గ్రూపు-4 రాత పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో ఏపీపీఎస్సీ ఇబ్బందుల్లో పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు రాతపరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గ్రూపు-4 తుది ‘కీ’పై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. మరోపక్క అభ్యర్థుల జవాబుపత్రాల్లో పలువురి ఓఎంఆర్ షీట్లు స్కానింగ్ (మూల్యాంకన ప్రక్రియలో భాగం) కోసం అనువుగా లేవని తెలిసింది. దీంతో ఆయా అభ్యర్థుల దగ్గర ఉన్న ఓఎంఆర్ కార్బన్ షీటు పత్రాలను పంపించాలని లిఖితపూర్వకంగా కోరినట్లు తెలిసింది. దాదాపు 15 మంది నుంచి ఓఎంఆర్ షీట్లను కోరినట్టు సమాచారం. వీరిలో కొంతమంది నుంచి మాత్రమే స్పందన వచ్చినట్టు తెలిసింది. ఓఎంఆర్ షీట్లను పరీక్షా కేంద్రాల నుంచి బండిళ్ల రూపంలో పంపించే సమయంలో అవి నలిగినట్లు చెబుతున్నారు. ఫలితాల వెల్లడి కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తుండగా తాజా సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఓఎంఆర్ షీట్లను పంపించాలని కోరడం వెనుక ఏమైనా మతలబు ఉందా అన్న దానిపై పలువురు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా… అందుకు అవకాశమే లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
No comments:
Post a Comment