Friday, February 8, 2013

ఏపీపీఎస్సీ నియామకాలు చెల్లవా!

'అదనపు అర్హతల' కారణంగా ఇంటర్‌ బోర్డులో ఆగిన భర్తీ ప్రక్రియ

అంతా పద్ధతిగానే చేశామంటున్న ఏపీపీఎస్సీ

త్రిశంకు స్వర్గంలో 'ఎంపికైన' అభ్యర్థులు.

పెళ్లికొడుకు బాగున్నాడు కాని.. ఆరో వేలే నచ్చలేదు' అన్నట్లుంది ఇంటర్‌బోర్డు వ్యవహారం. ఈ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాల నియామక సంస్థ (ఏపీపీఎస్సీ) చేపట్టిన ఉద్యోగ నియామకాలు చెల్లుతాయా? చెల్లవా? అనే దానిపై మాధ్యమిక విద్యా శాఖ తేల్చుకోలేకపోతోంది. ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న అర్హతలు కంటే.. ఎక్కువగా ఉన్న వారిని ఏపీపీఎస్సీ ఎంపిక చేసినందున వారిని ఉద్యోగాల్లోనికి తీసుకోవాలో లేదో తెలియక అధికారులు హైరానా పడుతున్నారు. ఏపీపీఎస్సీ మాత్రం.. తాము అన్నీ నిబంధనల ప్రకారమే కానిచ్చామంటూ చేతులు దులుపేసుకుంటోంది. ఈ గందరగోళం మధ్య ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రకటన జారీకి ముందే తీసుకోవల్సిన జాగ్రత్తల్లో ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లోపించినందున నియామకాల ప్రకటన చెల్లుబాటుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాధ్యమిక విద్యా శాఖ పరిధిలోని ఇంటర్‌ బోర్డులో 84 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ 2011 డిసెంబరులో ప్రకటన జారీచేసింది. డిగ్రీలో కంప్యూటర్స్‌ సబ్జెక్టు ఆప్షనల్‌గా ఉండాలని పేర్కొంది. లేదంటే.. డిగ్రీ అర్హతతో అదనంగా సాంకేతిక విద్య శిక్షణ సంస్థ ద్వారా ఆఫీస్‌ ఆటోమేషిన్‌లో, పీసీ మెయింటెనెన్స్‌ అండ్‌ ట్రబుల్‌ షూటింగ్‌లో, వెబ్‌డిజైనింగ్‌లో కానీ ఏదో ఒక సర్టిఫికేట్‌ కోర్సును పూర్తిచేయాలని పేర్కొంది. ఆ ప్రకారం కిందటేడు జులై 8న రాత పరీక్ష జరిపి సెప్టెంబరు 27న ఫలితాలను వెల్లడించింది. గత డిసెంబరు 8న ఎంపికచేసిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఇంటర్‌ బోర్డుకు పంపించింది.

ఇక్కడే సమస్య మొదలైంది.అర్హతలు ఎక్కువగా ఉన్నాయని..!మొత్తం 84 మందిలో 54 మందికి ఇంటర్‌ బోర్డు పేర్కొన్న అర్హతలు ఖచ్చితంగా ఉన్నాయి. మిగతావారికి మాత్రం అర్హతలు కాస్తంత ఎక్కువ (ఎంసీఏ, ఇతర)గా ఉన్నాయి. అందుకే వీరికి ఉద్యోగాలు ఇవ్వాలా.. వద్దా అన్న దానిపై ఇంటర్‌ బోర్డుకు ధర్మసందేహం వచ్చింది. దీనిని ఏపీపీఎస్సీ వర్గాలు కొట్టిపారేశాయి. సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులను అనుసరించి ఎక్కువ అర్హతలు ఉన్నా ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేశామని తెలిపింది. అయితే.. దీనిని ఇంటర్‌ బోర్డు పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ నిర్ణయం ఏదైనా.. ఇంటర్‌ బోర్డు జనరల్‌ కౌన్సెల్‌లో ఆమోదించాలని, ఇతర శాఖల మాదిరిగా ఇక్కడ బోర్డు లేదని వాదిస్తోంది. న్యాయనిపుణులను సంప్రదిస్తే.. ప్రకటనలో ఉన్న ప్రకారమే సాగించాలన్నారని చెబుతోంది. చివరికి ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అక్కడి నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడితే అలా చేస్తామని పేర్కొంటోంది.అభ్యర్థుల ఆవేదనకొద్దిమంది నియామకాలపై వివరణ కోసం మిగతా అన్ని నియామకాలు ఎందుకు ఆపుతారని అభ్యర్థులు వాపోతున్నారు. సాధారణ పరిపాలన శాఖ జి.ఒ.ను ఇంటర్‌ బోర్డులో ఆమోదించకపోవడం ఎవరి తప్పని వారు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క.. ఇంటర్‌ బోర్డులో పబ్లిక్‌ పరీక్షల హడావుడి మొదలైంది. ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్తవారు వస్తే.. అదనపు భారం తగ్గుతుందని భావిస్తున్న సహచర ఉద్యోగులకు తాజా పరిణామాలు ఇబ్బందిని కలిగిస్తున్నాయి.

No comments:

Post a Comment