Wednesday, July 3, 2013

పాస్‌ చేస్తే రూ.10 లక్షలు

'పకడ్బందీ ప్రణాళికతోనే ఉద్యోగార్థులకు వల వేశాం. సంధ్యారాణి, ఇద్దరు మధ్యవర్తులు, మరో ఇద్దరు కలిసి ఇదంతా చేశాం. వీరంతా సంధ్యారాణి ద్వారానే నాకు పరిచయం అయ్యారు. మౌఖిక పరీక్షలో మార్కులు ఎక్కువ వేస్తే రూ.పదిలక్షల చొప్పున ఇస్తారంటూ సంధ్యారాణి చెప్పింది. దీంతో అందరం కలిసి పథకాన్ని అమలు చేశాం'' అని ఏపీపీఎస్సీ బోర్డు సభ్యుడు గూడూరి సూర్యవంశం సీతారామరాజు పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. ఏపీపీఎస్సీ ఉద్యోగ కుంభకోణం కేసులో అరెస్త్టెన సీతారామరాజు పోలీసుల విచారణలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. సంధ్యారాణి పరిచయం నుంచి ఉద్యోగార్థుల నుంచి డబ్బు తీసుకోవడం వరకూ జరిగిన పరిణామాలన్నింటినీ పోలీసులకు చెప్పారు. తనకు ఎలాంటి హాని ఉండదన్న భావనతోనే ఈ పనికి అంగీకరించానన్నారు. సీతారామరాజు చెప్పిన అంశాల ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగించనున్నామని హైదరాబాద్‌ సిటీ డీసీపీ(నేరాలు) ఎల్‌కేవీ రంగారావు మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ కేసులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అర్హులైన వారి వద్ద రూ.పదిలక్షల చొప్పున డిమాండ్‌ చేసిన ఈ కుంభకోణంలో... ఢిల్లీలోని అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఎం.అరుణ్‌కుమార్‌, హైదరాబాద్‌లోని కె.ఎస్‌.రావు ఐ.ఎ.ఎస్‌. స్టడీ సర్కిల్‌ సంచాలకులు డాక్టర్‌ కొలకపూడి శ్రీనివాసరావులు పాత్రధారులుగా ఉన్నారు. వీరిద్దరూ సంధ్యారాణి ద్వారా సీతారామరాజుకు పరిచయం అయ్యారు. వృత్తిరీత్యా న్యాయవాదైన సీతారామరాజుకు సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే పరంధాములు కుమారుడు ఎ.రవిబాబు ఏడాదిన్నర క్రితం సంధ్యారాణిని పరిచయం చేశారు. అప్పటి నుంచి సంధ్యారాణి, సీతారామరాజులు అప్పుడప్పుడూ కలుసుకునేవారు. ఫోన్‌లోనూ మాట్లాడుకునేవారు. గత ఏడాది సెప్టెంబరులో సీతారామరాజు ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమితులయ్యారు. అప్పటి నుంచి తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలో సీతారామరాజు రెండు నెలల క్రితం సంధ్య ఇంటికి వెళ్లారు. మే 20 నుంచి పాలిటెక్నిక్‌ కళాశాలల్లో జూనియర్‌ లెక్చరర్ల ముఖాముఖి ఉందని ఆమెకు చెప్పారు. కొద్దిరోజులయ్యాక సంధ్య తన బాల్యమిత్రుడు ఢిల్లీలోని అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ అరుణ్‌కుమార్‌తో ఏపీపీఎస్సీ కార్యాలయానికి వచ్చారు. వారి పథకాన్ని వివరించారు.

సంధ్యారాణి, అరుణ్‌కుమార్‌లు తమకు తెలిసిన అభ్యర్థులున్నారని, మన చేతికి మట్టి అంటకుండా మధ్యవర్తులే చూసుకుంటారని సీతారామరాజుకు వివరించారు. అశోక్‌నగర్‌లోని కె.ఎస్‌.రావు ఐ.ఎ.ఎస్‌.అకాడమీ సంచాలకులు డాక్టర్‌ కె.ఎస్‌.రావు కూడా కొందరు అభ్యర్థుల నుంచి డబ్బు ఇప్పిస్తానని చెప్పారు. 2013 మే 12న మియాపూర్‌లోని సంధ్య ఇంట్లో కె.ఎస్‌.రావును సీతారామరాజు కలుసుకున్నారు. అభ్యర్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను కె.ఎస్‌.రావు ఇస్తారని సంధ్య వివరించింది. హిమాయత్‌నగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగులు షేక్‌ అంజావలి, కళ్యాణ్‌నగర్‌లోని పి.సతీష్‌కుమార్‌లు డబ్బు వ్యవహారంలో మధ్యవర్తులని సీతారామరాజుకు చెప్పారు. జూన్‌ 3, 2013న మాదాపూర్‌లోని ఫార్చ్యూన్‌ టవర్స్‌లో ఉంటున్న ఫణికిరణ్‌ ఇంటికి రావాలంటూ సంధ్య సీతారామరాజుకు చెప్పింది. దీంతో ఆయన అక్కడికి వెళ్లారు. అక్కడ విశాఖపట్నంలోని మహారాజ సహకార పట్టణ బ్యాంక్‌ అధ్యక్షుడు ఎం.ఆర్‌.కె.రాజు ఉన్నారు. ఆయనను సీతారామరాజుకు సంధ్య పరిచయం చేశారు. కొద్దిసేపయ్యాక సంధ్య బయటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చింది. వీరిద్దరూ చెరో పదిలక్షల రూపాయలిస్తారంటూ వివరించింది. వీరిని మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ)లో పాస్‌చేయాలంటూ కోరింది. ఒప్పందం కుదిరాక వారు వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై ఆరోపణలు రావటంతో ఏపీపీఎస్సీ కార్యదర్శి చారుసిన్హా సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత నెల సంధ్యను అరెస్ట్‌చేయగా సోమవారం రాత్రి సీతారామరాజును అరెస్ట్‌ చేశారు.అరెస్టయిన ఏపీపీఎస్‌సీ సభ్యుడు సీతారామరాజును మంగళవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు తరలించారు. సీసీఎస్‌ పోలీసులు ఆయన్ను సోమవారం అర్ధరాత్రే న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

1 comment:

  1. How to get to the Jackpot King Casino in New Jersey - JTM Hub
    Directions to the 안성 출장샵 Jackpot King 포천 출장안마 Casino 양주 출장마사지 (Tahoe), 1 Borgata Way, Atlantic City, based on live traffic updates and road conditions 진주 출장샵 – from 의정부 출장샵

    ReplyDelete