Showing posts with label Historical Places. Show all posts
Showing posts with label Historical Places. Show all posts

Sunday, December 16, 2012

రమణీయం రామప్ప


రామప్ప దేవాలయానికి నిర్మాణ సహకారాన్ని అందించింది రేచర్ల రుద్రుడు. అతడు శివలింగాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని తన పేర ‘రుద్రేశ్వరుడ’ని పిలుచుకొన్నాడు. ఇప్పుడు దాన్ని ‘రామలింగేశ్వరుడ’ని పిలుస్తున్నారు.


ఈ దేవాలయానికి రామప్ప దేవాలయమని పేరెలా వచ్చిందో ఖచ్చితమైన ఆధారాలు లేవు. కొందరు గుడి కట్టిన శిల్పి పేరు రామప్ప అనీ, అందుకే ఆ దేవాలయాన్ని రామప్ప దేవాలయమని పిలుస్తున్నారని గ్రామస్తులంటారు. ఏమైనా, గణపతిదేవుని సైన్యాధ్యక్షుడిపైన రేచర్ల రుద్రిడ్డి (రువూదుడు) పాలంపేటలో క్రీ.శ.1213లో నిర్మించిన రామప్ప దేవాలయం కాకతీయ దేవాలయాలన్నింటిలోకీ మణిపూసగా చెప్పుకోవాలి.

దేవాలయ అమరిక

రామప్ప దేవాలయం గర్భాలయం, అర్ధమండపం, రంగమండపం, నంది మండపంతో కుడివైపున కామేశ్వరాలయం, కళ్యాణమండపం, ఎడమ వైపున కాటేశ్వరాలయాలతో చుట్టూ ప్రాకారంతో నిర్మాణమైంది.

ఉపపీఠం

పీఠమంటే అధిష్ఠానం. దేవాలయం మొత్తం దేనిమీద నిలబడి వుంటుందో దాన్ని ‘అధిష్ఠానం’ అంటారు. అంటే దేవాలయానికి ‘పాదం’ లాంటిది. ఈ అధిష్ఠానం కింద ఉండే వరుసల్ని ‘ఉపపీఠం’ అంటారు. రామప్ప దేవాలయ ఉపపీఠం చూడటానికి ఎత్తుగా, చుట్టూ ప్రదక్షిణ చేయటానికి విశాలంగా ఉంది. ఆధారశిల, ఉపానం, పద్మం, పట్టిక, కుముదం, పట్టిక, అధోపద్మం అనే ఉపపీఠం వరుసలపై ఎలాంటి అలంకార శిల్పమూ లేక సాదాగా వున్నాయి.

అధిష్ఠానం

అధిష్ఠానానికి ఉపానం, కుముదము, కపోతము దానిపైన ఏనుగుల వరుస (గజధార)లున్నాయి. కపోతం వరుసపై మట్టానికి సమంగా గర్భాలయ, అర్ధమండప, రంగమండపాల నేల రాళ్ళు పరచబడినాయి. ఏనుగుల వరుస గల రాయిపై ఏనుగులు మనిషిపై దాడి చేస్తున్నట్లు, గణపతి, భైరవ, గజలక్ష్మి, మల్లయుద్ధం, సూర్యుడు, మకరం (మొసలి), వ్యాళాలుఉన్నాయి.

కక్షాసనాలు

దేవాలయ రంగమండప అధిష్ఠానంపై గల ఏనుగుల వరుసలున్న రాయిపైన నిలువుగా ఒక పిట్టగోడ లాంటి రాయి వుంది. దీన్ని ‘కక్షాసనం’ (ఆనుకుని కూర్చోటానికి) అంటారు. మండపం లోపల ఒక మూడు వరుసల వేదిక, దానిపై భక్తులు కూర్చోవటానికి అరుగుగా ఉపెూగపడుతుంది. తూర్పువైపు ప్రవేశద్వారం నుంచి రంగమండపం అరుగుపైన 20 కక్షాసన ఫలకాలున్నాయి. వాటిపై జైనతీర్ధంకరులు, డాలు కత్తి పట్టిన యోధులు, నాట్యగణపతి, చామరధారి, విల్లు, బాణం పట్టుకొన్న వేటగత్తె, భటులు, భైరవుడు, గణిక, వేణుగోపాల, మల్లయుద్ధ దృశ్యాలు, సాలభంజిక (కొమ్మను పట్టుకొని వయ్యారంగా నిలబడిన స్త్రీ) నాట్యగత్తెలు, అటూ ఇటూ మద్దెలను వాయిస్తున్న వాద్యగాండ్లు, నాగిని, సూర్య, శృంగార మైథున శిల్పాలు, నగ్నంగా వున్న ఋషి పుంగవులు, శివభక్తులు, భటుల బొమ్మలు ఉన్నాయి. మధ్య మధ్యలో నాలుగు దళాల పద్మాలు, పట్టీలు వున్నాయి. ఈ కక్షాసనాలను వెనకగోడగా చేసుకొని రంగమండపం లోపలి వైపున చుట్టూ ఏడు చిన్న దేవాలయాలు ఉన్నాయి. రెండింటిలో మాత్రం దేవి, గణపతి విగ్రహాలున్నాయి. కేవలం కాకతీయుల దేవాలయ రంగమంటపాల్లోనే ఇలాంటి చిన్న దేవాలయాలు పరివారాలయాలుగా వుండటం గమనించాల్సిన విషయం.

పాదవర్గం

అధిష్ఠానంపైన ఉండే దేవాలయ గోడభాగాన్ని ‘పాదవర్గం’ అంటారు. రామప్ప దేవాలయ గర్భాలయ, అర్ధమండపాల వరకూ వున్న గోడభాగం, కింద వేదిక, పొడవాటి స్తంభభాగం, దానిపైన కలశం, ఫలిక, పద్మం, పోదిక (బోదె) వున్నాయి. అడ్డంగా చూస్తే ఒకవైపు నుంచి మరోవైపుకు కర్ణకూటం, అహార, పంజర, ముఖశాల మళ్ళీ పంజర, అహార, కర్ణకూటాల అమరిక వుంది. ముఖశాల మధ్యభాగంలో మూడంచెలున్న కోష్టము, దానిపై శిఖరం, కోష్టం పక్క గోడలకు స్వస్తిభద్ర కిటికీలు, ఒక్కో అంచెకు కపోతం, వ్యాళ వర్గాలున్నాయి. కోష్టం కింద గజధార, దానికింద యధావిధిగా అధిష్ఠానం ముందుకు పొడుచుకొచ్చాయి. కుముద భాగం మధ్యలో చక్కటి నంది విగ్రహం వుంది. నంది కేవలం శివుని వాహనమే కాదు. వ్యవసాయానికి తోడ్పడి తిండి గింజలందించేది. కాబట్టి, దానిపట్ల కాకతీయులు మక్కువ పెంచుకొన్నారు. అలాగే, గర్భాలయ గోడల ముఖశాల మధ్యలో మూడువైపులా మూడు కోష్ఠాలున్నాయి. కర్ణకూట అహార భాగాల్లో రెండు స్తంభాల కోష్ఠాలపై మూడంతస్తుల విమానముంది.

ప్రస్తరం (చూరుగల కప్పు)

గర్భాలయం, అర్ధ మండపం, రంగమండపంపైన గోడలపై వర్షం నీరు పడకుండా బాగా వెడపూ్పైన ప్రస్తర కపోతముంది. దాన్ని చూరు అనవచ్చు. కిందనుంచి చూసే వారికి కొయ్యతో బాడిసె ఉలిపెట్టి పట్టీలు, బద్దెలు, చివర చూరునుంచే వర్షపు బిందువుల మాదిరి బొంగరం లాంటి రాతి బుడిపెలు కనబడేలా చెక్కారు. ఈ బుడిపెలనే సమరాంగణ సూత్రధారమనే శిల్పశాస్త్రాన్ని రచించిన భోజమహారాజు నకీ.శ.1వ శతాబ్ది) ‘ఝారావళి’ అని పిలిచారు. అంటే చూరు నుంచి రాలే ‘చిటుక్కు, చిటుక్కు వానచుక్కలని’ అర్ధం. కపోతం కింద ఉత్తరమనే దూలం వరుస, కపోతంపైన వ్యాళమనే వరుసా వున్నాయి.

శిఖరం (విమానం)

కప్పు వరకూ రాతితో కట్టిన రామప్ప దేవాలయ ప్రస్తరం పైన ఇటుకలతో కట్టిన మూడంతస్తుల ‘విమాన’ముంది. అనేక రకాల కొలతలతో నిర్మించటం వల్ల దీన్ని విమాన (నానా మానవిధానత్పాత్ విమానం పరికల్పయేత్) మన్నారు. కాకతీయుల కాలపు విమానం శిథిలమైతే నలభై ఏళ్ళక్షికితం దీన్ని పునర్నిర్మించారు. కూటకోట లక్షణం ద్రావిడ పద్ధతిలో కట్టిన విమాన శిఖరం చదరంగా వుంది. దానిపైన కలశముంది. విమానం ముందు భాగాన అర్ధ మండపంపైన రెండో అంతస్తు వరకూ ఉన్న కట్టడాన్ని శుకనాసి చిలుకముక్కు (చి.ము) అంటారు.

నీళ్లపై తేలే ఇటుకలు

రామప్ప శిల్పులు సకల విద్యావూపవీణులు, ప్రయోగశీలురు. వాళ్లు ఎంతటి ప్రతిభాశాలులూ అంటే అప్పటికే భారీశిలలతో బరు దేవాలయానికి మరింత బరువు కాకూడదని, గర్భగుడిపై విమానాన్ని నీళ్లలో తేలే ఇటుకలతో నిర్మించి, నిర్మాణ రంగంలో యావత్ భారతదేశంలోనే తమకెవరూ సాటిలేరన్న విషయాన్ని రుజువు చేశారు.

రంగమండపం

రామప్ప దేవాలయ గర్భగృహం, అర్ధమండపం తరువాత వున్న చదరపు మండపాన్ని ‘రంగమండపం’ అంటారు. దీనికి మూడువైపులా భక్తులు లోనికి వెళ్ళడానికి దారులున్నాయి. దేవుని విగ్రహానికి చేసే అలంకరణలను అంగభోగమని, రంగశిలనుంచి అర్పించే నాట్యాన్ని రంగభోగమనీ, రెండింటినీ కలిపి అంగరంగ భోగాలనీ అంటారు. ఈ మండపంలో మధ్యన ఎత్తైన నాలుగు ప్రధాన స్తంభాలు, చుట్టూ వేదిక మీద కురచస్తంభాలు వున్నాయి. కపోతం వంగిపోతుంటే అప్పటి పురావస్తు శాఖ సంచాలకులు డా॥ గులాం యజ్దాని చుట్టూ అదే సాదాగా చెక్కించిన రాళ్ళతో స్తంభాపూత్తించాడు. దానిపై నున్న వ్యాళ వర్గం శిథిలమైతే దాన్ని కూడా రాతితో పిట్టగోడ మాదిరిగా కట్టించాడు. నిజానికి కాకతీయుల పిట్టగోడపై ప్రధాన ఆలయాన్ని పోలిన చిన్న ఆలయాల వరుస వుంటుంది.

రంగమండప స్తంభాలపై శిల్పం

రంగమండపం మధ్యనున్న నాలుగు స్తంభాలు, దూలాలు, కప్పు రాళ్ళను నల్ల శానపు రాతితో చెక్కారు. వాటిని ఎంత నున్నగా చెక్కారంటే చూసుకుంటే మన ముఖం కూడా కనపడుతుంది. ఇక, ఆగ్నేయంలో వున్న స్తంభానికి కింద అశ్వపాదం, స్తంభభాగం దానిపై నాట్య గణపతి, ఎకచెక్కాలాడుతూ శృంగారం భంగిమల్లో ఉన్న దంపతులు, ఒక సైనికుడు, అతని భార్య (కొంతమంది పరిశోధకులు ఈ శిల్పాన్ని రేచర్ల రుద్రసేనాని, అతని భార్యగా వర్ణించారు), నాట్యగత్తెలను చెక్కారు. నైరుతిలోని స్తంభంపైన నాట్యగత్తెలు, రతీ మన్మథ, అమృత మధన దృశ్యాలు, వాయువ్య స్తంభం మీద గోపికా వస్త్రాపహరణం, నాట్యగాళ్ళు, ఈశాన్య స్తంభంపై డిజైన్లు వున్నాయి. స్తంభాలపైన కలశం, దాడి, ఫలికా పద్మాలను బంగారు పనిచేసే కంసాలులు తీర్చి దిద్దారా అన్నట్లుంది. దానిపై నాలుగు వైపులా నాలుగు ముఖాలున్న బోదెలు వున్నాయి.

రంగమండప దూలాలు

బోదెలపైన గల దూలాలపై కూడా వెన్నతో తీర్చిదిద్దారా అన్నట్లుగా లెక్కలేనన్ని దేవతా మూర్తుల్ని సులువుగా చెక్కారు. తూర్పువైపు దూలం ఎదురుగా శివ కల్యాణ సుందరమూర్తి, దూలం కింది వైపున బ్రహ్మ, విష్ణువుల మధ్య నర్తనమాడుతున్న నటరాజు, ఏకాదశ రుద్రులు, లోపలి వైపు త్రిపుర సంహారమూర్తి, దక్షిణం వైపు దూలంపై ఎదురుగా, నందీశ్వర, బ్రహ్మ, విష్ణు, వాహనాలపైనున్న దిక్పాలకులు, సప్తర్షులు, దూలం కిందవైపున గజాసుర సంహారమూర్తి, లోపలివైపు అమృతకలశానికి అటూ ఇటూ దేవతలు, పడమర దూలం ఎదురుగా దేవతా శిల్పాలు, దూలం కింది వైపున దిక్పాలకుల మధ్య నటరాజు, లోపలి వైపు సాగరమధన దృశ్యం, ఉత్తరం వైపున దూలంపై ఎదురుగా రుషులు, కింది వైపు గజాసుర సంహారమూర్తి, లోపల రామరావణ యుద్ధ దృశ్యాలు రమణీయంగా మలిచారు. దూలాలపైన మధ్యలో (మూలరాళ్ళు) కోణవట్ట, చదరవట్టాల (చదరపు రాళ్ళు)పై దిక్పాల శిల్పాలు, మధ్యన నటరాజశిల్పం చూపరుల దృష్టిని మరల్చటమే కాక మెడనొప్పిని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే, ఏ శిల్పానికి ఆ శిల్పం అద్వితీయం, కనుక!

మదనిక నాగిని శిల్పాలు

రంగమండప కక్షాసనాల వెనుక వేదికపై నిలబెట్టిన కురచ స్తంభాలున్నాయి గదా! వాటి వెలపలి వైపు నుంచి దూలాల బోదె భాగాల్లోకి నల్ల శానపురాతితో చెక్కిన ఏనుగుపైనున్న సింహాన్ని పోలిన ఉహాత్మక జంతువు -యాళి - గజకేసరి శిల్పాలు, నాగినీ, మదనికా శిల్పాలు ఉన్నాయి. చక్కటి అంగసౌష్టవంతో వొంపుసొంపులు, హొయలూ, వయ్యారాల కలపబోతగా తీర్చిదిద్దిన సుందరీమణులు కాకతీయుల కాలపు అందమైన యువతుల రూపలావణ్యానికి ప్రతిబింబాలు. నల్లశానపు రాతిలో చెక్కిన రంగమండప వాయువ్యభాగంలో ఐదు గజకేసరి శిల్పాలు, తరువాత తూర్పు ద్వారానికి రెండువైపులా ఇద్దరేసి నాట్యగత్తెలు, నాగినులు, మద్దెల వాయిస్తున్న యువతులు. తూర్పువైపు ద్వారానికి ఎడమవైపున్న యువతి ఎత్తు మడమల చెప్పులతో ఫ్యాషన్లలో ఫ్రెంచి అందగత్తెల్ని తలదన్నే రీతిలో ఉంది. మరో యువతి వంటిపై జారిపోతున్న ఎంబ్రాయిడరీ అల్లికలు, అప్పటికి కొంగొత్త డిజైన్లు అద్దుకున్న బట్టలతో అందమంతా తన సొంతమేనన్నట్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సుందరీమణులు తమ కురులను అందంగా అలంకరించుకొన్న తీరు, చెవులకు పెద్దసైజు గుండ్రటి దుద్దులు, నాజూకైన బంగారు నగలు, నాట్య భంగిమలు. ఆ సొగసుగత్తెల మాటే చేయి తిరిగిన శిల్పుల పనితనానికి మనం అబ్బురపడతాం. అంగాంగానికి పొందుపరచిన ఆభరణాలతో అప్సరసలను సైతం కవ్వించి, అలంకరణలో, అందంలో తమకు సాటిరాదన్న గర్వంతో సవాళ్ళు విసురుతూ, అలనాటి తెలంగాణ ప్రాంత యువతులు మొదటి నుంచీ సౌందర్యోపాసకులని రుజువు చేస్తున్నాయి.

ద్వారశాఖలు

గర్భాలయంలో ప్రతిష్టితమైన రుద్రేశ్వరుని దర్శించాలనుకొన్నా వీటన్నిటినుంచి దృష్టి మరల్చాలి. అవును. అపురూపంగా చెక్కిన ద్వారబంధాలు, వాటి శాఖలు, కింద సుందరశిల్పాలు, వేటగత్తెలపాట్లు, లోనికి వెలుతురు రావటానికి కిటికీలు, కిటికీ కళ్లపై అలనాటి నాట్యభంగిమలు, కరణాలు, అభినయ, నృత్యరీతులు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. బహుశా రేచర్ల రుద్రుడు, జాయపసేనాని సహవాసం వల్ల అబ్బిన నాట్యాభిరుచిని ఇక్కడ తెలియజెప్పాలనుకున్నారేవెూ! ద్వార బంధాల కిందున్న గడపపై రమణీయ శిల్పం, పైనున్న పతంగంపై నటరాజు తాండవం చూపరులను మమేకం చేస్తుంది. ఇక్కడ మలచిన నాట్య భంగిమలను, జాయపసేనాని రచించిన ‘నృత్య రత్నావళి’లోని నాట్య సంప్రదాయాలను డా॥ నటరాజ రామకృష్ణ తులనాత్మకంగా పరిశీలించి, పరిశోధించిన ఎన్నో నాట్య విశేషాలను ప్రపంచానికి తెలియజెప్పారు. వారు 1985లో రామప్ప దేవాలయ ప్రాంగణంలో పేరిణి నృత్యవూపక్షికియను వేలమంది సమక్షంలో ప్రదర్శించిన విషయం లోక విదితమే.

నంది మండపం

దేవాలయ దర్శనమైన తరువాత రంగమండపం బయటికొచ్చిన వారికి, తంజావూరు బృహదీశ్వరాలయంలో మాదిరిగా వ్యవసాయం పట్ల మక్కువ గల కాకతీయ రాజుల అభిమతానికి మచ్చుతునకగా, దుక్కిటెడ్లపట్ల గల మమకారాన్నంతా కలిపి చెక్కించుకొన్న నంది కనిపిస్తుంది. దీన్ని ప్రతిష్టించిన నందిమండపం, అటు అంతకుముందు కళ్యాణి చాళుక్యుల దేవాలయాల్లోగానీ, లేక అప్పటి వరకూ కట్టిన కాకతీయదేవాలయాల్లోనూ ఎక్కడా లేనట్లు విలక్షణ వాస్తుశైలిలో ఉంటుంది.

కాటేశ్వరాలయం

అర్ధమండప, గర్భాలయం, మహామండపాలతో ఉన్న కాటేశ్వరాలయాన్ని రుద్రసేనాని తన తండ్రి కాట్రెడ్డి పేర నిర్మించాడు. చుట్టూ చిన్న ప్రదక్షిణ పథంగా వున్న ఉపపీఠం దానిపై చిన్న అధిష్టానం, పాదవర్గం, ప్రస్తర కపోతం, దానిపైన ఒక్క అంతస్థు వరకు మిగిలి వున్న ఇటుకరాతి శిథిల విమానం, కొంచెం ఎత్తైన అధిష్ఠానం, దానిపై కక్షాసనాలతో ఉన్న రంగమండపం, ప్రవేశం దగ్గర అటూ ఇటూ శిథిలమైనా పదిలంగా మెట్లెక్కండని భక్తులను ఆహ్వానించే రెండు ఏనుగు శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి.

రంగమండపంలో 16 స్తంభాలు, ద్వారబంధాలపై స్వస్తిభవూదజాలకాలతో రామప్ప ప్రధానాలయానికి తగ్గట్టుగా నిర్మితమైంది. ముందున్న మెట్లకు అటూ ఇటూ పొందికగా వున్న అధిష్ఠాన భాగాలను సంస్క ృతంలో గజహస్తాలనీ, ఆలంబన బాహులనీ అంటారు.

కామేశ్వరాలయం

రామప్ప దేవాలయానికి నైరుతి దిక్కులో నిర్మితమైన కామేశ్వరాలయం చిన్న ఉపపీఠం, సాదాగోడలు, దానిపై చిన్న కపోతం, వ్యాళ వర్గాలున్నాయి. ముందుభాగంలో అటూ ఇటూ రెండు కక్షాసనాలుండటం గమనించదగ్గ విషయం. ద్వారబంధాలు కాకతీయ శిల్ప వైశిష్ఠ్యాన్ని తెలియజేస్తున్నాయి.

కల్యాణ మండపం

రామప్ప ఆలయ దక్షిణ భాగంలో ప్రాకారానికి మధ్యగల కల్యాణ మండపం శిథిలమైపోగా దానిని భారత పురాతత్త్వ సర్వేక్షణ శాఖ పదిలపరుస్తోంది.

ప్రాకారం

ఆలయాలను అపురూపంగా కట్టించిన రుద్రుడు వాటి భద్రతను గురించి కూడా ఆలోచించాడు. ఆలయాల భద్రతతో పాటు పచ్చటి పరిసరాల నడుమ అందం ఇనుమడించేటట్లు చుట్టూ ఎత్తైన విశాలమైన ప్రాకారాన్ని నిర్మించాడు. తూర్పు, పడమర, దక్షిణ దిక్కుల్లో ప్రవేశ ద్వారాలను కల్పించాడు. ప్రాకారం దృఢంగా ఉండటానికి రెండు వరుసలతో గోడకట్టి, ఆ వరుసల మధ్య మట్టితో నింపి, పైన కప్పునూ, దానిపై అందం కోసం కలశాలను తలపించే కోడిపుంజు తలపై ఉండే తురాయి రీతిలో శిల్పకళాకృతులను నిర్మించాడు.

ఇతర దేవాలయాలు

రామప్పకు నైరుతి దిక్కులో 100 గజాల దూరంలో ఒక త్రికూటాలయం, వాయువ్యంలో చాళుక్య రీతిలో నిర్మించిన ఆలయం, చెరువుకట్టపై కుడివైపున కొండగట్టున మరో ఆలయం, చెరువుకట్టకు ఎడమవైపు ఒక త్రికూటాలయం, మరో ఏక కూటాలయం ఉన్నాయి. ఇవన్నీ శిథిలమైనా చూడదగ్గ కట్టడాలే.

కాకతీయ శిల్పంలో జైన తీర్ధంకరులు, శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య శిల్పాలు, సామాజిక శిల్పంలో వేటగాళ్ళు, వేటగత్తెలు, నాట్యగాళ్ళు, నాట్యగత్తెలు, వాద్యగాళ్ళు, వాద్యగత్తెలు, దంపతి శిల్పాలు, నాగిని, మదనిక శిల్పాలు తలమానికాలు. శైవ శిల్పాల్లో, గణపతి, కార్తికేయ, వివిధ శివరూపాలలో నటరాజ, వైష్ణవ ప్రతిమల్లో విష్ణు, చెన్నకేశవ, శాక్త శిల్పాల్లో, సప్తమాతృక, మహిష మర్ధిని శిల్పాలు ముఖ్యమైనవి.

శాతవాహనుల తరువాత అంతటి చక్కటి రూపలావణ్యంతో బాగా నగిషీ చేసే శిల్ప ప్రక్రియ మళ్ళీ కాకతీయుల కాలంలోనే జరిగింది. మనుషులు, దేవతా శిల్పాలే కాక జంతువులకూ విశేష ప్రాధాన్యాన్నిచ్చారు శిల్పులు. దేవాలయ గోడలపై నంది, హంసలు, ఏనుగులు, గుర్రాల వరుసలు నాటి శిల్పుల ప్రతిభకు తార్కాణాలు. రామప్ప రంగమండప స్తంభాలకున్న నాగిని, యువతుల శిల్పాలు మరెక్కడా కాన రావు.

రెండున్నర శతాబ్దాల్లో వేలకొద్దీ శిల్పాలు చెక్కించి భారతీయ శిల్పకళా చరివూతలో తమకంటూ మహత్తర స్థానాన్ని కల్పించుకొన్న కాకతీయులు నిజంగా ధన్యజీవులు!

అపురూపమే కాక ఎంతో అరుదైన రామప్ప దేవాలయం మధ్యయుగపు రాజవంశ ఠీవిని, అప్పటి వాస్తు శిల్ప వైవిధ్యాన్నీ అట్లే నాటి శిల్పుల హస్తకళా లాఘవాన్ని ఆవిష్కరిస్తూ, ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటుకోసం ఎదురుచూస్తోంది.

శాసన మండపం

గణపతి దేవుని అడుగుజాడల్లో నడుస్తున్న రేచర్ల రుద్రుడు ఆలయాన్ని కట్టిన సందర్భంగా సంస్కృతంలో ఒక శాసనాన్ని వేయించి, దానిని నిలబెట్టి ఎండావానల నుంచి రక్షణకు ఒక మండపాన్ని కట్టించాడు. చక్కటి ఉపపీ నాలుగు స్తంభాలపై అందమైన కప్పుతో నిర్మించిన శాసన మండపం కాకతీయ వాస్తు కట్టడాల్లో విలక్షణమైందిగా గుర్తింపు పొందింది.

Tuesday, November 13, 2012

జలియన్ వాలాబాగ్ దురంతం

జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారత దేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట.ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశం

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులు భారతీయులను సహాయం కోసం అడిగితే తిరుగుబాటు చేస్తారనుకున్నారు. కానీ వారి భయానికి విరుద్ధంగా ప్రధాన రాజకీయ నాయకత్వాల నుంచి విశేషంగా స్పందన లభించింది. వారికి ఆ యుద్ధంలో సహాయపడటం ద్వారా వారి నుంచి స్వాతంత్ర్యం పొందాలని వారి ఆలోచన. యుద్ధానికి భారతీయ సైన్యాలను పంపించి వారికి సాయం చేశారు. దాదాపు 13 లక్షల మంది భారతీయ సైనికులు యూరోపు, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో తమ సేవలందించారు. భారతీయ రాజులు తమ శక్తి మేరకు ధనాన్ని, ఆహారాన్ని, ఆయుధాలను పంపించారు. కానీ బెంగాల్, మరియు పంజాబ్ లలో మాత్రం వలసవాదులకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. బెంగాల్‌లో ఉగ్రవాద తరహా దాడులు, పంజాబ్ లో నానాటికీ పెరుగుతున్న అశాంతీ ఆయా ప్రాంతీయ పరిపాలనా విభాగాలను ఇరుకున పెట్టాయి. ఈ యుద్ధం ప్రారంభం నుంచే అమెరికాలోనూ, కెనడా, జర్మనీలలో ఉంటున్న కొద్దిమంది భారతీయులు బెర్లిన్ కమిటీ, మరియు గదర్ పార్టీ నేతృత్వంలో, ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ మరియు, జర్మన్, టర్కీల సహకారంతో 1857 సిపాయిల తిరుగుబాటు తరహాలోనే ఉద్యమం లేవదీయాలని చూశారు. దీన్నే హిందూ జర్మన్ కుట్ర అని కూడా అంటారు. దీనిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ ను కూడా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు విఫల యత్నాలు చేశారు వీటిలో గద్దర్ కుట్ర, మరియు సింగపూర్ కుట్ర ప్రధానమైనవి. కానీ ఈ ఉద్యమాలు విస్తృతమైన గూఢచార సమాచారంతో, కఠినమైన రాజకీయ శాసనాలతో అణచివేయడం జరిగింది. ఈ చట్టాలు దాదాపు పదేళ్ళపాటు అమలులో ఉన్నాయి.

యుద్ధం తరువాత

దుర్ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత దృశ్యం
యుద్ధం తరువాత చాలామంది క్షతగాత్రులయ్యారు. ద్రవ్యోల్బణం అధికమైంది. దానితోపాటు అధిక పన్నులు ప్రజల జీవితాలను దుర్భరం చేశాయి. అంటువ్యాధులు ప్రభలాయి. వాణిజ్య వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజలు అనేక భాధలకు లోనయ్యారు. భారతీయ సైనికులు ఆంగ్లేయుల పాలనను అంతమొందించడానికి చాటుమాటుగా ఆయుధాలు తరలించడం మొదలుపెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్ లోని మితవాదులు మరియు అతివాదులు తమలో తామే బేధాలను పరిష్కరించుకోవడంతో యుద్ధానికి పూర్వం ప్రారంభమైన జాతీయవాద ఉద్యమం మళ్ళీ తిరిగి పుంజుకుని ఒక ఐక్యకూటమిగా ఏర్పడింది. 1916 లో ముస్లిం లీగ్ తో రాజకీయ అధికారం పైన ప్రాంతంలోని ముస్లింల భవిష్యత్తు గురించి తాత్కాలికంగా లక్నో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆశ్చర్యకరమైన రీతిలో సుధీర్ఘంగా కొనసాగుతున్న పోరాటానికి నిధులు, మానవ వనరులూ సమకూరుతూనే ఉన్నాయి. ఆంగ్లేయులు భారతదేశంలో ఉన్నకొద్దీ భారతీయుల అసహనం ఎక్కువకాసాగింది. భారతదేశం ఆంగ్లేయులకు భారీగా సైనికులను, ధనాన్ని సరఫరా చేయడమే కాకుండా దాదాపు 43,000 మంది సైనికుల్ని కోల్పోయింది.

యుద్ధానంతర మార్పులు

భారతీయులు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా భారతీయులు తమకు పూర్తి స్వాతంత్ర్యం కాకపోయినా కనీసం పరిపాలనలో తమ మాట చెల్లుబాటు కావాలని భావించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బ్రిటీష్ ప్రభుత్వం పరిపాలనలో మాంటేగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను ప్రవేశపెట్టింది. కానీ భారతీయ స్వాంతంత్ర్యోద్యమ నాయకురాలు మేడమ్ భికాజీ కామా భారతీయులకు ఆ సంస్కరణలు ఏమాత్రం సరిపోవని వ్యాఖ్యానించింది. దీంతో అప్పటిదాకా రగులుతున్న పోరాటానికి ఆజ్యం పోసినట్లయింది.

రౌలట్ కమిటీ

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రూపొందించబడిన గదర్ కుట్ర (Ghadar conspiracy), మహేంద్ర ప్రతాప్ ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్థాన్ లో నెలకొన్న ఆపద్ధర్మ ప్రభుత్వం, మరియు రష్యా తో దానికిగల సంబంధాలు, పంజాబ్ మరియు బెంగాల్ లో నానాటికీ పెచ్చరిల్లుతున్న విప్లవోద్యమం, భారత ప్రజల్లో నానాటికీ రగులుతున్న అసంతృప్తి(ముఖ్యంగా బాంబే మిల్ వర్కర్స్ లో) , మొదలైన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బ్రిటిష్ ప్రభుత్వం 1918లో ఆంగ్లేయ న్యాయమూర్తియైన సిడ్నీ రౌలట్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనినే రౌలట్ కమిటీ అంటారు. ఈ కమిటీ భారతదేశంలో (ముఖ్యంగా పంజాబ్ మరియు బెంగాల్ ప్రాంతాలలో) మిలిటెంట్ ఉద్యమానికీ, రష్యా, జర్మనీ కి ఏదైనా సంబంధం ఉందేమే బ్రిటీష్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి.

రౌలట్ చట్టం

రౌలట్ కమిటీ ప్రతిపాదనను అనుసరించి బ్రిటీష్ ప్రభుత్వం 1915లో ఏర్పాటు చేయబడ్డ భారతీయ రక్షణ చట్టానికి అదనంగా రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం ద్వారా తిరుగుబాట్లను అణిచివేయడానికి వైస్రాయ్ లకు విశేష అధికారాలని కట్టబెట్టారు. ప్రెస్ నోళ్ళను కట్టేయడానికీ, విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించడం, తిరుగుబాటు దారునిగా అనుమానితులైన వ్యక్తులను వారంటు లేకుండా అరెస్టు చేయడం మొదలైన నిరంకుశమైన అధికారాలు ఇందులో ఉన్నాయి. ఈ చట్టం పై దేశంలో సర్వత్రా ఆగ్రవేశాలు వ్యక్తమయ్యాయి.

దుర్ఘటన


తోటలో గల అమరవీరుల స్మారక బావి
 తోటలో గల అమరవీరుల స్మారక బావి1919, ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ లోగల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ లో దాదాపు 20 వేలమంది ప్రజలు సమావేశమయ్యారు. అది వైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం. వారు అక్కడ సమావేశమవడానికి ముఖ్య కారణం, ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడం మరియు అనేక విమర్శలకు గురైన రౌలట్ చట్టం క్రింద సత్యపాల్, మరియు సైఫుద్ధీన్ కిచ్లూ లను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించడం. వివిధ విభాగాలకు చెందిన 90 మంది సైనికులు (ఇండియన్ ఆర్మీ), వారితో బాటు రెండు సురక్షిత వాహనాలు (armoured cars అక్కడికి వచ్చాయి. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు బాగ్ లోపలికి రాలేకపోయాయి. జలియన్ వాలా బాగ్ (పార్కు) అన్ని ప్రక్కలా ఇండ్లతోను, పెద్ద భవనాలతోను చుట్టబడి ఉంది. ఉన్న కొద్దిపాటి ఇరుకైన సందుల దారుల్లో చాలావాటికి తాళాలు వేసిఉన్నాయి. కాల్పుల కారణంగా వందలమంది మరణించారు. గాయపడినవారి సంఖ్య వేలల్లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 379 మంది (337 పురుషులు, 41 మంది బాలురు, 6 వారాల పసికందు) మరణించారు మరియు 200 మంది గాయపడ్డారు. అక్కడ స్మారక చిహ్నంపైన వ్రాసిన సమాచారం ప్రకారం అక్కడి బావిలోంచి 120 శవాలను బయటకు తీశారు. అయితే అధికారిక గణాంకాలు సరికాదని వాదనలున్నాయి. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడినవారని ఆసుపత్రులకు తీసికొని వెళ్ళడం సాధ్యం కాలేదు.

తన ఆఫీసులో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పులు జరుపవలసి వచ్చింది. డయ్యర్‌కు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డ్వయర్ ఇచ్చిన టెలిగ్రాములో "నీ చర్య సరైనదే. దానిని లెఫ్టినెంట్ గవర్నర్ సమర్ధిస్తున్నాడు" అని వ్రాసి ఉంది.

ఈ ఉదంతంపై విచారణ జరపడానికి 1919లో "హంటర్ కమిషన్" ఏర్పరచారు. ఆ కమిషన్ సమక్షంలో డయ్యర్ - తనకు ఆ మీటింగ్ గురించి 12:40కి తెలిసిందనీ, దానిని నిలపడానికి తానేవిధమైన ప్రయత్నమూ చేయలేదనీ, అక్కడ సమావేశమైన గుంపు గనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ - చెప్పాడు.

"బహుశా కాల్పులు జరుపకుండా గుంపును చెదరగొట్టడం సాధ్యం అయ్యుండవచ్చునని నేను భావిస్తున్నాను. కాని వాళ్ళంతా మళ్ళీ తిరిగివచ్చి నన్ను అవహేళన చేసేవారు. నేను చేతగానివాడినయ్యుండేవాడిని." — (హంటర్ కమిషన్ సమక్షంలో డయ్యర్ స్పందన)
అంతే గాకుండా ఆ స్థలంలోనికి వాహనాలు వెళ్ళగలిగితే తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని, కాని ఇరుకైన సందులలోకి సాయుధ వాహనాలు వెళ్ళడం కుదరలేదని చెప్పాడు. జనం చెల్లా చెదురైనా గాని కాల్పులు ఆపలేదని, కొద్దిపాటి కాల్పులవల్ల ప్రయోజనం లేదని, జనం అంతా వెళ్ళిపోయేదాకా కాల్పులు జరపడం తన బాధ్యత అని చెప్పాడు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించడం తన బాధ్యత కాదు గనుక అలాంటి ప్రయత్నమేమీ చేయలేదని, ఆసుపత్రులు తెరచి ఉన్నందున వారే వెళ్ళవచ్చునని కూడా అన్నాడు.

ప్రతి చర్య

భారతదేశంలో దీనికి ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్ లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920 లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్, బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చివేశాడు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పవచ్చు.

1920లో హంటర్ కమిషన్ రిపోర్టు వెలువడింది. డయ్యర్‌ను క్రింది పదవికి మార్చారు. అతని ఆరోగ్యం కూడా క్షీణించి ఉండడం వలన తరువాత అతనిని వైద్య సదుపాయాలున్న ఓడలో ఇంగ్లాండుకు పంపేశారు. కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మరొక భారత సైనిక తిరుగుబాటును అణచివేసినందుకు అతనిని ప్రశంసించారు. బ్రిటిష్ పార్లమెంటులో అతని చర్యను నిరశిస్తూ తీర్మానాలు చేశారు. ఇది చాలా దారుణమైన, అసాధారణమైన చర్య అని చర్చిల్ అభివర్ణించాడు. 1920లో డయ్యర్ పదవికి రాజీనామా చేశాడు.

కొందరు బ్రిటిష్‌వారు మరియు కొంత బ్రిటిష్ పత్రికారంగం డయ్యర్ కర్తవ్య నిరతిని మెచ్చుకొన్నారు కూడాను. అతని సంక్షేమం కోసం విరాళాలు కూడా సేకరించారు. అమృత్‌సర్ నుండి ఢిల్లీకి రైలులో ప్రయాణిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ పరదాల అవతల నుండి ఒక మిలిటరీ ఆఫీసర్ గట్టిగా ఇలా మాట్లాడడం విన్నానని తన ఆత్మకథలో వ్రాశాడు - "పట్టణం అంతా నా దయమీద ఆధారపడి ఉంది. దానిని బూడిద చేసేద్దామనుకొన్నాను గాని దయతలచి వదిలేశాను" - ఈ మాటలు అన్న వ్యక్తి స్వయంగఅ డయ్యరే. అదే రైలులో ప్రయాణం చేస్తున్నాడు.

స్మారక చిహ్నాలు

జలియన్ వాలా బాగ్ స్మారక స్తూపం
జలియన్ వాలా బాగ్ స్మారక స్తూపం1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది. 1923లో ఇందుకు కావలసిన స్థలం కొనుగోలు చేశారు. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరింపబడింది. నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలను తరువాత జోడించారు. ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. బులెట్‌ల నుండి తప్పించుకోవడానికి తొక్కిడిలో అనేకులు దూకి మరణించిన భావి కూడా ఇప్పుడు ఒక సంరక్షిత స్మారక చిహ్నం.

Friday, November 9, 2012

హంపిలోని పద్మ మహల్ (Lotus Mahal)



పద్మ మహల్ -  హంపి

పద్మమహల్ గా పేరుగాంచిన కమలామహల్ లేదా చిత్రాంగిని మహల్ హంపి పట్టణం లో గల జేనానా ఎన్.క్లోసర్ లో నెలకొని ఉంది. కమల భవనం పట్టపు రాణుల కొరకు నిర్మించబడింది , ఇది మూడడుగుల ఎత్తైన పీఠం పై రెండంతస్తులలో ఉండి నీటి గొట్టాల ద్వారా నీరు ప్రవహించే ఏర్పాటు ఉండేది. విజయనగర రాజుల కాలములోని ఈ నిర్మాణాలు ముస్లిముల కట్టడ శైలి ని ప్రదర్శిస్తున్నవి. దీనిని హిందూ, ముస్లిమ్ నిర్మాణ శైలిలో నిర్మించారు. తొమ్మిది పిరమిడ్ ఆకారంలో వున్న "డోం" లను కలిగి వుంది. పెద్ద పెద్ద ప్రాకారపు గుమ్మాలు,శంఖు ఆకారం లో ఉన్న పైకప్పు విజయనగర రాజుల కట్టడాల శైలి నుండి విభేదించి ముస్లిముల కట్టడ శైలిని వ్యక్త పరుస్తున్నది. ఆర్చీల మద్య సింహం తలలు కలిగిన దీనిలో గదులేమి లేవు. ఇదొక అలంకార భవనం, చూడ ముచ్చటగా ఉన్నది. ఈ భవన నిర్మాణములో వేదికలు నిర్మించడానికి కొయ్య కూడా వినియోగించబడింది. దీన్నీ పదనారవ శతాబ్దంలో నిర్మించారు. దీని పక్కన పూదోట వున్నది. ఈ అందమైన భవనం బహమనీ సుల్తానుల వలన ద్వంసం కాకుండా మిగిలి ఉన్నా కాల గమనంలో కొంత శిదిలమై బాగానె వున్నది.

Monday, October 29, 2012

భైరవకోన.....

భైరవకోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం.  ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. పల్లవుల కాలంనాటి అద్భుత శిల్పకళకు సాక్షీభూతంగా నిలుస్తున్న, ప్రసిద్ధి గాంచిన పురాతన గుహలకు నెలవు భైరవకోన...

ఒకే రాయిలో అష్టశివాలయాలు - భైరవకోన
సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది .   ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీకపౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆరోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు. కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచి ఉన్నదే. ఆంధ్రప్రదేశ్‌లో వీటి జాబితా చాలానే ఉంది. గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం (విజయవాడ), బొజ్జనకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే ప్రకాశంజిల్లాలోని సీతారామపురం మండలంలోని భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి.వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి.

ఒకేచోట త్రిమూర్తులు...

ఇక్కడ ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఉంటుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాలయం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోపాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కివుండడం విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగా ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతేకాదు ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు.

పల్లవ గుహాలయాలు...

ఇక్కడి ఆలయాలకు మహాబలిపురంలోని ఆలయ నిర్మాణ శిల్పశైలికి సారూప్యం ఉండటంతో ఈ గుహాలయాలను పల్లవుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. క్రీశ 600-630 కాలానికి చెందిన మహేంద్రవర్మ పాలనలోనే ఈ గుహాలయాలు ప్రారంభించి ఉంటారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఐదోగుహలోని స్తంభాలమీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం... వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళుక్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొనసాగి ఉంటుందని అంచనా. ఇక్కడ ఈ గుహాలయాలతో పాటు చుట్టుపక్కల ఉన్న గుండాలనూ దోనల్నీ చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు, పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు ఇక్కడ దర్శనీయస్థలాలు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే కాలినడక తప్పనిసరి.

కోనకు ఎలా వెళ్లాలంటే...

భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబవరం, కొత్తపల్లి చేరు కుంటే అక్కడినుండి ఉదయం నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంది.

Saturday, October 27, 2012

పూసపాటి రాజులు - విజయనగరం కోట



 ఆధునిక యుగంలో తెలుగువారి తూర్పు దిక్కు విజయనగరం సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య పునరుజ్జీవనాలకు చిరునామా. 17వ శతాబ్దంలో పోర్ట్ విలియం నిర్మాణం వల్ల ఎలా కలకత్తా అనేక ఆధునిక నగర నిర్మాణానికి దారులు ఏర్పడ్డ్డాయో, అలానే అదే శతాబ్దంలో గాజుల రేగ అనే గ్రామానికి శివారుగా వుండే విజయనగరానికి సైతం, పూసపాటి రాజులు అక్కడ పెద్దదీ, బలమైనదీ అయిన కోట కట్టాలని నిర్ణయించడంతో కొత్త భవిష్యత్తు ఏర్పడింది. 1712-13 ఏడాదిలో విజయనగరం కోటకు పునాది వేసారు. ఈ 2012 సంవత్సరం విజయనగరం కోటకు ముచ్చటగా మూడు వందలేళ్ల సందర్భం. విజయనగరం కోట నిర్మాణానికి ముందు పూసపాటి రాజులకు కుమిలి (కుంభిళాపురం)లో మట్టికోట ఉండేది. దీనిపై మహమ్మదీయుల దాడులు తరచూ జరుగుతూ వుండడంవలన రాజ్య సుస్థిరతా, భద్రతా కారణాల దృష్ట్యా సైతం, ఈ కోట నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. పూసపాటి రాజులలో అయిదో పాలకుడయిన ఆనంద గజపతి రాజు తన కుమారుడయిన విజయరామ గజపతి రాజు పేరిట అయిదు ‘జయ’ శబ్దాలు సమకూరే శుభముహూర్తాన 1712-13లో కోటకు పునాది వేసారు. ఆ అయిదు జయ శబ్దాలూ ఏమిటంటే విజయనామ సంవత్సరం, విజయదశమి, జయవారం, విజయరామరాజు. అందుకే అది విజయనగరం కోటగా పిలువబడింది. తండ్రి ఆనందగజపతి మొదలుపెట్టినా, ఈ కోట నిర్మాణం కుమారుడు పెద విజయరామరాజు కాలంలోనే పూర్తయ్యింది. ఆ విధంగా విజయనగరం కోట నుంచి పరిపాలించిన తొలి రాజు పెద విజయరామరాజు. పూసపాటి రాజుల పరిపాలనా కేంద్రమయిన మూడు వందల ఏళ్ళ ప్రాభవాల విజయనగరం కోట, అటు శ్రీకాకుళం నుంచి రాజమహేంద్రవరం దాకా విస్తరించిన రాజ్యంగానే కాక కాలక్రమంలో విద్యా, సాంఘిక, సాంస్కృతిక వికాస దోహద శక్తిగా సైతం పాత్ర పోషించింది. పదిహేడో శతాబ్దం నుంచి ఇరవయ్యో శతాబ్దందాకా కోట విభిన్న సంఘటనలకు సాక్షిగా నిలిచింది. తొమ్మిది మంది రాజులు పట్ట్భాషిక్తులయ్యారు. పెదవిజయరామరాజు-1, ఆనందరాజు, చినవిజయ రామరాజు-2, నారాయణ గజపతిరాజు, విజయరామ గజపతిరాజు-3, ఆనందగజపతిరాజు, విజయరామ గజపతి రాజు -4, అలక్‌నారాయణ గజపతిరాజు, విజయరామరాజు-5 (పి.వి.జి.రాజు) ఫ్యూడల్ రాజరిక దశ,వలసవాద పరిపాలనల దశ, జమీందారీలుగా పరిణమించిన దశ, సంస్థానాలు భారతదేశంలో కలసిపోయిన దశలు కదిలిపోయిన చరిత్రకు విజయనగర రాజ్యం, కోట, పాలకులు అందరూ సమష్టి ప్రతీకలు. 1945లో ఆఖరుగా పట్టం కట్టుకున్నది మన కాలంలోని వారు ఎరిగిన పి.వి.జి.రాజు. రాచరిక మర్యాదలకు దూరంగా వుంటూ సోషలిజంవైపు మొగ్గుచూపిన అభ్యుదయవాది పి.వి.జి.రాజు ప్రజలతో అనుబంధం పెంపొందించుకున్నారు.












1949వ సంవత్సరంలో జమీందారీ చట్టం రద్దు కావడంతో విజయనగర సంస్థానం ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయింది. పి.వి.జి.రాజు స్వచ్ఛందంగా తన యావదాస్తీనీ, రెండు వందల ముప్ఫయ్యేళ్ళ విజయనగర రాజ్యలక్ష్మికి స్థానమైన కోటనీ విద్యల కోసం, జాతిపరం చేశారు. అయితే బొబ్బిలియుద్ధంలాగానే, విజయనగరం రాజులు గుర్తుండిపోయే మరో ఘట్టమూ వుంది. అది 1794లో జరిగిన పద్మనాభ యుద్ధం. ఈ యుద్ధంలో రెండో విజయరామరాజు పోరాడి కన్ను మూశారు. ఈ రాజు నిజానికి తాళ్లపాలెం రాజుల ఇంటి బిడ్డ. పెదవిజయరామరాజు భార్య రాణీ చంద్రాయమ్మ, భర్త సూచనల మేరకు దత్తత స్వీకరించి చిన విజయరామరాజుగా నామకరణం చేశారు. బొబ్బిలియుద్ధంలో పెద విజయరామరాజు మరణం తర్వాత, చిన విజయరామరాజుకు పట్ట్భాషేకమైనా, బాలుడు కావడంతో, ఇతని సవతి తల్లి కుమారుడు, అన్న అయిన సీతారామరాజు కొనే్నళ్ళు దివాన్‌గా వ్యవహరించి రాజ్య పరిస్థితులను అధోగతికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితి పెద విజయరామరాజు ఆస్థాన కవి అయిన అడిదం సూరకవి తన రామలింగేశ శతకంలో చిత్రణ చేశారు. అగ్రహారంబులు నామావశిష్టములయ్యె మాన్యంబుల్నియు మంట గలిసె బత్తెంబునకు తొంటి పడికట్టు దప్పెను బుధ జనంబుల రాకపోకలుడిగెవర్నాశనంబులు వరద పాలైపోయె మలవ తలను ప్రజల్ మాని పనిరి నశించిపోయె జుంటరులు దుష్కరుల గజతురంగములు తాకట్టు వడియె ధార్మిక స్థానముగ కిట్టి తళ్ళుపుట్టె గఠిన చిత్తున రాజ్యాధికారి సేసి యింత పీడించితివి సత్కవీంద్ర కోటి రామలింగేశ రామచంద్ర పురవాసు! ఇంకా పూసపాటివారి కైఫీయతు, డిస్ట్రిక్టు మాన్యువల్, డిస్ట్రిక్ట్ గెజెటీర్‌లలోని వివరాలు ఆ నాటి సీతారామరాజు క్రౌర్యాన్ని, వితండ పాలననూ వెల్లడి చేస్తున్నాయి. ఇతని తర్వాత పాలనకొచ్చిన (అంటే పదవిలోనుంచి తప్పించి) చిన విజయరామారాజుకు, ఇంటి శత్రువులవల్ల సహజంగా కష్టాలు ఎక్కువయ్యాయి. సీతారామరాజు కంపెనీ పరిపాలకుల పంచన చేరాడు. విజయనగర రాజ్యం, ఆంగ్ల పాలకులకు ఆరు లక్షల యాభై వేలు కప్పంగా కట్టవలసివుందని తాఖీదులొచ్చాయి. ఆంగ్లేయ వర్తకులు, తమ రాజ్యానికి ఆహీలు (హోసీల్)గా మూడు లక్షలపైగా కట్టాల్సి వుందని, ఆ సొమ్ము మినహాయించుకుని మిగిలిన మూడున్నర లక్షలు, మూడు వాయిదాలలో చెల్లిస్తానన్న చిన విజయరామ గజపతి, ఆంగ్ల పాలకులకు అంగీకారం కాలేదు. అందువల్ల విజయనగరం కోటపై రాజు కోటలో లేని వేళ 1794 వత్సరంలో ఆంగ్ల సైన్యాల ముట్టడి జరిగింది. కోట ఖిలేదారు యుద్ధం జరిగితే కోట దెబ్బతింటుందన్న ఆలోచనతో, కోటను వారి పరం చేశాడు.

ఆంగ్ల పాలకుల ఈ దుష్టచర్యలపై కోపించి విజయనగరం ప్రాంత రైతులు తాము కట్టాల్సిన శిస్తులు కట్టడం ఆపివేశారు. దానితో రాజులకు దేశంలోగల పేరు, ప్రేమ చూసి, కప్పం కట్టలేని రాజు, దేశంలో వుండతగదనీ, తాను వెంటనే మచిలీపట్నం వెళ్లిపోవలసిందనీ, ఆంగ్ల పాలకులు ఆదేశాలు జారీ చేశారు. తన భార్య సీతాయమ్మగార్ని, ఎనిమిదేళ్ల బిడ్డ నారాయణబాబును అన్నమరాజు పేటకు పంపించి, తాను మచిలీపట్నం వెళ్ళేందుకు తొలుత సిద్ధపడిన చిన విజయరామ గజపతి, సింహాచలదేవుని సందర్శించుకుని, మచిలీపట్నం వెళ్ళిపోవలసినవాడు మనసు మార్చుకుని, కొద్ది మైళ్ళ దూరంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం చేరుకుని, తనకు విశ్వాసపాత్రులయిన సైన్యాలకు పిలుపు పంపి, ఆంగ్ల పాలకులతో, అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ పద్మనాభ యుద్ధానికి ముందు అనంత పద్మనాభస్వామి ఆలయంలో తన అనుచర యోధులు, సైన్యాలను ఉద్దేశించి, చిన విజయరామరాజు చేరిన ఆఖరి ప్రసంగం ఎంతో చారిత్రాత్మకమైనది. వలస పరిపాలకుల కూట నీతి ఎలా భారతదేశపు రాజ్యాలను లొంగదీసిందో తెలియచెప్పే ఒక సాధికార వివరణ. అందులో కొన్ని వాక్యాలు యిప్పటికీ పాఠకుల రక్తం మరిగేటట్టు చేస్తాయంటే జరిగిన ఆ అన్యాయం అటువంటిది.10.7.1794న జరిగిన పద్మనాభ యుద్ధం కేవలం నలభై అయిదు నిమిషాల్లోనే ముగిసింది. మరణించిన చిన విజయరామరాజు చుట్టూ రెండు వందల ఎనిమిది మంది ఆంధ్ర క్షత్రియ వీరులు ఆయుధాలు విడవనివారై నేలన పడి వున్నారు. వీరిలో నలభై ఎనిమిది మంది ప్రథమ శ్రేణికి చెందిన రాజపుత్ర వీరులు విజయనగరం సైనికులు మూడు వందలమందిపైగా మరణించగా, కంపెనీ సైనికులలో పదమూడు మంది మరణించగా అరవై ఒక్కరికి గాయాలు తగిలాయని నివేదికలు చెప్తున్నాయి. పద్మనాభ యుద్ధంలో ఉత్తర సర్కార్లలోని క్షత్రియ కుటుంబాల వీరులు రాజు తరపున పోరాడి ప్రాణాలు అర్పించారు. వీరిలో పూసాపాటి, వత్సవాయి, నడిపల్లి, చింతలపాటి, దాట్ల, సాగి, జంపన, దంతులూరి భూపతి, వేజర్ల, గొట్టిముక్కల, పెరుమత్స కుటుంబాల వీరులు వున్నారు. 1794 నాటికి, ఈ యుద్ధం ద్వారా ఆంగ్ల పాలకుల చేతుల్లోకి వెళ్లిన కోట, ఎన్నో కొత్త మార్పులను చూసింది. ఈ యుద్ధ బీభత్సాన్ని ఎరిగిన నారాయణ గజపతి, ఆదిల్ కొంత రాజ్యం కోసం యుద్ధాలు చేసినా, కంపెనీవారు పర్మనెంట్ సెటిల్‌మెంటు బిల్లు ద్వారా రాజులందర్నీ, జమీందరులుగా మార్చివేయడం, రాజ్యంలో వుండే సైన్యాల సంఖ్య తగ్గించి వేయడం, కలెక్టర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి, శాంతి భద్రతలకై పోలీసు యంత్రాంగాన్ని కంపెనీ అధికారాల కిందే నియమించడం వంటివి చూసి, ప్రాభవం తగ్గిన చోట తాను పేరుకు మాత్రమే రాజుగా పరిపాలన చేయలేనని ఎరిగి, కంపెనీ పాలకులతో తన జీవితాంతం ఏడాదికి లక్ష రూపాయల జీవన భృతికి ఒప్పందం చేసుకుని కాశీలో నివాసం వుండేందుకు వెడలిపోవడంతో 1794 నుంచి 1852 వరకూ, యాభ్యెనిమిదేళ్ళపాటు కోట, విజయనగర రాజ్యం లేదా జమీందారీ ఆంగ్ల పాలకుల సంరక్షణలోనే వుండిపోయాయి.

నారాయణ గజపతి కాశీకి వెడలిపోయే ముందరి దశాబ్దాలలో 1794 నవంబరు ఇరవై నుంచి కలెక్టరేటు పద్ధతి అమల్లోకి వచ్చింది. అయిదు లక్షల రూపాయల పేష్కస్ ఏడాదికి చెల్లించే పద్ధతిపై నారాయణ గజపతే తొలి విజయనగరం జమీందారయినా పురాతన జమీందారీలుగా పేరు పడ్డవీ, అంతవరకూ విజయనగరం రాజ్యంలో వున్నవీ అయిన ఆండ్ర, బెలగాం, బొబ్బిలి, చెముడు, గోల్కొండ, జయపురం, కాశీపురం, కురుపాం, మాడుగుల, మేరంగి, పాచిపెంట, పాలకొండ, సాలూరు సంగంవలస, సరిపల్లి, భీమవరం, వీటిని ఎవరివి వారికి యిచ్చివేసి స్వతంత్ర జమీందారులుగా ప్రకటించారు. ఇంతటి పెనుమార్పులకు తట్టుకుని విజయనగరంలో వుండలేని నారాయణ గజపతి కాశీ వెళ్లిపోవడమే కాక విజయనగరం తొలి జమీందరుగా అక్కడే మరణించారు. 23.8.1854న సైనిక మర్యాదలతో వీరి అంత్యక్రియలు కాశీలో బ్రిటీష్ కంపెనీవారు జరిపారు.మూడవ విజయరామరాజు చిన్నప్పట్నుంచీ కాశీలోనే పెరిగి పెద్దయిన కారణంగా వీరి వివాహమూ అక్కడి ఉత్తర హిందుస్థానపు క్షత్రియ కన్యతో జరిగింది. వీరి భార్య అలక్ రాజేశ్వరి దేవి చంద్రావతి రాజ్యపాలకులగు ఫిరూ సింగ్ బహదూర్ వారి కుమార్తె, ఈ సందర్భం మొదలుకుని విజయనగరం రాజులెవరూ ఆంధ్ర క్షత్రియ కన్యలను వివాహం చేసుకోలేదు.పద్ధెనిమిదో శతాబ్దానికి రాజ్యాలు సుస్థిరమైనాయి ముఖ్యంగా ఆంగ్ల వలస పాలకులకు. 1857 సిపాయిల తిరుగుబాటు ఈ ప్రాంతాలలో పెద్దగా ప్రభావం కలిగించలేదు. పైగా ఈ 1857 తిరుగుబాటు కాలంలో యువకుడైన విజయరాజ గజపతి-3 ఆంగ్లేయ పాలకులకు సహకరించారు.విజయనగరంలో మహారాజావారి సంస్కృత కళాశాల వీరి పాలనలోనే మొదలయింది. విజయ రామ ముద్రాక్షర శాల ఏర్పడింది. ఈ అచ్చు పనిశాలలోనే 1897లో ‘కన్యాశుల్కం’ అచ్చయింది. వీరి కుమారుడు అభినవాంధ్రభోజుడు ఆనంద గజపతిరాజు కాలంలో సంగీతమూ, సాహిత్యమూ, విద్యా సంస్థల ఏర్పాటు ఇవన్నీ పంధొమ్మిదో శతాబ్ది ఆరంభంలోనే జరిగిన ప్రప్రథమ ఆంధ్ర నగరం విజయనగ విజయరామ గజపతి కాలంలోనే కావ్యరచనలు చేసిన కవి పండితులున్నారు. వీరిలో ముడుంబై నరసింహాచార్య స్వామి, మందా కామేశ్వర కవి, లక్ష్మీ కామేశ్వర శాస్ర్తీ ప్రభృతులూ, పసకాడ సన్యాసి, కిల్లంపూడి ముత్యాలు అనే మల్లుడు, పోడూరి వెంకటరాజ కవి తదితరులున్నారు.

శ్రీపాద వెంకటాచల కవి రామకృష్ణోపాఖ్యానం అనే ద్వర్థికావ్యాన్ని రాశాడు. ఈ సాహిత్య వికాసం, ఇంతకు రెండింతలై తరువాతి పాలకుడు, ఆనంద గజపతి మహారాజు కాలంలో కొత్త ఎత్తులకు ఎదిగింది. ఆ రకంగా పంధొమ్మిదో శతాబ్దం,రాజుల పేరిట సాహిత్య యుగాలను తీర్చితే, ఆనంద గజపతి యుగంగా చరిత్రలో నిల్చిపోతుంది. గురజాడ యువకుడిగా వున్న కాలానికే 1879కి రాజ్యానికి వచ్చారు ఆనందగజపతి. వీరికి ఇరవై అయిదుభాషల్లో ప్రవేశం, ప్రావీణ్యం వుందని చెప్తారు. ‘ప్రిన్స్ ఛార్మింగ్’, ‘డ్యూక్ ఆఫ్ బకింగ్‌హాం’గా కొనియాడిన వీరిది ప్రత్యక్షంగా చూసిన దేశభక్త కొండ వెంకటప్పయ్య తెలిపినది ఇది.‘‘వారి స్వరూపము అత్యంత నిపుణుడగు శిల్పి చెక్కిన పసుపు పచ్చని బంగారు ప్రతిమవలె ఉండెను. వారి ముఖారవిందము ఎన్నిసార్లు చూచినను ఇంకను చూడవలెనను కోర్కె పుట్టుచుండును. తెల్లని లాగును తెల్లని అంగరఖాను తొడిగి దానిపైన నల్లని పూసలుగల బంగారు తావళము మెడలో వేసుకుని రవ్వలు చెక్కిన తురాయిగల ఎఱ్ఱని టోపీని పెట్టుకుని సభలకు వచ్చుచు ప్రేక్షకులకు ఆనందము గొలుపుచుండెను. ఆనంద గజపతి అను నామము వారి యెడ పూర్ణముగ సార్థకమయ్యెను’’.కవిపోషణ, పండితుల ఆదరణ, అనేక గ్రంథాలను అంకితం పొందడం, సంస్కృత, హిందీకావ్యాల తెలుగు అనువాదాన్నీ చేయించడం, తాను స్వయంగా ‘విజయనగరం ట్రీటీ’ అనే లఘుకృతిని కలిగి వుండాలని ఆశించి కన్యాశుల్కం బిల్లు ప్రవేశపెట్టడం, మాక్స్‌ముల్లర్ రచించిన రుగ్వేద వ్యాఖ్యానం (మూలం శాయనాచార్యుడి ఋగ్వేదం) ప్రతులు చెల్లిపోయిన తరుణాన పునర్ముద్రణకు అవసరమయ్యే లక్ష రూపాయల సొమ్మును అందచేయడం, తాను స్వయంగా వీణవాదనం సాధన చేయడం ఇలా విజయనగర కళా సరస్వతీ వికాసాలు ఈ రాజు కాలంలో ఉచ్ఛదశకు చేరుకున్నాయి.వీణా విద్వాంసులు సూర్యనారాయణ శాస్ర్తీగారు, ఫిడేలు వాయిద్య నేర్పరి కలిగొట్ల కామరాజుగారు, రుద్రవీణావాదన నిపుణులు కవిరాయని రమణయ్యగారు హిందుస్తానీ సంగీతంలో మంచి వైదుష్యంగల మహంతి ఖాన్‌గారు, ప్రముఖ వైణికులు గురాచార్యుల వెంకటరమణదాసుగారు, ఆనందగజపతి కొలువు కూటమిలో సంగీత గంగ పొంగులు వారేది.ముడుంబై వరాహ నరసింహాచార్యులు, గురజాడ శ్రీరామమూర్తి, బహుజనపల్లి సీతారామాచార్యులు, తచ్చూరి సింగరాచార్య, గురజాడ అప్పారావు గార్ల విభిన్నమైన రచనల్ని ఆనందగజపతి అంకితం పొందారు. నన్నయచే సంస్కృత మహాభారత ఆంధ్రీకరణం మొదలుపెట్టించిన రాజరాజ నరేంద్రుని వలె, గురజాడ అప్పారావుగారిచే, కన్యాశుల్కము, వ్యవహారిక భాషా నాటకాన్ని రాయ ప్రేరేపించిన ఆనందగజపతి కూడా ఆధునిక తెలుగు సాహిత్య యుగారంభ దీప్తిమంత మూర్తులలో ఒకరిగా వుండిపోతారు.ఆనందగజపతిరాజు పాండితీ ప్రకర్ష చూసిన తిరుపతి వేంకటవులు ‘ఏము చూచిన రాజులందెల్ల నొక్క విజయనగర మహారాజు వేత్త’’ అని స్తుతించారు. నిండు మనసుతో ఆనందగజపతిని ఉద్దేశించి కవితా ప్రశంస చేశారు.ఆనంద గజపతి మేనబావయిన విజయరామ గజపతిని దత్తత చేసుకోవడం వలన, ఈయన ఉత్తర హిందుస్థానములవాడూ, రాజుగారి తల్లి తరపు బంధువర్గంలోనివాడూ కావడం మూలాన, ఈ దత్తత చెల్లదని దాయాదులయిన ఇతర ఆంధ్ర క్షత్రియ కుటుంబాలవారు, తెలుగువారయిన రాజబంధువులు, కోర్టులో దావాతెచ్చారు. ఇదే పెద్ద దావాగా పేరుపొందిన వ్యాజ్యం. దత్తత కోర్టువారిచే చిరకాల వ్యాజ్యం తరవాత ఆమోదించారు. రాజీ షరతుల ప్రకారం జొన్నవలస, పూసపాటిరేగ, కొఠాం, తాళ్ళవలస రాజబంధువులు కొంత సొమ్ము తమలో తాము పంచుకునేలా అంగీకారానికి వచ్చారు.విజయరామగజపతి-4 కాలంలో సైతం గురజాడ వారి సేవలు సంస్థానానికి అందాయి.

అయోధ్య తాలూకా ఖాట్మండు రాజ్యపాలకులయిన ఠాకూర్ సులాజ్‌బ గారి కుమార్తె లలిత కుమారీదేవిని, విజయరామ గజపతి వివాహమాడిన సందర్భంలో సంప్రదింపులు జరిపిన వారుగా గురజాడ వారిని ఇరుపక్షాలూ ఎంతో గౌరవించి ఆదరించాయి. మహారాజ కుమారికా లలిత కుమారీదేవి విజయనగరం కోటలో వున్న కాలంలోనే, అమె చొరవవల్ల గురజాడవారి ఇంటి స్థలం, ఇల్లువారికి కొంత మూల్యం స్వీకరించి సంస్థానం దఖలుపర్చింది. ఈ కృతజ్ఞతతోనే గురజాడ తన లైబ్రరీలోని పుస్తకాలపై ‘గురజాడ అప్పారావు, లలిత్ బిల్డింగ్’ అని రాసుకునేవారు.విజయరామ గజపతి, తమ తండ్రిగారయిన ఆనందగజపతి మార్గానే్న నడిచి, ఎనమండ్ర నారాయణమూర్తిగారిచే 1918లో కావ్యరచన పోటీలు నిర్వహించగా తదుపరి కాలంలో కవికోకిలగా ప్రసిద్ధుడయిన దువ్వూరి రామిరెడ్డి గారి కృషీవలుడు కావ్యం మొదటి బహుమతిని అందుకున్నది. వీరి పాలనా కాలంలోనే కోరుకొండ పాలస్ నిర్మాణం జరిగింది. అదే ప్రస్తుతం కోరుకొండ సైనిక స్కూల్ భవంతి.వీరి కుమారులు అలక్ నారాయణ గజపతికి ఆదిభట్ల నారాయణదాసుగారు షేక్స్‌పియర్, కాళిదాసు మహా కవుల కవిత్వంలోని నవరస ఘట్టాలను నవరస తరంగిణిగా అనువదించి అంకితమిచ్చారు. ఇంకా భోగరాజు నారాయణమూర్తి, ఆకుండి వెంకట శాస్ర్తీ, ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య తెనిగించిన గ్రంథాలు ఈయనకు అంకితం ఇచ్చారు.ఆధునిక కాలపు మహారాజు, సామాన్యులలో మాన్యుడు, సోషలిస్టు అయిన అయిదవ విజయరామగజపతి (పి.వి.జి.రాజు) విజయనగరం విద్యారంగాన, తన తండ్రిగారి పేరిట ‘మహారాజా’ అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ ఎండ్ సైనె్సస్’ 1958లో ప్రారంభించారు. ఇదే మాన్సాస్ (MANSAS) సొసైటీగా ప్రస్తుతం పలు కార్యక్రమాలకు, విద్యా వ్యాసంగాలకు ఊతగా నిలబడుతోంది. బీహార్ ప్రాంత రైతుల తరఫున ‘పన్నులు చెల్లింపు నిరాకరణ’ ఉద్యమంలో పాల్గొన్నందుకు యువకుడయిన విజయరామ గజపతి, సోషలిస్టు ఉద్యమకారులు రామ్‌మనోహర్ లోహియాతోపాటు, బీహార్‌లోని పుర్నియా చెరసాలలో నలభై అయిదురోజుల జైలుశిక్ష అనుభవించారు.ఒక్కొక్క రంగంలో తమ తమ కాలంలో తిరుగులేని పండితులు, కవులు, కళాకారులు ఎందరో. వీరిని కన్న నేల విజయనగర సరస్వతి ధన్య. వీరిది పోషించిన రాజులు తల్చుకోదగ్గవారు. ఈ పునరుజ్జీవన ప్రాభవాలను మానవ జీవితానికి సంప్రాప్తింపచేసిన మూడు వందలేళ్ళ కోట, తెలుగువారి తెలుగు తనాల నిధి. మన చారిత్రక సంపద. కవిత్వంలో కొంత అతిశయోక్తి లేకపోతే అది ఒక ఉత్సవ హేతువు కాలేదు. కత్తిపట్టినా, కవిత్వం చెప్పినా అడిదంవారికే చెల్లిందనేది ఉత్తమ సర్కార్లలో జగమెరిగిన సత్యం. పెద్దాపురం జమీందారు సభలో అడిదం సూరకవి చెప్పిన చాటువు ఇది.‘‘రాజు కళంక మూర్తి రతిరాజు శరీర విహీనుడంబికారాజు దిగంబరుండ, మృగరాజు గుహాంత సీమవర్తి విభ్రాజిత పూసపాడ్వి జమరామ నృపాలుడు రాజుగాక రుూరాజుల్ రాజులే పెను తరాజులు గాక ధరాతలంబునన్’’పదిహేడో శతాబ్ది పూర్వార్థంలో చెప్పిన ఈ చాటువు, పెద విజయరామరాజు కాలానికి చెందింది. ఇందులో ‘తరాజు’ అనే అన్యదేశీయ పదాన్ని సూరకవి ఉపయోగించాడు. తరాజు అనే ఉర్దూ మాటకు ‘తూకం వేసే త్రాసు’ అని అర్థం.ఇలా మానవ జీవితానికిగల ఎన్నో వైవిధ్యవంతమయిన కోణాలను తనలో ఇముడ్చుకున్న కాలపు కలకండ, రాతి పూలదండ మూడు వందలేళ్ళ విజయనగరం కోట.

రాళ్ళలో వికసించిన పూలు పరిమళాలు వెదజల్లితే, అది విజయనగరం సాక్షిగా తెలుగు నేల నలుచెరగులకూ వ్యాపించాయి. లలితకళామతల్లికి నాగరమై, వారి కధాపితామహుల కలనూపురమై గురజాడ విశ్వమానవతల గోపురమై, ఫిడేలు నాయుడి రాగాలలో పరశిస్తున్న విజయనగరం నక్షత్రాలు తాపడం చేసిన నేల అందులో భాగమే ఈ విజయనగరం కోట త్రిశతాబ్ది ఉత్సవ హేల.

Friday, October 26, 2012

గుడిమల్లం శివాలయం

గుడిమల్లం, చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామము. చారిత్రకంగా చాల ప్రాముఖ్యమైనది. ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం కలదు. ఇది క్రీ.శ. 1 లేదా 2 శతబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. పురావస్తు శాస్తజ్ఞ్రుల పరిశోధన ప్రకారం గుడిమల్లంలోని శివాలయం క్రీ.పూ. రెండో శతాబ్దం నాటిదని నిర్ణయించింది. అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు, ఎప్పుడు ప్రతిష్ఠించారో మాత్రం తెలియరావటం లేదు. అయితే ఉత్తర్రపదేశ్‌లోని మధురలో ఉన్న మ్యూజియంలో క్రీ.పూ. ఒకటవ శతాబ్దానికి చెందినది అంటూ ఒక లింగాన్ని భద్రపరచారు. అది ఈ గుడిమల్లం శివలింగాన్ని పోలి ఉంది. అలాగే ఉజ్జయినిలో క్రీ.పూ. మూడవ శతాబ్దానికి చెందినవిగా భావించే కొన్ని రాగి నాణలు దొరికాయి. వాటిపై ఉన్న చిత్రం అచ్చు గుడిమల్లం శివలింగమే. ఇక ఆలయంలోని శివలింగాకారం. ఇది చిత్రంగా, మరెక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది. దానిమీద రాక్షసుడి భుజాలపై నిలుచున్న శివమూర్తి ఉంటుంది. మంగోలులని పోలిన ఈరూపం ఖజురాహోలా కూడా కనిపించడం విశేషం. ఆంధ్రశాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయంగా భావిస్తున్న ఈ ఆలయానికి సంబంధించిన మరికొంత సమాచారం చంద్రగిరి కోటలోని మ్యూజియంలో లభ్యమవుతున్నది.


దేవాలయ చరిత్ర...

ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్చస్థితిలో నిలిపారు. తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడుచేసారు. కాకుంటే మూలవిరాట్‌ స్వామికి మాత్రం హాని కలగలేదు.

గుడిమల్లం శివలింగ విశిష్టత...


Gudimallam Shiva Lingam
 గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశు రామేశ్వరుడుగా పూజలందుకుంటున్నడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉన్నది. ఈ ఆలయంలో గర్భాలయం అంతరాలయం, ముఖమండపముల కన్నా లోతులో ఉంటుంది. ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్టించబడిన శివలింగం లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వలే ఉన్నాడు. ఈ లింగం ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన(స్థానకమూర్తి) రూపంలో అతి సుందరంగా ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు.

ప్రక్కన ఉన్న లింగం చంద్రగిరిలో గల రాజమహల్ ప్యాలస్ లోనిది. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యెక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప)ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్తమ్రు) ధరించి ఉన్నాడు. ఆ వస్తమ్రు మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్తమ్రు అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగము మరియు క్రింది పొడవైన స్థంభభాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి ఉంది. ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.

ఈ ఆలయం పశ్చామాభిముఖంగా ఉంటుంది. కొంత శాతవాహన నిర్మాణ శైలి కనిపిస్తుంది. తవ్వకాల్లో లభించిన శాసనాల బట్టి 12వ శతాబ్దంలో విక్రమచోళుడి కాలంలో పునర్నిర్మిత మైంది. గర్భాలయంపై కప్పు గజ పృష్ఠాకారంలో (ఏనుగు వెనుక భాగం) ఉంటుంది. చోళుల తర్వాత పల్లవులు కొంత కాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు. చోళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని ''తిరువిప్పరమ్‌ బేడు'' అని పిలిచినట్టు తెలుస్తోంది. అంటే తెలుగులో 'శ్రీ విప్రపీఠం' అంటారు. పల్లవుల నిర్వహణ లోకి వచ్చాక ఇది గుడిపల్లమైంది. కాలక్రమంలో అదే గుడి మల్లంగా మారి ఆలయం చుట్టూ నిర్మితమైన ఊరే గుడిమల్లంగా మారిపోయింది.

తిరుపతికి గానీ, రేణిగుంటకి గానీ రైల్లో చేరుకుంటే తిరుపతి నుంచైతే 22 కి.మీ., రేణిగుంట నుంచైతే 11కి.మీ. రోడ్డు ప్రయాణం చేసి ఈ ఊరు చేరుకోవచ్చు. అయితే ఇక్కడ సుప్రసిద్ధ ఆలయాల్లో మాదిరి ఉండేందుకు వసతి, హోటల్స్‌ లాంటివేమీ లేవు. మంచినీళ్లతో సహా మనమే తీసుకుని వెళ్లాలి. ఎందుకంటే ఇది చాలా చిన్న ఊరు కాబట్టి. అయినా ఇక్కడి దేవుడు మాత్రం లోకాలనేలే లోకేశ్వరుడే. పురావస్తు శాఖవారి అధీనంలో ఉన్న ఈ గుడి పురోభివృద్ధికి ప్రభుత్వం, భక్తులూ పూనుకుంటే అభివృద్ధి చెందడం ఎంతోసేపు పట్టదు. ఇలాంటి పురాతన ఆలయాలు మన చరిత్రకు సాక్షీభూతాలు. వీటిని సంరక్షించుకోవడం మన బాధ్యత.

సిద్ధార్థుడి అతిపెద్ద ఆలయం... బోరోబుడుర్

Borobudur Temple, Central Java, Indonesia
విశ్వవ్యాప్తంగా సిద్ధార్థుడి ఆనవాళ్ళు దాదాపు ప్రతి దేశంలో మనకు దర్శనమిస్తాయి. అయితే ... ప్రపంచంలో కేల్లా అతిపెద్ద బౌద్ధ దేవాలయం ఎక్క డుంది? అంటే మాత్రం... మన ఆలోచన జపాన్‌, చైనా, భారత్‌, భూటాన్‌ ల వైపు మళ్లుతుంది. ఎందుకంటే... ఈ దేశాలే కదా గౌతమ బుద్ధునితో అధికంగా అనుబంధాన్ని కలిగివున్నాయి. కానీ, పై ప్రశ్నకు సమాధానం వీటిలో ఏదీ కాదు. ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ దేవాలయం ఉన్న దేశం ఇండోనేషియా. అధిక సంఖ్యాక ముస్లిం జనాభా కలిగివున్న ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉంది ఆ దేవాలయం. అదే ‘బోరోబుడుర్‌’ ఆలయం...

ఇండోనేషియాలోని మధ్యజావాలో ప్రాంతంలో ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టులాంటి అందమైన లోయ ఒకటి కనిపిస్తుంది. అందులో ఠీవీగా నిలబడిన అగ్నిపర్వతాలు దర్శనమిస్తాయి. వాటి ముంగిట నిర్మించిన ఆలయమే ‘బోరోబుడుర్‌’. ఇదే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బౌద్ధాలయం.


అద్భుత రాతి కట్టడం...

Borobudur Stupas
పర్వత చక్రవర్తులుగా ప్రసిద్ధిచెందిన శైలేంద్ర వంశానికి చెందిన రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. బ్రహ్మాండమైన ఈ కట్టడ నిర్మాణం 750 - 850 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినట్లు చరిత్ర కారుల అంచనా. బోరోబుడుర్‌ ఆలయాన్ని చూసిన వారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దాని ఆకారం అలా వుంటుంది మరి. ఈ ఆలయంలోని స్థూపాన్ని నిర్మించడానికే 60,000 క్యూబిక్‌ మీటర్ల రాయి అవసరమైంది. ఎటువంటి లోపాలు లేని అంత పెద్ద శిలలను ఆ రోజుల్లో ఆ ప్రదేశానికి ఏలా చేర్చారా అనేది ఈ నాటికీ ఊహకందదు.కొన్ని వందల మంది శిల్పులు అహోరాత్రులు శ్రమపడి అద్భుతమైన ఈ స్థూపాన్ని సృష్టించారు. ఆలయ గోపురాన్ని ఆరు అంతస్థులుగా నిర్మించారు. ప్రతి అంతస్థును అపూర్వమైన శిల్పకళాశోభతో మెరిసిపోతూ వుంటుంది. ఘంటాకారంలో వున్న చిన్నచిన్న మందిరాలలో కూర్చునివున్న బుద్ధ విగ్రహాలు ఈ అంతస్థులలో అనేకం వున్నాయి.

ఈ బుద్ధ ప్రతిమలను తాకినవారికి మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.27 వేల చదరపు అడుగుల కైవారంలో నిర్మించిన కింది గ్యాలరీలన్నీ బుద్ధుని జీవితానికి సంబంధించిన శిల్ప దృశ్యాలతో మనోహరంగా శోభిస్తూ వుంటాయి. ఆలయ ప్రాంగణంలోనూ కుడ్యాలపైనా ఇంకా ఇతర చోట్ల మొత్తం 470కి పైగా బుద్ధ ప్రతిమలు బోరోబుడుర్‌లో వున్నాయి. నాగరికత, జన సమ్మర్థం బోరోబుడుర్‌ వైపు విస్తరించకపోవడంతో ఈ ప్రాంతం ఇంకా పచ్చదనంతో పరవళ్లు తొక్కుతోంది. ఆలయ మధ్యభాగంలో ఉన్న మహాస్థూపం ఆకాశాన్ని తాకుతోందా అనిపిస్తుంది.

శతాబ్దాలపాటు బూడిదలోనే..!

ఒకసారి జావాలో ప్రజ్వరిల్లిన అగ్నిపర్వతాల ప్రభావం బోరోబుడుర్‌ ఆలయం మీద కూడా పడింది. అగ్ని పర్వతాలు విరజిమ్మిన భస్మరాశి ఈ ఆలయాన్ని కప్పేసింది. అలా బూడిద కుప్పల కింద కొన్ని శతాబ్దాలపాటు వుండిపోయింది. 1814వ సంవత్సరంలో అప్పటి జావా గవర్నరు సర్‌ స్టాన్‌ ఫోర్డ్‌ రాఫిల్స్‌ ఆలయ ఉద్ధరణకు పూనుకుని తవ్వకాలకు ఆజ్ఞాపించాడు. భస్మరాసులను తవ్విపోసి ఆలయాన్ని వెలికితీశారు. తర్వాత 1907వ సంవత్సరంలో అప్పట్లో జావాను పరిపాలించిన డచ్‌ వారు ఆలయ పునర్నిర్మాణానికి పూనుకుని చాలా మరమత్తులు చేయించారు. కానీ, అదే సమయంలో ఆలయానికి అంతులేని అపకారాన్ని కూడా చేశారు.

అప్పట్లో జావా సందర్శించిన థాయ్‌లాండ్‌ చక్రవర్తి మెహర్భానీ కోసం ఆయనకు బహుమానంగా బోరోబుడుర్‌లోని అమూల్యమైన శిల్పాలను అనేకం సమర్పించుకున్నారు అప్పటి డచ్‌ ప్రభుత్వం వారు. దాదాపు ఎనిమిది బండ్ల నిండుగా ఆలయ శిల్పాలను, అద్భుతమైన బుద్ధ విగ్రహాలను థాయ్‌లాండ్‌కు తరలించారు. అవన్నీ కూడా యథాతథంగానే వుండివుంటే ఆలయ అత్యంతాద్భుత సౌందర్యంతో నిండివుండేది. వీక్షించ డానికి వేయి కనులున్నా చాలవనే చెప్పుకోవచ్చు. అయినా ఇప్పటికీ బ్రహ్మాండమైన తన ఆకారంతో అద్వితీయ శిల్పకళాసౌందర్యంతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే వుంది బుద్ధదేవాలయం.

మెండట్‌, కాండీపవాన్‌...

Mendut Temple, Centra Java, Indonesia
ఈ దేవాలయంలోకి ప్రవేశించేముందే భక్తులకు మరో రెండు ఆలయాలు దర్శనమిస్తాయి. ఆసలు ముందు ఈ ఆలయాలను సందర్శించిన తర్వాతే బోరోబుడుర్‌ ఆలయంలోకి వెళ్లడం ఆచారం. ఈ రెండు ఆలయాలలో మొదటిది మెండట్‌ ఆలయం. ఇది కూడా బుద్ధుని ఆలయమే. ఇందులో కూర్చొనివున్న బ్రహ్మాండమైన బుద్ధదేవుని విగ్రహం వుంది. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఈ బుద్ధుడు మామూలు ఇతర బుద్ధవిగ్రహాలలో మాదిరిగా పద్మాసనం వేసుకుని నిమీలిత నేత్రాలతో కూర్చొని వుండడు. మామూలుగా కూర్చుని వున్నట్లు వుంటాడు. బోరోబుడుర్‌ ఆలయంలోకి వెళ్లేముందు భక్తులు మెండట్‌ బుద్ధుణ్ణి అర్చించిన తర్వాతే ముందుకు వెళతారు. మెండట్‌ తర్వాత కాండీపవాన్‌ అనే గుడి కనిపిస్తుంది. ఇది ధనాధిపతి అయిన కుబేరుని గుడి.

ఈ గుళ్లో కొలువుతీరిన స్వామి కుబేరుడే. బౌద్ధులు కుబేరుణ్ణి అదృష్టదేవతగా భావించి అర్చిస్తూ వుంటారు. ఈ దేవాలయాల వల్ల కూడా బోరోబుడుర్‌ ఆలయం యొక్క అందం ప్రవిత్రతా ద్విగుణీ కృతమై వుంటాయి. ఆ కారణంగానే ఈ ఆలయ సముదాయాన్ని సందర్శించడానికి విదేశాల నుండి కూడా భక్తులు జావా ద్వీపం వస్తుంటారు. జావా చాలా అందమైన ద్వీపం. ఉత్సాహం, డబ్బు వుండాలి కానీ ఇక్కడికి చాలా తేలికగా చేరుకోవచ్చు. జావాలో అడుగుపెట్టిన తర్వాత ఎక్కడికయినా అతి సౌకర్యంగా బస్సులలో ప్రయాణించవచ్చు. రైళ్ల సౌకర్యం కూడా వుంది.