Sunday, January 20, 2013

గ్రూప్ - 1 లో బడుగులకు పెద్దపీట

ప్రతిష్టాత్మకమైన గ్రూప్‌-1 నియామక ప్రక్రియలో ఈ సారి నుంచి కొత్త విధానంలో పరీక్షలను నిర్వహించాలన్న ఆలోచనలో ఏపీపీఎస్‌సీ నిమగ్నమైంది. ఆ మేరకు కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నడూ లేని విధంగా గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలకు హాజరైన వారిని మెయిన్‌ పరీక్షలకు ఎంపిక చేసే ప్రక్రియలో రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేయాలని ఏపీపీఎస్‌సీ ప్రాథమిక స్థాయిలో నిర్ణయించింది.రిజర్వేషన్ల వారీగా ఒక్కొక్క పోస్టుకు 15 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీని వల్ల బడుగు, బలహీన వర్గాలకు ఎంతో మేలు కలుగుతుందని ఏపీపీఎస్‌సీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌ సి.ఆర్‌.బిశ్వాల్‌ పేర్కొన్నారు.

అంటే ఇప్పటి వరకు ఏపీపీఎస్‌సీ నిర్వహిస్తూ వస్తోన్న గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షల్లో రిజర్వేషన్లు విధానాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేసినట్లయితే రాష్ట్రంలోనే తొలి సారిగా ఈ తరహా రిజర్వేషన్ల విధానం అమల్లోకి వచ్చినట్లవుతుంది.ఇప్పటి వరకు గ్రూప్‌-1ఎంపిక నిమిత్తం మూడు దశల్లో పరీక్షలు నిర్వహిస్తు వస్తున్నారు. ఇందులో ప్రాథమిక పరీక్ష, మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా గ్రూప్‌-1 పోస్టుల ఎంపిక జరుగుతుంది. ప్రాథమిక పరీక్షలకు హాజరైన వారి నుంచి 1:50 నిష్పత్తి ప్రకారం మెయిన్‌ పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఆ దశలో ఇప్పటి వరకు ఎన్నడూ రిజర్వేషన్లు విధానం అమలు చేయలేదు. మొత్తం గ్రూప్‌-1 పోస్టులను 1:50 నిష్పత్తి ప్రకారం లెక్కించి మెయిన్‌ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీని వల్ల ఓపెన్‌ కేటగిరి అభ్యర్థులే అధిక సంఖ్యలో మెయిన్‌ పరీక్షలకు ఎంపికవుతున్నారు. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్‌ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.

మెయిన్‌ పరీక్షలకు హాజరు కావడానికి వీరికి అవకాశం దక్కడం లేదు. దీంతో వీరంతా గ్రూప్‌ -1 ఉద్యోగాలపై ఆశలు చాలించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో ప్రకటించిన పోస్టులను రిజర్వేషన్ల వారీగా ముందే కేటాయిస్తారు. ఆ ప్రకారం నోటిఫికేషన్‌లో ప్రకటిస్తారు. దాని ప్రకారం ఒక్కొక్క పోస్టుకు 15 మంది అభ్యర్థులను మెయిన్‌ పరీక్షలకు ఎంపిక చేస్తారు. అంటే ఓపెన్‌లో 10 పోస్టులు ఉంటే 150 మందిని ఓపెన్‌ అభ్యర్థులను మెయిన్‌ పరీక్షలకు ఎంపిక చేస్తారు. అలాగే ఎస్‌సీ వారికి 5 పోస్టులు ఉన్నట్లయితే మెయిన్‌ పరీక్షలకు 75 మందినే ఎస్‌సీ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇతరులకు అవకాశం ఇవ్వరు. ఎస్టీ ఉమెన్‌ పోస్టులు 8 ఉన్నట్లయితే ఆ పోస్టులు కూడా వారికే కేటాయిస్తారు. అంటే 120 మందిని ఎస్టీ ఉమెన్‌ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఒక వేళ ఆయా సామాజిక వర్గానికి కేటాయించిన పోస్టులకు అభ్యర్థులు దొరకనట్లయితే.. ఆ పోస్టులను తర్వాత నోటిఫికేషన్‌లో ప్రకటించే అవకాశం ఉంటుందని ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌ సి.ఆర్‌.బిశ్వాల్‌ పేర్కొన్నారు. అయితే ఈ విధానం ప్రస్తుతం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి)లో అమలు పరుస్తున్నారని, దీని వల్ల ఎవరికీ అన్యాయం జరిగే అవకాశం ఉండదని ఛైర్మన్‌ అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment