“తెలుగునాట ఆడవాళ్ళు స్వీయచరిత్ర వ్రాసుకోవడము ఎక్కడైనా ఉండవచ్చును కానీ, అంతగా లేదు. ఆ భాగ్యము నాకు లభించినందుకు గర్వపడుచున్నాను.స్త్రీలకు సమర్థత లేక కాదుకానీ వారు బయట సంచరిటము తక్కువ” అంటూ తన స్వీయచరిత్రను కనకమ్మగారు 1959 జనవరి15న మొదలుబెట్టి 1960 సెప్టెంబరు 20న ముగించినా, ఏ కారణాలచేతో కాని, 2011 వరకూ అముద్రితంగానే ఉండిపోయింది. నెల్లూరులో విశ్రాంతజీవనం గడుపుతున్న డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారు పనిగట్టుకొని ఈ వ్రాతప్రతిని సంపాదించి, సంస్కరించి, కనకమ్మగారి గురించి ఇతర విషయాలను సేకరించి శ్రద్ధగా ప్రచురించారు.
కనకమ్మగారు 1892 జూన్ 10వతేదీన నెల్లూరుజిల్లా మినగల్లులో పుట్టారు. మడమనూరులో, పోట్లపూడిలో పెరిగారు. తండ్రి మరుపూరు కొండారెడ్డి, అమ్మ కామమ్మ. తాతలు కోడెల వ్యాపారులు. పడమటి బేరగాండ్రు ఇల్లంతా కంబళ్ళు పరచి వాటి మీద వెండిరూపాయలు కుప్పలు కుప్పలుగా పోసుకొని లెక్కపెట్టుకునేవారట. మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డిగారితో ఆమెకు తొమ్మిదవ ఏట వివాహమయ్యింది. పోట్లపూడిలోనే కాపురం. జిల్లాలోని పెద్ద కుటుంబాలలో ఒకటి. 800 ఎకరాల పొలం; 500 ఆవులుండేవట. కోడెదూడల మీద సంవత్సరానికి పదివేలరూపాయల ఆదాయం, 20,30 వేల రూపాయల ధాన్యం రాబడి. వారి అవ్వ మరణించినప్పుడు పదిపుట్ల అన్నప్రదానము చేశారట; వచ్చినవారికి “త్రాగటానికి నీరుపోసే అవకాశము లేక వీధులలో కాలువలు త్రవ్వి నీరు పారించినారు”. అన్నప్రదానము చేయుటలో సుబ్బరామిరెడ్డిగారికి పెట్టింది పేరు.
కనకమ్మ గారు చిన్నతనంలో చదువుకోలేదు. తర్వాత స్వయంకృషి వల్ల చదువుకున్నారు. క్రమంగా కావ్యాలు, సంస్కృతము, హిందీ నేర్చుకున్నారు. శశిరేఖ, హిందూసుందరి, అనసూయ పత్రికలకు పద్యాలు, వ్యాసాలు పంపేవారు, చెట్టునీడ ముచ్చట్లు పేర ఆమె హిందూసుందరిలో వ్రాసిన వ్యాసాలకు మంచి గుర్తింపు వచ్చింది.
పోట్లపూడిలో కనకమ్మగారు సోదరులు, మరదులు, నెల్లూరు రామానాయుడు (తర్వాత జమీన్‌రైతు పత్రిక సంపాదకుడిగా ప్రసిద్ధుడు), మరికొందరితో కలసి 1913లో సుజనరంజనీ సమాజం స్థాపించి గ్రంథాలయము, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. రాయప్రోలు సుబ్బారావు, దువ్వూరి రామిరెడ్డి వంటివారు సమాజ కార్యక్రమాలకు వచ్చేవారు. నెమ్మదిగా సమాజంలోకి రాజకీయ భావాలు వచ్చాయి. మద్రాసునుంచి రివాల్వరులు తెప్పించి వాటిని పేల్చడం ప్రాక్టీసు కూడా చేశారు. వెన్నెలకంటి రాఘవయ్యగారు పూనాలో తిలక్‌నీ, మద్రాసులో చిదంబరం పిళ్ళేని కలసివచ్చారు. స్వదేశీ వస్త్రాలు ధరించటం, హరిజనవాడల్లో సేవాకార్యక్రమాలు చేయడం మొదలుబెట్టారు. 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్రమహాసభలో ఆంధ్రరాష్ట్ర తీర్మానం చేశారు. నెమ్మదిగా ఆ ప్రాంతంలో జాతీయోద్యమంలో కనకమ్మగారి పాత్ర పెరగటం మొదలయ్యింది. పెద్దపెద్ద నాయకులందరూ వారి ఇంటనే బస చేసేవారు. గాంధీజీ, బిపిన్‌చంద్రపాల్, రాజేంద్రప్రసాద్, ప్రకాశం పంతులు, కాశీనాధుని నాగేశ్వరరావు వంటి జాతీయ, రాష్ట్రీయ నాయకులు వారి ఆతిథ్యం స్వీకరించిన వారే. గోగినేని రంగా, బెజవాడ గోపాలరెడ్డి, దుర్గాబాయి దేశముఖ్ వంటివారు సన్నిహితంగా ఉండేవారు.
ఈ కార్యక్రమాలలో నెమ్మదిగా ఆస్తులు తరగటం ప్రారంభమయింది. వెంకటగిరి రాజాతో ఇబ్బందులు మొదలయ్యాయి. వారి కుటుంబం జమీందారుకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. ఆ పోరాటంలో భాగంగానే జమీన్‌రైతు పత్రిక ఆవిర్భవించింది. ఇతరులు కూడా మోసం చేశారు. నివాసం పోట్లపూడినుంచి, పిడూరుకూ, అక్కడి ఆస్థీ పోయాక నెల్లూరుకూ మారింది. మోసం చేసినవారిగురించి, తర్వాత రోజుల్లో ఇబ్బందులు పెట్టిన వారి గురించి అవసరమైనదానికన్నా తక్కువ పరుషంగా మాట్లాడారు ఈ ఆత్మకథలోలో. ఆత్మస్థుతీ, పరనిందా రెండూ తక్కువే. పిడూరులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లంతా కాలిపోయి భారీనష్టం జరిగింది. పుస్తకాల బీరువా (కొన్ని అముద్రిత పుస్తకాలతో సహా) కాలిపోయింది. ఇల్లు పోయినదానికన్నా పుస్తకాల బీరువా పోయినందుకు ఎక్కువ బాధపడ్డాను అని అన్నారు కనకమ్మ గారు.
కనకమ్మగారు నెల్లూరు స్త్రీల కాంగ్రెస్ సంస్థను స్థాపించి స్వాతంత్ర్యపోరాటంలో అనేక ఉద్యమాలు నిర్వహించారు. రెండుసార్లు జైలుకు కూడా వెళ్ళారు. గాంధీజీ వచ్చినప్పుడు ఆమె, ఆమె కుమార్తె వెంకటసుబ్బమ్మ తమ వంటిపై నగలన్నీ కాంగ్రెస్ నిధికి ఇచ్చారు. 1934లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌కు ఉపాధ్యక్షులుగా ఎన్నికయిన మొదటి మహిళ కనకమ్మ గారు.
కనకమ్మగారి కుమార్తె చిన్న వయస్సులో మరణించారు. రమణ మహర్షి, ఆయన శిష్యుడు రామయోగుల దగ్గర కనకమ్మగారు దుఃఖోపశమనమనం పొందారు. వారి ఆశ్రమాలలో చాలాకాలం ఉన్నారు. ఆధ్యాత్మిక పుస్తకాలు రచించారు.
ఆడపిల్లలకోసం ప్రత్యేకంగా కస్తూరి విద్యాలయం స్థాపించారు. గాంధీజీ ఈ స్కూలు భవనానికి శంకుస్థాపన చేశారు. కుల మత వివక్ష లేకుండా ఆడపిల్లలకు హాస్టల్ వసతి కల్పించి చదువు చెప్పించేవారు. ప్రభుత్వగ్రాంటులులేకుండా, జాతీయోద్యమంలో భాగంగా, ఆదర్శపాఠశాలగా నడిపారు. ఆమె జైలుకు వెళ్ళినప్పుడు పాఠశాల మూత పడిపోయింది. మళ్ళీ 1944లో పాఠశాలను తిరిగి ప్రారంభించారు. తర్వాత బాలికలకోసం ఒక పారిశ్రామిక పాఠశాలను కూడా మొదలుబెట్టారు. వీటి నిర్వహణకోసం నిధులను ఆమే నాటక ప్రదర్శనలు నిర్వహించి, ఇతరత్రా కష్టపడి సంపాదించేవారు. కస్తూరి విద్యాలయ నిర్వహణనుంచి ఆమెను తప్పించటం ఆమె చరమాంకంలో విషాదఘట్టం. ఆరోగ్యం క్షీణించి, ఇబ్బందులు పడుతూనే స్వీయచరిత్రను ముగించి, 1963 సెప్టెంబరు 15న మరణించారు.
ఈ పుస్తకం చదువుతుంటే ఆరోజుల్లో ఆంధ్రదేశంలో హేమాహేమీలు అనదగ్గ వారందరితోనూ కనకమ్మగారికి సన్నిహిత పరిచయాలున్నట్టు తెలుస్తుంది. కాశీనాథుని, రాయప్రోలు, దువ్వూరి రామిరెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య, సి.ఆర్.రెడ్డి, మోటూరి సత్యనారాయణ, రంగా, నార్ల వంటివారితో మొదలుబెట్టి, సినిమానటులవరకూ అందరూ ఆమెకు పరిచయమే.
ఆవిడ చాలా కథలు, వ్యాసాలు, పద్యాలు వ్రాశారట (కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి). ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మతో కలసి జంట కవిత్వం చెప్పేవారట. కనకమ్మగారిని 1955లో గృహలక్ష్మి స్వర్ణకంకణంతో సత్కరించారు. అంతకు ముందే 1939లో గృహలక్ష్మి స్వర్ణకంకణ ప్రదానోత్సవ సభలో ఆమె చేసిన అధ్యక్షోపన్యాసం చదువుతున్నప్పుడు, ఆమె విషయ పరిజ్ఞానానికి, ఆధునిక ఆలోచనావిధానానికి ఆశ్చర్యం వేస్తూంది.
నెల్లూరు రాజకీయ సాంఘిక చరిత్రతో ఇంతగా ముడివడ్డ పొణకా కనకమ్మగార్ని నెల్లూరు పట్టణం ఎందుకో మరచిపోయింది. పొణకా కనకమ్మ బాలికల పాఠశాల మాత్రమే నెల్లూరులో ఆవిడ జ్ఞాపకం. ముప్పై ఏళ్ళ క్రితం తయారుచేసిన ఆమె కాంస్యవిగ్రహం ఇప్పటికీ ప్రతిష్టించకుండా ఏదో స్కూల్లో మూల గదిలో ఉందట.