Monday, July 1, 2013

ప్రభుత్వ పరిశీలనలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు

- తరువాత ఖాళీలకు ఇంకా ఆమోద ముద్ర రాలేదు
- వాటిని కూడా భర్తీ చేయాలని నిరుద్యోగుల అభ్యర్థన
- ఇతర పోస్టులతో నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సన్నాహాలు!

సర్కారీ కొలువులపై కోటి ఆశలతో 15 లక్షల మందికిపైగా నిరుద్యోగులు గ్రూప్-1, గ్రూప్-2 లాంటి ప్రధాన పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారిలో ప్రధానంగా సగం మంది నిరీక్షణ వీటి కోసమే! ఎక్కువ పోస్టులతో కొత్త నోటిఫికేషన్లు వస్తాయని భావిస్తున్న వీరంతా ప్రభుత్వం ఇంతవరకు ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు ఇంతవరకూ అనుమతి ఇవ్వడంతో ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకూ ఏర్పడిన అన్ని ఖాళీలను గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లలో చేర్చాలని కోరుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 2010 తరువాత ఖాళీలు ఏర్పడిన 600కిపైగా పోస్టుల భర్తీ ఆర్థికశాఖ, ప్రభుత్వం పరిశీలనలో ఉంది. మరోవైపు ఏపీపీఎస్సీ తనకు అందిన వివరాలతో ఈ నెలలోనే ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసి అనంతరం నోటిఫికేషన్లను కూడా జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని ఖాళీలకూ నోటిఫికేషన్లు రావేమోననే ఆందోళన అభ్యర్థులను పీడిస్తోంది. ఆలస్యమైనా.. అన్నీ ఇవ్వండి కాస్త ఆలస్యమైనా సరే, 2010 తరువాత ఏర్పడిన ఖాళీలను కూడా కలిపి అన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నికల నేపథ్యంలో హడావుడి గా నోటిఫికేషన్లు ఇవ్వడం కాకుండా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వేల రూపాయలు ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకుంటున్నామని, అప్పులు చేసి నాలుగైదేళ్లుగా హాస్టళ్లలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నామని పేర్కొంటున్నారు. వయోపరిమితి పెంపుతో ఊరట కొంతే.. ఆర్థికశాఖ 33 వేల పోస్టుల భర్తీకి ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2 లాంటి పోస్టులు తక్కువగానే ఉన్నాయి. గ్రూప్-2 కేటగిరీలో ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 314 వరకు ఉన్నాయి. వీటికి గరిష్ట వయోపరిమితి జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లే. దీంతో మెజారిటీ అభ్యర్థులకు ఈ పోస్టులకు అర్హత ఉండదు. గరిష్ట వయోపరిమితి 5 ఏళ్లకు పెంచాలని ఐదు లక్షల మంది నిరుద్యోగులు వేడుకుంటే ప్రభుత్వం రెండేళ్లు మాత్రమే పెంచింది. అదికూడా 2011 తరువాత నోటిఫికేషన్లు ఇవ్వలేదు కాబట్టి గరిష్ట వయోపరిమితి రెండేళ్లు పెంచి ఆ లోటును మాత్రమే పూడ్చింది. వయోపరిమితిపరంగా నిరుద్యోగులకు అదనంగా ఒనగూరిన ప్రయోజనం పెద్దగా లేదని అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-1, గ్రూప్-2లో అనుమతి లభించాల్సిన పోస్టులు.. గ్రూప్-1, గ్రూప్-2 కేటగిరీల్లోనే 600లకు పైగా పోస్టులకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి లభించలేదని, ఇతర కేటగిరీల్లోనూ చాలా పోస్టులకు అనుమతి రాలేదని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. గ్రూప్-2 కేటగిరీలోని ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో 24 సబ్ రిజిస్ట్రార్, 183 డిప్యూటీ తహసీల్దార్, 99 అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, 10 మున్సిపల్ గ్రేడ్-3 కమిషనర్, 184 కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ పోస్టులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. గ్రూప్-1 కేటగిరీలో 33 కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, 8 గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులతో మరికొన్ని కేటగిరీలకు చెందిన పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఖాళీ పోస్టులు అన్నిటికీ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments:

Post a Comment