క్షమించండి..ఏపీపీఎస్సీలో చోటుచేసుకున్న సంఘటనలకు తాను బాధ్యుడినై ఉంటే క్షమించాలని
సభ్యుడు జి.పద్దయ్య రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం
జారీచేసే ఆదేశాలకు బద్ధుడినై ఉంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు లేఖ
పంపారు. అందులో తాజా పరిణామాలపై కలత చెందానని పేర్కొన్నారు. తాను గ్రామీణ
నేపథ్యంతో.. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని తెలిపారు. ఏపీపీఎస్సీ సభ్యుడిగా
నియమించే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందన్న సమాచారం తనకు తొలుత అప్పటి
ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు కె.సి.రెడ్డి నుంచి వచ్చిన ఫోన్ ద్వారా తెలిసిందని
వెల్లడించారు. విద్యాపరమైన పరిశోధన రంగంలో ఉన్నందున తాను రాలేనని చెప్పినప్పటికీ,
భవిష్యత్తులో మంచి అవకాశాలు రావోమోనన్న ఉద్దేశంతో చివరికి అంగీకరించానని
పేర్కొన్నారు. తాను గుంటూరు జిల్లాలో గ్రూపు-2 పరీక్షకు తొమ్మిది మంది విద్యార్థులు
ఆలస్యంగా వచ్చినప్పటికీ పరీక్ష రాసేందుకు మానవీయ కోణంలో అంగీకరించానని
వెల్లడించారు. తాజా పరిణామాల పట్ల మానసికంగా ఆందోళనకు గురయ్యానన్నారు. ఒకవేళ తాను ఏ
రకంగానైనా బాధ్యుడిని అయి ఉంటే బేషరతుగా క్షమాపణ వ్యక్తం చేస్తున్నట్లు గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తానని హామీ ఇచ్చారు. మన్నించి ఈ సంకట పరిస్థితి నుంచి
బయట పడేయాలని కోరారు. ఈ లేఖను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీపీఎస్సీ
ఛైర్మన్‌లకు కూడా పద్దయ్య పంపారు.
No comments:
Post a Comment