Monday, January 7, 2013

కనకపుష్యరాగం – పొణకా కనకమ్మ స్వీయచరిత్ర

“తెలుగునాట ఆడవాళ్ళు స్వీయచరిత్ర వ్రాసుకోవడము ఎక్కడైనా ఉండవచ్చును కానీ, అంతగా లేదు. ఆ భాగ్యము నాకు లభించినందుకు గర్వపడుచున్నాను.స్త్రీలకు సమర్థత లేక కాదుకానీ వారు బయట సంచరిటము తక్కువ” అంటూ తన స్వీయచరిత్రను కనకమ్మగారు 1959 జనవరి15న మొదలుబెట్టి 1960 సెప్టెంబరు 20న ముగించినా, ఏ కారణాలచేతో కాని, 2011 వరకూ అముద్రితంగానే ఉండిపోయింది. నెల్లూరులో విశ్రాంతజీవనం గడుపుతున్న డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారు పనిగట్టుకొని ఈ వ్రాతప్రతిని సంపాదించి, సంస్కరించి, కనకమ్మగారి గురించి ఇతర విషయాలను సేకరించి శ్రద్ధగా ప్రచురించారు.

కనకమ్మగారు 1892 జూన్ 10వతేదీన నెల్లూరుజిల్లా మినగల్లులో పుట్టారు. మడమనూరులో, పోట్లపూడిలో పెరిగారు. తండ్రి మరుపూరు కొండారెడ్డి, అమ్మ కామమ్మ. తాతలు కోడెల వ్యాపారులు. పడమటి బేరగాండ్రు ఇల్లంతా కంబళ్ళు పరచి వాటి మీద వెండిరూపాయలు కుప్పలు కుప్పలుగా పోసుకొని లెక్కపెట్టుకునేవారట. మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డిగారితో ఆమెకు తొమ్మిదవ ఏట వివాహమయ్యింది. పోట్లపూడిలోనే కాపురం. జిల్లాలోని పెద్ద కుటుంబాలలో ఒకటి. 800 ఎకరాల పొలం; 500 ఆవులుండేవట. కోడెదూడల మీద సంవత్సరానికి పదివేలరూపాయల ఆదాయం, 20,30 వేల రూపాయల ధాన్యం రాబడి. వారి అవ్వ మరణించినప్పుడు పదిపుట్ల అన్నప్రదానము చేశారట; వచ్చినవారికి “త్రాగటానికి నీరుపోసే అవకాశము లేక వీధులలో కాలువలు త్రవ్వి నీరు పారించినారు”. అన్నప్రదానము చేయుటలో సుబ్బరామిరెడ్డిగారికి పెట్టింది పేరు.

కనకమ్మ గారు చిన్నతనంలో చదువుకోలేదు. తర్వాత స్వయంకృషి వల్ల చదువుకున్నారు. క్రమంగా కావ్యాలు, సంస్కృతము, హిందీ నేర్చుకున్నారు. శశిరేఖ, హిందూసుందరి, అనసూయ పత్రికలకు పద్యాలు, వ్యాసాలు పంపేవారు, చెట్టునీడ ముచ్చట్లు పేర ఆమె హిందూసుందరిలో వ్రాసిన వ్యాసాలకు మంచి గుర్తింపు వచ్చింది.

పోట్లపూడిలో కనకమ్మగారు సోదరులు, మరదులు, నెల్లూరు రామానాయుడు (తర్వాత జమీన్‌రైతు పత్రిక సంపాదకుడిగా ప్రసిద్ధుడు), మరికొందరితో కలసి 1913లో సుజనరంజనీ సమాజం స్థాపించి గ్రంథాలయము, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. రాయప్రోలు సుబ్బారావు, దువ్వూరి రామిరెడ్డి వంటివారు సమాజ కార్యక్రమాలకు వచ్చేవారు. నెమ్మదిగా సమాజంలోకి రాజకీయ భావాలు వచ్చాయి. మద్రాసునుంచి రివాల్వరులు తెప్పించి వాటిని పేల్చడం ప్రాక్టీసు కూడా చేశారు. వెన్నెలకంటి రాఘవయ్యగారు పూనాలో తిలక్‌నీ, మద్రాసులో చిదంబరం పిళ్ళేని కలసివచ్చారు. స్వదేశీ వస్త్రాలు ధరించటం, హరిజనవాడల్లో సేవాకార్యక్రమాలు చేయడం మొదలుబెట్టారు. 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్రమహాసభలో ఆంధ్రరాష్ట్ర తీర్మానం చేశారు. నెమ్మదిగా ఆ ప్రాంతంలో జాతీయోద్యమంలో కనకమ్మగారి పాత్ర పెరగటం మొదలయ్యింది. పెద్దపెద్ద నాయకులందరూ వారి ఇంటనే బస చేసేవారు. గాంధీజీ, బిపిన్‌చంద్రపాల్, రాజేంద్రప్రసాద్, ప్రకాశం పంతులు, కాశీనాధుని నాగేశ్వరరావు వంటి జాతీయ, రాష్ట్రీయ నాయకులు వారి ఆతిథ్యం స్వీకరించిన వారే. గోగినేని రంగా, బెజవాడ గోపాలరెడ్డి, దుర్గాబాయి దేశముఖ్ వంటివారు సన్నిహితంగా ఉండేవారు.

ఈ కార్యక్రమాలలో నెమ్మదిగా ఆస్తులు తరగటం ప్రారంభమయింది. వెంకటగిరి రాజాతో ఇబ్బందులు మొదలయ్యాయి. వారి కుటుంబం జమీందారుకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. ఆ పోరాటంలో భాగంగానే జమీన్‌రైతు పత్రిక ఆవిర్భవించింది. ఇతరులు కూడా మోసం చేశారు. నివాసం పోట్లపూడినుంచి, పిడూరుకూ, అక్కడి ఆస్థీ పోయాక నెల్లూరుకూ మారింది. మోసం చేసినవారిగురించి, తర్వాత రోజుల్లో ఇబ్బందులు పెట్టిన వారి గురించి అవసరమైనదానికన్నా తక్కువ పరుషంగా మాట్లాడారు ఈ ఆత్మకథలోలో. ఆత్మస్థుతీ, పరనిందా రెండూ తక్కువే. పిడూరులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లంతా కాలిపోయి భారీనష్టం జరిగింది. పుస్తకాల బీరువా (కొన్ని అముద్రిత పుస్తకాలతో సహా) కాలిపోయింది. ఇల్లు పోయినదానికన్నా పుస్తకాల బీరువా పోయినందుకు ఎక్కువ బాధపడ్డాను అని అన్నారు కనకమ్మ గారు.

కనకమ్మగారు నెల్లూరు స్త్రీల కాంగ్రెస్ సంస్థను స్థాపించి స్వాతంత్ర్యపోరాటంలో అనేక ఉద్యమాలు నిర్వహించారు. రెండుసార్లు జైలుకు కూడా వెళ్ళారు. గాంధీజీ వచ్చినప్పుడు ఆమె, ఆమె కుమార్తె వెంకటసుబ్బమ్మ తమ వంటిపై నగలన్నీ కాంగ్రెస్ నిధికి ఇచ్చారు. 1934లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌కు ఉపాధ్యక్షులుగా ఎన్నికయిన మొదటి మహిళ కనకమ్మ గారు.

కనకమ్మగారి కుమార్తె చిన్న వయస్సులో మరణించారు. రమణ మహర్షి, ఆయన శిష్యుడు రామయోగుల దగ్గర కనకమ్మగారు దుఃఖోపశమనమనం పొందారు. వారి ఆశ్రమాలలో చాలాకాలం ఉన్నారు. ఆధ్యాత్మిక పుస్తకాలు రచించారు.

ఆడపిల్లలకోసం ప్రత్యేకంగా కస్తూరి విద్యాలయం స్థాపించారు. గాంధీజీ ఈ స్కూలు భవనానికి శంకుస్థాపన చేశారు. కుల మత వివక్ష లేకుండా ఆడపిల్లలకు హాస్టల్ వసతి కల్పించి చదువు చెప్పించేవారు. ప్రభుత్వగ్రాంటులులేకుండా, జాతీయోద్యమంలో భాగంగా, ఆదర్శపాఠశాలగా నడిపారు. ఆమె జైలుకు వెళ్ళినప్పుడు పాఠశాల మూత పడిపోయింది. మళ్ళీ 1944లో పాఠశాలను తిరిగి ప్రారంభించారు. తర్వాత బాలికలకోసం ఒక పారిశ్రామిక పాఠశాలను కూడా మొదలుబెట్టారు. వీటి నిర్వహణకోసం నిధులను ఆమే నాటక ప్రదర్శనలు నిర్వహించి, ఇతరత్రా కష్టపడి సంపాదించేవారు. కస్తూరి విద్యాలయ నిర్వహణనుంచి ఆమెను తప్పించటం ఆమె చరమాంకంలో విషాదఘట్టం. ఆరోగ్యం క్షీణించి, ఇబ్బందులు పడుతూనే స్వీయచరిత్రను ముగించి, 1963 సెప్టెంబరు 15న మరణించారు.

ఈ పుస్తకం చదువుతుంటే ఆరోజుల్లో ఆంధ్రదేశంలో హేమాహేమీలు అనదగ్గ వారందరితోనూ కనకమ్మగారికి సన్నిహిత పరిచయాలున్నట్టు తెలుస్తుంది. కాశీనాథుని, రాయప్రోలు, దువ్వూరి రామిరెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య, సి.ఆర్.రెడ్డి, మోటూరి సత్యనారాయణ, రంగా, నార్ల వంటివారితో మొదలుబెట్టి, సినిమానటులవరకూ అందరూ ఆమెకు పరిచయమే.

ఆవిడ చాలా కథలు, వ్యాసాలు, పద్యాలు వ్రాశారట (కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి). ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మతో కలసి జంట కవిత్వం చెప్పేవారట. కనకమ్మగారిని 1955లో గృహలక్ష్మి స్వర్ణకంకణంతో సత్కరించారు. అంతకు ముందే 1939లో గృహలక్ష్మి స్వర్ణకంకణ ప్రదానోత్సవ సభలో ఆమె చేసిన అధ్యక్షోపన్యాసం చదువుతున్నప్పుడు, ఆమె విషయ పరిజ్ఞానానికి, ఆధునిక ఆలోచనావిధానానికి ఆశ్చర్యం వేస్తూంది.

నెల్లూరు రాజకీయ సాంఘిక చరిత్రతో ఇంతగా ముడివడ్డ పొణకా కనకమ్మగార్ని నెల్లూరు పట్టణం ఎందుకో మరచిపోయింది. పొణకా కనకమ్మ బాలికల పాఠశాల మాత్రమే నెల్లూరులో ఆవిడ జ్ఞాపకం. ముప్పై ఏళ్ళ క్రితం తయారుచేసిన ఆమె కాంస్యవిగ్రహం ఇప్పటికీ ప్రతిష్టించకుండా ఏదో స్కూల్లో మూల గదిలో ఉందట.

Thursday, January 3, 2013

ఉద్యోగాల ‘జాతర’

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ముస్తాబవుతోంది. తమ సంక్షేమ పథకాలతో అన్ని రకాల ప్రజలను, అన్ని సామాజిక వర్గాల ప్రజలతో పాటు, విద్యార్థు లను, నిరుద్యోగులను కూడా హక్కున చేర్చుకోవాలని కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీని వల్ల వచ్చే ఎన్నికలలో ఓట్లు సంగతి ఎలా ఉన్నప్పటికీ విద్యార్థులు, నిరుద్యోగులకు మాత్రం మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకంలో ఎస్‌సి, ఎస్‌టీ, బిసీ సామాజిక వర్గాలకు చేరవుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో తక్షణమే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయడానికి కంకణం కట్టుకున్నది. ఏప్రిల్‌ నెలాఖరు లోగా 50 వేల ఉద్యోగాల భర్తీ కోసం అన్ని రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలన్న కృతనిశ్చయంతో సర్కారు ఉన్నది.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం మొత్తం 21 నోటిఫికేషన్లు ద్వారా 50 వేల సర్కారి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నదే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తపన. ఆ మేరకు అన్ని రకాల నియామక సంస్థలతో పాటు.. పలు ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఈ సారి వివాదాలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వయోపరిమితి పెంచడం, రిజర్వేషన్ల విధానాన్ని కచ్చితంగా పాటించడం. ప్రాంతాలు, లోకల్‌, నాన్‌ లోకల్‌ విధానంపై వివాదాలు లేకుండా చూడడంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. పలు రకాల వివాదాల వల్ల నోటిఫికేషన్లతో పాటు, నియామక ప్రక్రియలు కూడా నిర్ధాక్షణ్యంగా నిలిచి పోతున్నాయి. కాబట్టి ఎలాంటి వివాదాలకు ఆష్కారం లేకుండా.. నిరుద్యోగుల ప్రయోజనాలే ధ్యేయంగా నియామకాలు చేపట్టాలని ఏపీపీఎస్‌సీ, డిఎస్సీలతో పాటు.. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, జైళ్ల శాఖ వంటి సంస్థలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

32 వేల టీచర్ల భర్తీకి నెలాఖరులో నోటిఫికేషన్‌..

పాఠశాల విద్యా శాఖలో ఉన్న 32 వేల టీచర్‌ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులోగా డిఎస్సీ-2013 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయంపై మాధ్యమిక విద్యా శాఖ మంత్రి స్పష్టతతో ఉన్నారు. అందుకు సీఎం అనుమతి ఉండనే ఉన్నది. ఇప్పటికే డిఎస్సీ-2012 ద్వారా 21 వేల టీచర్ల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ఇందులో మిగులు పోస్టులు, ఖాళీలు, ఆర్‌విఎం ద్వారా వచ్చిన పోస్టులు కలుపుకుని దాదాపు 32 వేల పైగా సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేస్తారు. వీటితో పాటు భాషా పండితులు, పిఇటి పోస్టులు కూడా భర్తీ చేస్తారు. ఈ పరీక్షలకు దాదాపు మూడు లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది.

కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ జారీ..

పోలీస్‌ శాఖలో కానిస్టేబుళ్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6,071 కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులను పరుగు పందెం, శారీరక పరీక్ష, రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకోసం దాదాపు లక్షల మంది నిరుద్యోగులు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.

గ్రూప్‌ -1, గ్రూప్‌ -2 పై అభ్యర్థుల దృష్టి..

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పోస్టులుగా భావించే గ్రూప్‌-1 పోస్టులకు భర్తీపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో దాదాపు 350 వరకు పోస్టులు ఉన్నాయి. వీటిలో డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, సిటీఓలు, ఎకై్సజ్‌ సూపరింటెండెంట్లు, మున్సిపల్‌ కమీషనర్‌ గ్రేడ్‌-1 వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే రాష్ట్ర స్థాయి పోస్టులకు కచ్చితంగా ఇంటర్వ్యూలు నిర్వహించ నున్నారు. ఇదే క్రమంలో గ్రూప్‌-2 పోస్టుల పోస్టుల భర్తీ కోసం కూడా కొత్తగా నోటిఫికేషన్లు విడుదల చేసే ప్రక్రియ ప్రారంభం అయింది. గ్రూప్‌-2 ఉద్యోగ ప్రక్రియను పాత విధానంలోనే కొనసాగిస్తారని తెలిసింది. తాజాగా విడుదల చేసిన జీవో 623, 624 జీవోల ప్రకారం భర్తీ చేసే విషయాన్ని సర్కారు తాత్కాలికంగా నిలిపి వేసింది. దీంతో ఎగ్జిక్యూటీవ్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించే ఆలోచనలోనే ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌ ఉన్నారు. అలాగే గ్రూప్‌-4 పోస్టుల భర్తీ కోసం కూడా త్వరలో భారీ సంఖ్యతో నోటిఫికేషన్‌ విడుదల కాబోతున్నది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దాదాపు 1,500 వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలలో ఖాళీలుగా ఉన్న 5,705 లెక్చరర్ల పోస్టులకు కూడా త్వరలో ఆర్థిక శాఖ ఆమోదం తెలియజేయనున్నది. ఇవి జోనల్‌ పోస్టులుగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వివాదాలు లేకుండా సర్కారు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అలాగే ఈ ఖాళీలల్లో కాంట్రాక్ట్‌ లెక్చరర్లు కొనసాగుతున్నారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు బదులుగా రెగ్యులర్‌ లెక్చరర్లను నియమించాలని సర్కారు భావించింది. అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలలో ఖాళీలుగా ఉన్న దాదాపు 911 లెక్చరర్ల భర్తీ కోసం చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ వివాదాలను అధిగ మించి పోస్టులను భర్తీ చేయాలన్నది సర్కారు సంకల్పం. కాబట్టి ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 6వ తేదీన రాత పరీక్ష నిర్వహించన్నారు. ఇవి కాకుండా.. వీలయినంత త్వరలో మరో 200 పాలిటెక్నిక్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్‌ విడుదల కాబోతున్నది.

Wednesday, January 2, 2013

కొలువుల మేళా

కొలువుల మేళాఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి సుమారు 3500 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటనలు త్వరలో రాబోతున్నాయి. వివిధ శాఖల నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలు అందినప్పటికీ.. సామాజిక రిజర్వేషన్లు, ప్రాంతీయ వివరాలపై స్పష్టత కోసం ఎపీపీఎస్సీ అధికారులు సచివాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందుకు అనుగుణంగా అందే సమాచారాన్ని అనుసరించి ప్రకటనల జారీ జరుగుతుంది. మొత్తంమీద 16 రకాల ప్రకటనలు జనవరిలో కొన్ని, ఫిబ్రవరిలో మరికొన్ని రాబోతున్నాయి. గత వారం 610 ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ ప్రకటనలు జారీచేసింది. త్వరలో విడుదల చేయనున్న ప్రకటనల్లో.. పంచాయతీ కార్యదర్శుల పోస్టులు 2677 వరకు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరపాలని తొలుత నిర్ణయించారు.

 స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎపీపీఎస్సీని పరీక్ష జరపాలంటూ ప్రభుత్వం కోరింది. ఇందుకు అనుగుణంగా అధికారిక ఉత్తర్వుల్లో మార్పు జరగాల్సి ఉంది. ఈ విషయమై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఉత్తర్వులు వెలువడితే.. ఈ నెల మూడోవారంలో ప్రకటన వెలువడనుంది. కేన్‌ రెగ్యులేషన్‌ ఇన్‌స్పెక్టర్స్‌ పోస్టులు 37 ఉన్నాయి. వీటిని రాష్ట్ర పోస్టులుగా గుర్తించి 1965లో భర్తీచేశారు. ప్రస్తుతం జోనల్‌ పోస్టులుగా గుర్తించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. అలాగే అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఇరిగేషన్‌) పోస్టులు 465, ఇతర పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీలో సర్వీసు నిబంధనల అంశంపై స్పష్టత కోసం ఎపీపీఎస్సీ అధికారులు ఎదురుచూస్తున్నారు. సంబంధిత శాఖల నుంచి లభించే స్పష్టతను అనుసరించి ఈ ప్రకటనల జారీ వేగాన్ని అందుకోనుంది.గ్రూపు-1ఎ, బి, గ్రూపు-2 కింద గుర్తించిన ఉద్యోగ ఖాళీల వివరాలు ఎపీపీఎస్సీకి అందాయి. ఇవికాకుండా మరికొన్ని ఖాళీల వివరాలు అందనున్నాయి. ఎన్నికల దృష్ట్యా ప్రకటనల జారీ సమయానికి ఈ ఉద్యోగాల సంఖ్య బాగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీ తీరులో గత నెలలో విధానపరమైన మార్పులు జరిగాయి. ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల గతనెలలో జారీ అయిన ఉత్తర్వులపై పునస్సమీక్ష జరిపి అధికారిక నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఈలోగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత రానుంది. ఈ ఉద్యోగ ప్రకటనలు వెలువడేందుకుఏప్రిల్‌ వరకు సమయం తీసుకోనుంది.


క్షమించండి..

క్షమించండి..ఏపీపీఎస్సీలో చోటుచేసుకున్న సంఘటనలకు తాను బాధ్యుడినై ఉంటే క్షమించాలని సభ్యుడు జి.పద్దయ్య రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసే ఆదేశాలకు బద్ధుడినై ఉంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు లేఖ పంపారు. అందులో తాజా పరిణామాలపై కలత చెందానని పేర్కొన్నారు. తాను గ్రామీణ నేపథ్యంతో.. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని తెలిపారు. ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందన్న సమాచారం తనకు తొలుత అప్పటి ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు కె.సి.రెడ్డి నుంచి వచ్చిన ఫోన్‌ ద్వారా తెలిసిందని వెల్లడించారు. విద్యాపరమైన పరిశోధన రంగంలో ఉన్నందున తాను రాలేనని చెప్పినప్పటికీ, భవిష్యత్తులో మంచి అవకాశాలు రావోమోనన్న ఉద్దేశంతో చివరికి అంగీకరించానని పేర్కొన్నారు. తాను గుంటూరు జిల్లాలో గ్రూపు-2 పరీక్షకు తొమ్మిది మంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చినప్పటికీ పరీక్ష రాసేందుకు మానవీయ కోణంలో అంగీకరించానని వెల్లడించారు. తాజా పరిణామాల పట్ల మానసికంగా ఆందోళనకు గురయ్యానన్నారు. ఒకవేళ తాను ఏ రకంగానైనా బాధ్యుడిని అయి ఉంటే బేషరతుగా క్షమాపణ వ్యక్తం చేస్తున్నట్లు గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తానని హామీ ఇచ్చారు. మన్నించి ఈ సంకట పరిస్థితి నుంచి బయట పడేయాలని కోరారు. ఈ లేఖను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌లకు కూడా పద్దయ్య పంపారు.