!
అందుకే షోయబుల్లాఖాన్ జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. నిజాం ప్రభుత్వ అరాచకాలపై పెన్ను ఎక్కుపెట్టారు. తేజ్ ఉర్దూ వారపత్రికలో ఉద్యోగం. నిత్యం రాజాకార్లూ, భూస్వాముల ఆగడాలపై వ్యాసాలు రాశారు. దీంతో తేజ్‌ను నిషేధించింది నిజాం ప్రభుత్వం. తరువాత రాష్ట్ర మాజీ మంత్రి మందముల నరసింగరావు నడుపుతున్న 'రయ్యత్' ఉర్దూ పత్రికలో ఉప సంపాదకునిగా బాధ్యతలు నిర్వహించారు. రయ్యత్ పత్రికలో పనిచేస్తానని వచ్చిన రోజే ఆ పత్రికా సంపాదకుడు ముందుముల సర్సింగరావు షోయబ్‌ను నిరుత్సాహపరిచారు. ‘ఇక్కడ మా పత్రికలో ఇచ్చే వేతనం చాలా తక్కువ. పైగా మీకు పెళ్లి అయిందని, ఒక కూతురు కూడా ఉంద ని చెబుతున్నారు. నెలకు మేమిచ్చే 50 రూపాయల వేతనంలో మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కనుక మిగతా అర్హతలతో పాటు ముస్లిం అయిన మీకు ప్రభుత్వంలో మంచి జీతంతో హోదాగల నౌకరీ దొరుకుతుంది ప్రయత్నించండి’ అన్నారు. అన్నీ విని కూడా పత్రికలో పనిచేస్తానని షోయబ్ స్థిరంగా చెప్పడంతో నర్సింగరావు మరో ఇబ్బందిని ఎత్తిచూపారు. ‘మీరు లోగడ తేజ్ వార పత్రికలో రాసిన వ్యాసాలు చూశాను. మీరు రాయిస్టు (ఎం ఎన్ రాయ్ భావాలు కలవాడు) అని నాకు అనిపిస్తున్నది. ‘రయ్యత్’ భిన్న భావాలు గల పత్రిక. ఈ పాలసీతో ఏకీభవించి మీరు పనిచేయలేరేమో!’అన్నాడు. ‘రయ్యత్’లో పనిచేసినంత కాలం పత్రిక భావాలకు భిన్నంగా నా సొంత భావాలు ప్రకటించనని షోయబ్ అన్నాడు. తన భావాలను కప్పిపుచ్చుకోవానికో, బొంకడానికో ప్రయత్నించకపోవడం వల్ల అతని నిజాయితీ నిరూపితమైంది. ‘రయ్యత్’లో చేరిపోయాడు.అందులో చేరిన అనతి కాలంలోనే అతని ప్రతిభావిశేషాలు వెల్లడయ్యాయి. అతని పని పెరిగింది. వేతనమూ పెరిగింది. ఉద్యోగిగా కాకుండా ‘రయ్యత్’లో కుటుం బ సభ్యుడిలా ఆత్మీయతను వృద్ధి చేసుకున్నాడు.
నిజాం పాలకుల రాక్షస పాలనను, రజాకార్ల దురాగతాలను ఎండగట్టే పలు రచనలు చేశారు. రయ్యత్ పత్రిక కూడా నిజాం ఆగ్రహానికి గురై మూతబడింది. అయినా షోయబ్ అధైర్యపడలేదు, పెన్నులపై మన్నుగప్పితే గన్నులై మొలకెత్తుతై. ఆ గన్నే ఇమ్రోజ్. భార్యను, తల్లిని ఒప్పించి వారి ఆభరణాలు అమ్మేశారు. ఆ వచ్చిన డబ్బుతో జాతీయ భావాలు ప్రేరేపించగల 'ఇమ్రోజ్' ఉర్దూ దినపత్రికను 1947, నవంబరు 1న ప్రారంభించారు. ఎంతో శ్రమించి, ఆర్థిక ఆటంకాలు అధిగమించి ఈ పత్రికను ప్రజల పత్రికగా తీర్చిదిద్దారు. నిజాం ప్రభువుల నిరంకుశత్వం, మతాన్మోదుల దురహంకారం మీద అక్షరాయుధంతో తిరుగులేని సమరం సాగించారు.
1948, జనవరి 29 ఇమ్రోజ్ సంచికలో 'పగటి ప్రభుత్వం-రాత్రి ప్రభుత్వం' అనే వ్యాసం రాశారు. 'ఈనాడు తెలంగాణా గ్రామాలలో ప్రజలు నిజాం ప్రభుత్వ తిరగలిలో పిండి చేయబడుతున్నారు. ఇత్తెహుదల్ సభ్యులు గాంధీ టోపీలు ధరించి 'గాంధీకీ జై' అంటూ గ్రామాలలో దోచుకుంటున్నారు. పాలకులు వీరికి అండనిస్తున్నారు. ఈ అరాచక వ్యవస్థ ఓ విషవలయంగా మారింది. 'ఇత్తెహుదల్ ముస్లిమాన్ సంస్థ'ఫై ప్రభుత్వం నిషేధం ఎందుకు విధించదు? ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే మంత్రివర్గాన్ని ఎందుకు ఏర్పాటుచేయదు?' అని షోయాబ్ సంధించిన ప్రశ్నలు పాలకవర్గాన్ని బోనులో నిలబెట్టాయి. ఈ వ్యాసం గ్రామీణ ప్రజల దుర్భర పరిస్థితులకు అద్దం పట్టింది. నిజాం పాలకుల బండారం పొట్టవిప్పి చూపింది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, యూత్ లీగ్, విద్యార్థి యూనియన్, ఆర్యసమాజ్, ఎవరు పోరాటం చేసినా ఆ వార్తలను షోయబ్ తన పత్రికలో ప్రచురించేవారని ఆయన సహచరుడు బాబూరావు వర్మ గుర్తుకు తెచ్చారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు నుంచి కామ్రేడ్స్ అసోసియేషన్ నాయకుడు ప్రొఫెసర్ ఖుంద్‌మేరి ఆలం వరకూ ఆయనకు పలువురితో సంబంధాలుండేవని వర్మ చెప్పారు.
1947, ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించింది. దేశంలోని సంస్థానాలన్నీ భారత్‌లో విలీనమవుతున్నాయి. తన సంస్థానాన్ని భారత్‌లో కలపరాదని, స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని 1947, జూన్‌లోనే ఐక్యరాజ్యసమితిలో నిజాం పిటిషన్ వేశాడు. 'అనల్‌మాలిక్' అంధ విశ్వాసాన్ని రంగంలోకి తెచ్చారు. 'నేను ముస్లిం రాజును. నాది ముస్లిం రాజ్యం. ముస్లిం రాజు స్వతంత్రుడు' అంటూ ఆజాద్ హైదరాబాద్ నినాదాన్నిచ్చాడు. ఆ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలన్న ప్రజల కోర్కెను 'భారత సామ్రాజ్యవాదుల కుట్రగా' ప్రచారం చేశాడు. పైగా రజాకార్ల నాయకుడు ఖాశిం రజ్వీ 'ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకం ఎగరేస్తాం' అంటూ ఉన్మాదపూరిత ప్రసంగాలు చేశాడు.
ఒకవైపున కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 1946 నుంచి చారిత్రక తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతున్నది. ఈ పోరు నిజాం భూస్వామ్య వ్యవస్థ పునాదులను కుదిపి వేస్తున్న కాలమది. వేరొక వైపున కాంగ్రెస్ సోషలిస్టులు, ఆర్యసమాజ్‌వారు పలు రకాల సత్యాగ్రహాలకు పూనుకున్నారు. నిజాం ప్రభుత్వంలో పనిచేసి పదవీ విరమణ చేసిన సివిల్ ఉద్యోగులు, ముస్లిం మేధావులు, నిజాం సంస్థానాన్ని భారత్‌లో విలీనం చెయ్యాలని, రజాకార్ మూకలను కట్టడిచేయాలని బహిరంగ ప్రకటన చేశారు. కేవలం 12 శాతం ముస్లిం ప్రజానీకం ఉన్న ఆ ప్రాంతం ముస్లిం రాజ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ ప్రకటనను సంపూర్ణంగా ఇమ్రోజ్ పత్రికలో షాయబ్ ప్రచురించారు. ఒక ముస్లింగా పుట్టి, ముస్లిం అధినేత పాలననే ఎదిరించడం నాటి ముస్లిం విద్యావంతులు, మేధావులను ఎంతో ఉత్తేజపరిచింది.
ఒక చిన్న ఉర్దూ పత్రిక సంపాదకుడు, శక్తిమంతమైన నిజాం ప్రభుత్వాన్ని ఎండగట్టడాన్ని పాలకులు అవమానంగా భావించారు. 1948, ఆగస్టు 19న హైదరాబాదు 'జమురుద్ హాలు'లో రజాకార్ల నాయకుడు ఖాశిం రజ్వీ ప్రసంగిస్తూ 'ముస్లింల ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులు సజీవంగా ఉండటానికి వీలులేదు. అలాంటివారి చేతులు క్రిందికి దిగాలి లేదా నరికేయాలి' అని ప్రకటించాడు. ఈ ప్రకటనకు అనుగుణంగా పథకం రూపొందించారు.
అది 1948, ఆగస్టు 21 అర్ధరాత్రి. షోయబ్ పట్ల కాళరాత్రిగా మారింది. కాచిగూడా రైల్వేస్టేషన్ రోడ్‌లోని తన ప్రింటింగ్ ప్రెస్‌లో పనులు పూర్తిచేసుకుని షోయబుల్లా లింగంపల్లిలో సమీపాన ఉన్న తన ఇంటికి కాలినడకన వస్తుండగా రజాకార్ల గుంపు ఆయనపై ఆకస్మికంగా దాడి చేసింది. ఆయనపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించింది. హంతక ముఠా ఆయనను వెంటాడి తల్వార్లతో రెండు చేతులూ నరికేసింది. రక్తం మడుగులో పడికొట్టుకుంటున్న షోయబ్‌ను ఆ ప్రాంత ప్రజలు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో 1948, ఆగస్టు 22 తెల్లవారు జామున ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారు. అనంతరం వారి కుటుంబం ఇక్కడ రక్షణలేక ఉత్తరప్రదేశ్‌కు తరలివెళ్ళింది.
కలం యోధుని దర్శించి నివాళులర్పించేందుకు ప్రజలను నిజాం పాలకులు అనుమతించలేదు. అంతిమయాత్రలో పాల్గొనటంపై నిషేధం విధించారు. కొద్దిమంది స్నేహితులు, బంధువులనే అనుమతించారు. గట్టి పోలీసు పహారా మధ్య గోషామహల్ మాలకుంట వద్ద గల శ్మశానవాటికలో షోయబ్ మృతదేహాన్ని ఖననం చేశారు. 'షోయబుల్లా హత్య రాజకీయమైనది కాదని, వ్యక్తిగత స్పర్దల వల్లే జరిగిందని' నైజాం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి చేతులు దులుపుకుంది. ఈ హత్య అనంతరం 1948, అక్టోబర్ 17న సైనిక చర్య జరిగింది. నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైంది. కానీ షోయబ్ కోరినట్లు తెలంగాణా ప్రజల ఇక్కట్లు తీరలేదు. సైనిక పాలనలో మరొక రూపంలో సమస్యలు విజృంభించాయి.
మతోన్మాదుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా దేశ సమైక్యత, మతసామరస్యం కోసం రచనా రణరంగంలో రాజీలేని పోరాటం చేసి అమరుడైన షోయబ్ ధన్యజీవి. షోయబ్ స్ఫూర్తితో మరెందరో షోయబుల్లాలు తయారుకావాలని కాంక్షిద్దాం.
No comments:
Post a Comment