Friday, June 28, 2013

జూలైలో ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్

- రోస్టర్ పాయింట్లు, ఇండెంట్లు త్వరగా ఇవ్వాలని శాఖలకు కమిషన్ సూచన
- గరిష్ట వయోపరిమితి పెంపు, ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనం రద్దుపై రావాల్సిన స్పష్టత

వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 15,000 పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) త్వరలో పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించి నోటిఫికేషన్లు జారీ చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కమిషన్ ఇప్పటికే దృష్టి సారించినట్లు సమాచారం. ఈ ఏడాది వివిధ పోస్టుల భర్తీకి సంబంధించిన వార్షిక కేలండర్ అమలులో భాగంగా షెడ్యూల్ విడుదల కానుంది. జూలై నెలలో(మరో 15 రోజుల్లోగా) పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

కేటగిరీలవారీగా నోటిఫికేషన్ల జారీ తేదీలు, పరీక్షల నిర్వహణ తేదీలు, ఫలితాల వెల్లడి సహా పోస్టింగ్‌ల వరకు సమగ్ర వివరాలను అందులో పొందుపరచనుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం సిద్ధం అయ్యేందుకు ఇది ఉపకరిస్తుందని ఏపీపీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి.శాఖల వారీగా, పోస్టుల కేటగిరీల వారీగా సమగ్ర వివరాలు తెప్పించి షెడ్యూల్ జారీ చేసేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు వీలైతే వచ్చే నెల చివరి వారంలో నోటిఫికేషన్ల జారీని ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తోంది. వివిధ శాఖల్లోని ఒకే కేటగిరీ పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని కూడా భావిస్తోంది.

రోస్టర్ పాయింట్లు, ఇండెంట్ల సేకరణకు చర్యలు

వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 33 వేలకు పైగా పోస్టులను ఈ ఏడాది భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఇటీవల ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీ ద్వారానే 11 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. మరోవైపు గతంలోనూ వివిధ శాఖలనుంచి క్లియరెన్స్ వచ్చిన పలు కేటగిరీలకు చెందిన దాదాపు 3 వేలకుపైగా ఖాళీల వివరాలు ఏపీపీఎస్సీ వద్ద ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం వాటికి సంబంధించి ఆయా శాఖల నుంచి భర్తీకి ఇండెంట్స్, పోస్టుల కేటగిరీ వారీగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల వివవరాలను తెప్పించే పనిలో ఏపీపీఎస్సీ నిమగ్నమైంది. ఆర్థిక శాఖ 11 వేల పోస్టుల భర్తీకి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత నుంచి ఏపీపీఎస్సీ ఈ చర్యలు చేపట్టినా అన్ని శాఖల నుంచి పోస్టుల వివరాలు ఇంకా అందలేదు. ఆయా పోస్టులకు సంబంధించిన రోస్టర్ పాయింట్లు వస్తేగానీ నోటిఫికేషన్లు జారీ చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో రోస్టర్ పాయింట్ల వివరాలు, ఇండెంట్లను త్వరగా పంపించాలని ఏపీపీఎసీ ఆయా శాఖలను కోరుతోంది.

మరో 15 రోజుల లోగా ఎక్కువ శాతం పోస్టులకు సంబంధించిన వివరాలు అందే అవకాశం ఉంది. వీటి ఆధారంగా తొలుత పోస్టుల భర్తీకి షెడ్యూల్ (ఏయే తేదీల్లో ఏయే కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయాలి, పరీక్షలు తేదీలు, ఫలితాల వెల్లడి వివరాలు) జారీ చేయాలని భావిస్తోంది. ఈలోగా ప్రధానమైన గ్రూపు-1లో గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనం, వయోపరిమితి లాంటి అంశాలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పష్టత తీసుకోవాలని ఏపీపీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి.

No comments:

Post a Comment