Tuesday, February 19, 2013

6 నెలల్లోనే కొలువు

ఇకపై ఉద్యోగ ప్రకటన జారీ అయిందంటే.. అభ్యర్థులు ఆరునెలల్లోగా కొత్త కొలువులో చేరిపోవలసిందే.. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సరికొత్త యోచన ఇది. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు చిత్తరంజన్‌ బిశ్వాల్‌ వెల్లడించారు. ఏపీపీఎస్సీలో సభ్యుల ఎంపిక, ఉద్యోగ నియామకాల్లో రావలసిన మార్పులపై ఈనాడు.నెట్‌, ఈనాడు ప్రతిభ.నెట్‌ ద్వారా ఉద్యోగార్థుల నుంచి వచ్చిన అభిప్రాయాల సమాహారానికి సంబంధించి ఆయన 'ఈనాడు'కు సోమవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రకటన జారీ సమయంలోనే ఫలితాల వెల్లడి తేదీని సైతం ప్రకటిస్తామని చెప్పారు. అలాగే ఏటా ఉద్యోగ ప్రకటనల జారీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగానే ప్రశ్నపత్రాల్లో, అనువాదంలో, 'కీ'ల్లో తప్పులు జరగకుండా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. బిశ్వాల్‌ ఇంటర్వ్యూలోని ప్రధాన అంశాలివి..

ఉద్యోగ ప్రకటన జారీ చేశాక ఆరునెలల్లో నియామకాలను పూర్తిచేస్తాం. ఇకపై ఉద్యోగ ప్రకటనల్లో రాత పరీక్షల తేదీతోపాటు ఫలితాల తేదీనీ వెల్లడిస్తాం. గ్రూపు-1కు మాత్రం ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, మౌఖిక పరీక్షల దృష్ట్యా ఆరునెలల కంటే మరికొంత సమయం తప్పదు.ప్రస్తుతం ప్రశ్నపత్రాల్లో అనువాదపరంగా, 'కీ'ల్లో తప్పులు ఉన్నాయని ఫిర్యాదులొస్తున్నాయి. తప్పులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇకమీదట అలా జరగకుండా చూస్తాం. దీనిపై విశ్వవిద్యాలయాలతో చర్చలు జరుపుతున్నాం. సబ్జెక్టుల వారీగా ప్రతిభగల ప్రొఫెసర్ల జాబితా సిద్ధం చేస్తున్నాం. యూపీఎస్సీ ఇలాగే చేస్తోంది. పదవీ విరమణ చేసిన 75 సంవత్సరాల నిపుణులు సైతం ప్రతిభగలవారి జాబితాలో ఉన్నారు.

రాతపరీక్షల 'కీ'లు విడుదలయ్యాక తప్పులున్నాయంటూ చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకోగలం. కానీ వారు చెప్పిందే సరైనదని చెప్పలేం. వీటిపై నిశితంగా పరిశీలించాకే నేనీ విషయాన్ని చెబుతున్నాను. ఫ్రొఫెసర్లు కూడా లక్షలమంది జీవితాలను ప్రభావితం చేసే ప్రశ్నపత్రాలను తయారు చేస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొందరైతే ప్రశ్నలను మూస పద్ధతిలో ఎంపిక చేస్తున్నారనే విషయం మా దృష్టికీ వచ్చింది. ఈ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక ప్రశ్నకు ఒక సమాధానం మాత్రమే ఉండాలన్న నియమంతో ప్రశ్నపత్రాల తయారీ జరిగితే.. తప్పులు అనే మాటే ఉండదు. ఎంసెట్‌, స్లెట్‌, ఇతర పోటీ పరీక్షల్లో ఈ సమస్య లేదు. ఇక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలపైనా అధ్యయనం చేస్తున్నాం.

గ్రూపు-2 రాతపరీక్ష 'కీ'లో తప్పులు ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. వీటిపై పరిశీలిస్తున్నాం. నాకు తెలిసినంత వరకు తప్పులు తక్కువగానే ఉన్నాయి. 'కీ'ని ఈవారంలో ఖరారు చేస్తాం.గ్రూపు-4 తుది 'కీ'లోనూ తప్పులు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. కాని అవి నిర్ధారణ కాలేదు.

 గ్రూపు-4 రాతపరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ వారంలోగా జిల్లాలకు పంపేస్తాం. కలెక్టర్ల నేతృత్వంలో ఈ నియామకాలు జరుగుతాయి.

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఎ.ఎఫ్‌.ఆర్‌.ఒ., ఇతర పోస్టులకు ఎంపికైనవారి జాబితాను ఈ నెలాఖరునాటికి వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే, మరికొంత సమయం పట్టేలా ఉంది. 'కీ 'పరంగా ఎటువంటి సమస్యలు ఉండకూడదన్న ఉద్దేశం వల్లనే ఆలస్యమవుతోంది.

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుకు సంబంధించి 22 సబ్జెక్టులు ఉన్నాయి. పోస్టు స్థాయిని అనుసరించి ఎక్కువమంది నిపుణుల ద్వారా 'కీ'లను ఖరారు చేయాల్సి ఉంది.

ఏపీపీఎస్సీలో అకడమిక్‌ సెల్‌ ఏర్పాటు ఆలోచన మంచిదే. దీనిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగాలి!

గ్రూపు-1, గ్రూపు-2 పోస్టుల విలీనంపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ నిర్ణయం ప్రభుత్వానిదే.. మాది కాదు. మేమైతే ఈ నిర్ణయాన్ని కనీసం ఏడాదిపాటు వాయిదా వేయాలని ప్రభుత్వానికి లేఖరాశాం. అక్కడినుంచి వచ్చే ఆదేశాలు అనుసరించి ముందుకెళ్తాం. అలాగే నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు, గెజిటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఉన్న వ్యత్యాసాలపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి.

గ్రూపు-1 ప్రిలిమ్స్‌ ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా ప్రధాన పరీక్షకు 1.15లోగా అభ్యర్థులను అనుమతించే విషయం ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ కూడా ఏర్పడింది. ఇంకా నిర్ణయం తీసుకున్నట్లు లేదు. గ్రూపు-1 ప్రిలిమ్స్‌ నుంచి ప్రధాన పరీక్షకు అభ్యర్థులను పరిమితం చేయడం వలన అనేక ప్రయోజనాలుంటాయి.

వయోపరిమితి పెంపు అభ్యర్థనలపైనా ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవాలి.

ఏప్రిల్‌నుంచి వరసగా ఉద్యోయ ప్రకటనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని అనేది ఇప్పుడే చెప్పలేం. సచివాలయంలో దీనిపై కసరత్తు జరుగుతోంది.

ఆన్‌లైన్‌లో రాతపరీక్షలను జరపడం మామూలు విషయం కాదు. దీనికి క్వశ్చన్‌ బ్యాంక్‌ను విస్తృతస్థాయిలో తయారుచేయాల్సి ఉంటుంది. తక్కువ పోటీ కలిగిన ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో జరపాలన్నా అంతకుముందు తీసుకోవల్సిన జాగ్రత్తలు అనేకం ఉన్నాయి. ముందుముందు అలా జరగవచ్చు.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించే సమయంలో కానీ, ఆ తరువాత కానీ అర్హతలు లేని వారిని తొలగించడం సాధ్యంకాదు. వేలల్లో, లక్షల్లో దరఖాస్తులు వస్తున్నందున వారి అర్హతలు అనుసరించి దరఖాస్తులను తొలిదశలో తిరస్కరించడం కష్టమవుతోంది. అదే రాతపరీక్ష అనంతరం ఎంపికచేసిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అర్హతలు గుర్తిస్తున్నాం. సమాన గుర్తింపు సమస్య ఉంటే విశ్వవిద్యాలయాలను సంప్రదించి తెలుసుకుంటున్నాం. ఈ కారణంగా కొంత జాప్యం జరుగుతోంది. సాధ్యమైనంత వరకు జాప్యాన్ని తగ్గించేందుకు కృషిచేస్తాం.

No comments:

Post a Comment